చాలామంది తలకు టోపీ ధరిస్తారు. కొందరూ యువకులు ఫ్యాషన్‌గా ధరించగా మరికొందరూ ఎండ నుంచి రక్షణ కోసం పెట్టుకుంటారు. ఇక హెల్మెట్లంటారా బండి డ్రైవ్ చేయాలంటే తప్పదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మట్ తప్పనసరిగా ధరించాల్సిందే. వెనుక కూర్చొన్నవాళ్లు కూడా పెట్టుకోవాల్సిందే. అయితే ఇవి తలకు పెట్టడం వల్లే జుట్టు ఊడిపోతోందని చాలా మంది అనుకుంటారు. అవి పెట్టడం వల్ల తలలో చెమట పట్టి త్వరితగతిన జుట్టు రాలి బట్టతల వస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవకు నిజం?. నిజంగానే టోపీ, హెల్మెట్లు ధరిస్తే బట్టతల వస్తుందా?
అయితే వైద్యుల మాత్రం అదంతా అపోహ అని తేల్చి చెబుతున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోదని వైద్యులు చెబుతున్నారు. బట్టతల రావడానికి అనేక కారణాలు ఉంటాయని దానికి, ఈ టోపీలకు ఎలాంటి సంబంధం లేదని వివరిస్తున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుందే తప్ప ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు. అలాగే ఆరుబయట ఎండలోకి వెళ్ళినప్పుడు... ఆ ఎండకి మాడు వేడెక్కిపోతుంది. అలా వేడెక్కకుండా ఉండడం కోసమే టోపీని ధరిస్తూ ఉంటారు. అంతే తప్ప టోపీ వల్ల జుట్టు రాలిపోవడం జరగదు.
అలా అని మరీ బిగుతుగా ఉండే టోపీలు వాడకపోవడమే మంచిది. కాస్త జుట్టుకు గాలి తగులుతూ ఉండడం చాలా అవసరం. జుట్టు తీవ్రంగా రాలిపోవడానికి, బట్టతల రావడానికి టోపీ ఏనాటికే కారణం కాదని అన్నారు నిపుణులు. ఇక హెల్మట్లు కూడా మన రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనల ప్రకారం తప్పనసరిగా ధరించాల్సిందే. అయితే దీనికి జుట్టు రాలడానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తలకు సరిపడ హెల్మట్ ధరించండి, దీంతోపాటు అదే పనిగా తలపై హెల్మెట్ ధరించకండి అంటే మధ్య మధ్యలో తీస్తు కాస్త తలకు భారం తగ్గించమంటున్నారు. అలాగే లాంగ్ డ్రైవ్ చేసేవాళ్లు కూడా విరామం తీసుకుంటూ వెళ్లండని సూచిస్తున్నారు నిపుణులు
ఎందుకు రాలిపోతుందంటే..
హఠాత్తుగా జుట్టు రాలిపోతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కొసారి కొన్ని వ్యాధులకు ఇది సంకేతం కూడా కావొచ్చు. దీంతోపాటు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లను ఉంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించాలి. అలాగే తండ్రికి బట్టతల ఉన్నా... భవిష్యత్తులో కొడుకులకు, మనవళ్లకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే హార్మోన్లలో హఠాత్తుగా విపరీతమైన మార్పులు వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. ఇవిగాక గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా వస్తాయి. ఇలాంటి వారికి కూడా వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. అంతేగాక వాతావరణ కాలుష్యం వల్ల కూడా జుట్లు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడే మహిళలు, పురుషల్లో జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంది.
జుట్టు చక్కగా పెరగాలంటే..
ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం చాలా ముఖ్యం. మీ జీవన శైలి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే జుట్టు కూడా అంతే బలంగా పెరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల తలకు రక్తప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. తత్ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు రాలుతున్నప్పుడే వైద్యులను సంప్రదిస్తే సమస్యను అధిగమించొచ్చు. చాలా జుట్టు కోల్పోక ముందే వైద్యలను సంప్రదించడం మంచిది. అంతేగాక జుట్టు మురికి పట్టకుండా వారానికి మూడుసార్లు తల స్నానం చేయాలి. ఎప్పటికప్పుడూ నూనెలతో మర్దనా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment