యంగ్ టాలెంట్
ఊపిరితిత్తుల జబ్బు బారిన పడకుండా.. హెల్మెట్
ఆలోచించాలేగానీ.. శతకోటి సమస్యలకు అనంత కోటి పరిష్కారాలు ఉంటాయి. మామయ్యను అనారోగ్యానికి గురి చేసిన సమస్యపై దృష్టి పెట్టిన హరిత ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుంది. శాస్త్రప్రపంచంలో తొలి అడుగు వేసింది...
పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన హర్షిత చిన్ననాటి నుంచి తెలివైన విద్యార్థి. జెడ్పీ హెచ్‌ఎస్ చందనాపూర్‌లో చదువుతుండేది. క్రమం తప్పకుండా బడికి వచ్చే హర్షిత ఒకసారి వరుసగా వారంరోజులు రాలేదు. ఆ తరువాత బడికి వచ్చిన హర్షితను సైన్స్ టీచర్‌తో పాటు క్లాస్ టీచర్‌గా ఉన్న సంపత్ కారణం అడిగారు.
తన మామయ్య వెల్డింగ్ పనిచేస్తాడని, వెల్డింగ్ పొగ పీల్చి ఊపిరితిత్తులు జబ్బు పడ్డాయని, ఆయనకు సహాయంగా ఉండేందుకు స్కూలుకు రాలేదని చెప్పింది. ‘మామయ్య మరోసారి జబ్బు పడకుండా ఏదైనా చేయాలని ఉంది’ అని తన మనసులోని మాట చెప్పింది. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో హరిత ఒక హెల్మెట్ తయారుచేసింది. చిన్న ఫ్యాన్ అమర్చి రూపొందించిన ఈ హెల్మెట్ వెల్డింగ్ సమయంలో పొగను ముఖం వరకు చేరనివ్వదు. హరిత రూపొందించిన హెల్మెట్ చూసి సైన్స్ టీచర్ ఆశ్చర్యపోయారు. హరితను అభినందించారు.
తొలుత ప్రోటోటైప్‌గా రూపొందించిన ఈ హెల్మెట్‌ను ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో మరింత మెరుగు పరిచింది. హెల్మెట్‌కు ఒక సెన్సార్ బిగించి, వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి ముఖం పైకి పొగ రాగానే హెల్మెట్‌పై ఉన్న ఫ్యాన్ దానంతట అదే తిరిగేలా డిజైన్ చేసింది. సిమెంటు, ఇటుక, పిండిమర.... మొదలైన పరిశ్రమలలో పని చేసే కార్మికులు, నిరంతరం దుమ్ములో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా రక్షణ ఇస్తుంది. దీనికి ‘కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ హెల్మెట్’గా నామకరణం చేసింది. ఈ హెల్మెట్ జపాన్ సకురా ఇంటర్నేషనల్ సైన్స్ప్రోగ్రాం, ఇండియన్ ఇంటర్నేషన్ ఇన్నోవేషన్ప్రోగ్రాం, ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ప్రోగ్రామ్‌లకు ఎంపికైంది.
స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్‌బాటిల్.
కరోనా టైమ్‌లో స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్ బాటిల్‌ను తయారు చేసింది హర్షిత. ఈ బాటిల్‌ను మూడు అరలుగా విభజించారు. మొదటి అరలో శానిటైజర్, రెండో అరలో తాగునీరు, మూడో అరలో సబ్బు/స్నాక్స్ పెట్టుకునేలా ఈ బాటిల్‌ను రూపొందించింది. ప్రతీ అరగంటకు ఒకసారి నీరు తాగే విషయాన్ని మనకు రెడ్‌లైట్‌తో లేదా వైబ్రేషన్, సౌండ్ సదుపాయాల ద్వారా గుర్తు చేస్తుంటుంది. హర్షిత కరీంనగర్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. – బాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్
ఇవి చదవండి: ఇన్‌ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment