హెల్మెట్‌ పెట్టుకుంటే బట్టతల వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి | Does Wearing A Helmet Cause Hair Loss? Here Some Tips To Protect Your Hair From A Helmet - Sakshi
Sakshi News home page

Helmet And Hair Loss: హెల్మెట్‌ పెట్టుకుంటే బట్టతల వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి

Published Fri, Sep 8 2023 4:17 PM | Last Updated on Fri, Sep 8 2023 5:57 PM

Wearing Helmet Is Connection With Hair Loss - Sakshi

ఈమధ్య కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య బట్టతల. దీనికి అనేక కారణాలున్నాయి. తీసుకునే ఆహారం, నిద్ర, లైఫ్‌స్టైల్‌, జన్యపరమైన సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలడానికి కారణం కావొచ్చు.

ఇవి కాకుండా హెల్మెట్‌ రోజూ ధరించడం వల్ల కూడా బట్టతల వస్తుందని చాలామంది అనుకుంటారు. మరి హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల నిజంగా జుట్టు రాలుతుందా? బట్టతల రాకుండా ఏం చేయాలి అన్నది ఈ ఇంట్రెస్టింగ్‌ స్టోరీలో తెలుసుకుందాం.


వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. బైక్‌పై రయ్‌రయ్‌ మని తిరగాలంటే హెల్మెట్‌ ఉండాల్సిందే. అయితే నిత్యం హెల్మెట్‌ పెట్టుకుంటే జుట్టు రాలుతుందన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఇదే కారణంగా యువత హెల్మెట్‌ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. హెల్మెట్‌కి, బట్టతలకి ఎలాంటి సంబంధం లేదు.

హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి నుంచి జుట్టు పొడిపారకుండా ఉంటుంది. అయితే ఎక్కువసేపు ధరిస్తే మాత్రం తలలో వేడి పెరిగి దాని వల్ల జుట్టులో చెమటకి దారితీస్తుంది.నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. మంచి క్వాలిటీ హెల్మెట్‌ ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు కాపాడటమే కాకుండా జుట్టుకు ఎలాంటి ఇబ్బంది రానివ్వదు. అందుకే మంచి సౌకర్యవంతమైన, నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి. 

బట్టతల రాకుండా ఏం చేయాలి?
హెల్మెట్‌ను వాడిన తర్వాత గాలి తగిలే చోట ఉంచాలి. రెండు, మూడు రోజులకోసారి ఎండలో ఉంచాలి. 
► హెల్మెట్‌ లోపల ఉండే కుషనింగ్‌ మీద ఉన్న మురికిని ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకోవాలి. 
► హెల్మెట్‌ తీసేటప్పుడు కొందరు చాలా ఫాస్ట్‌గా తీస్తుంటారు. అలా చేయరాదు. 
► ఎందుకంటే అప్పటికే చాలాసేపటి వరకు హెల్మెట్‌ జుట్టుకు అతుక్కొని ఉంటుంది. కాబట్టి హెల్మెట్‌ తీసేటప్పుడు మెల్లిగా తీయండి
► చండ్రు, బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వేరేవాళ్ల హెల్మెట్లు వాడకపోవడమే మంచిది. 
► హెల్మెట్‌ వాడటానికి ముందు లోపలిభాగంలో ఒక ​‍క్లాత్‌ ఉంచండి. దీనివల్ల జుట్టు దెబ్బతినదు.

 
► చాలామంది తలస్నానం చేసిన వెంటనే తడి ఆరకుండానే హెల్మెట్‌ ధరిస్తుంటారు. అలా అస్సలు చేయొద్దు.
► జుట్టు పూర్తిగా పొడిగా మారిన తర్వాతే హెల్మెట్‌ ధరించాలి. లేకపోతే ఫంగల్‌, దురద సమస్యలు వస్తాయి. 
► అంతేకాకుండా తడిజుట్టుపై హెల్మెట్‌ ధరిస్తే జుట్టు బలహీనంగా మారి త్వరగా ఊడిపోతుంది కూడా. 
► వీటన్నింటితో పాటు తరచుగా నూనెతో మర్దనా చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 
► మంచి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. 
మానసిక ఒత్తిడితో బాధపడేవాళ్లలో జుట్టు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్ సిస్టమ్ మీద ప్రభావితం చూపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement