గణనీయంగా పెరుగుతున్న విగ్గుల వినియోగం
17 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు వారే అధికం
నాన్ సర్జికల్ మెథడ్స్‌పై ఆసక్తి
ఖర్చుకు వెనుకాడని వైనం
వయసుతో సంబంధం లేదు.. స్త్రీ, పురుషులు అనే తేడా కనిపించడం లేదు. ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం అనేది అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్యగా మారిపోయింది. 17 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు గల వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. జుట్టు ట్రాన్స్‌ప్లాంటేషన్, పీఆరీ్ప, స్కాల్ఫ్ త్రెడ్, విగ్గు వంటివి మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా విగ్గు అందరికీ అందుబాటులో కనిపిస్తోంది. గత రెండేళ్ల నుంచి విగ్గుల వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయా రంగాలకు చెందినవారు చెబుతున్నారు. దీని కోసం డబ్బులు ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్ధపడుతున్నారట. ఫలితంగా నగరంలో ఈ కేటగిరీకి చెందిన క్లినిక్‌లు పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి.
టీనేజ్‌లో ఉన్న వారికి జుట్టు రాలిపోవడంతో వివాహ సమయంలో తిరస్కరణకు గురవుతున్నామన్న భావన కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని మరికొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే విగ్గు పెట్టుకోవడం వల్ల మానసిక, ఆత్మ స్థైర్యం పెరుగుతుందని పలువురు మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఏడాది నుంచి మూడేళ్ల వరకూ..
సమాజంలో ఎత్తిపొడుపులు భరించలేక, ఎదుటి వ్యక్తుల సూటిపోటి మాటలను తట్టుకోలేక కూడా విగ్గు ధరించడానికి ఆసక్తిచూపిస్తున్నారట. హెయిర్ ప్లాంటేషన్‌కు ఇతర మార్గాలు ఉన్నప్పటికీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ పట్ల మొగ్గుచూపిస్తున్నారు. కొంత మంది శుభకార్యాలకు, టూర్, కార్యాలయానికి ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన విగ్ వినియోగిస్తున్నారట. విగ్గు అందరికీ అందుబాటైన ధరలో అందుబాటులో ఉంటుంది. వివిధ రకాల కారణాలతో అందరి దృష్టినీ విగ్గులు ఆకర్షిస్తున్నాయి. ఒక్కో ప్రాసెస్ (విగ్గు) సుమారు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తయారీలో వినియోగించే ముడిసరుకు (మెటీరియల్) నుంచి సంబంధిత సంస్థ విగ్గు అతికించే ప్రక్రియపై ధర అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా తయారైన విగ్గు ఏడాది నుంచి మూడేళ్ల వరకూ వినియోగించుకోవచ్చు.
ఆ సమస్య తగ్గింది..
పదేళ్ల క్రితం నుంచి జుట్టు రాలిపోవడం మొదలైంది. తక్కువ సమయంలోనే తల మొత్తం ఖాళీ అయ్యి బట్టతల వచి్చంది. ఆఫీస్‌లో సహచర సిబ్బంది, స్నేహితులు హేళన చేసేవారు. కొన్ని సందర్భాల్లో నా మనసుకు అది నచ్చేది కాదు. పనిమీద ఏకాగ్రత కుదిరేది కాదు. స్నేహితుడి సూచన మేరకు ఆరు నెలల క్రితం విగ్గు తీసుకున్నా. పస్తుతం ఆ పరిస్థితి లేదు.. ప్రశాంతంగా పనిచేసుకుంటున్నా..
– జి.రామ్మోహన్‌రావు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, మాదాపూర్
జుట్టు రాలడానికి గల కారణాలు..
విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా వివిధ రంగాల్లో అన్ని వయసుల వారిపైనా ప్రధానంగా ఒత్తిడి కనిపిస్తోంది. దీనికి తోడుగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన అంశాలు, పౌష్టికాహార లోపం, అతిగా మందులు వినియోగించడం, బాలింతలు, చుండ్రు, పీసీఓఎస్ తదితర సమస్యల కారణంగా జుట్టు అధికంగా రాలిపోతోంది. ప్రధానంగా మహిళలు ఈ సమస్యపై చర్చించడానికి సిద్ధంగా లేరని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. పురుషుల్లో 17 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య, మహిళల విషయంలో చూస్తే 36 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య జుట్టు రాలుతోంది. దీంతో ఇన్‌స్టంట్ మేకప్ కోసం విగ్గులను వినియోగిస్తున్నారు.
స్టయిల్‌కి తగ్గ మోడల్స్..
వినియోగదారుడి అభిరుచి మేరకు తయారీ సంస్థలు విగ్గులు సిద్ధం చేస్తున్నాయి. ప్రధానంగా ఇండియన్ ప్యాచ్, హాలీవుడ్ ప్యాచ్, కొరియన్ ప్యాచ్ అనే మూడు రకాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో కొరియన్ ప్యాచ్‌కు ఆదరణ తక్కువ. పురుషులు, మహిళలు కోరుకున్న, అవసరమైన రంగు, అడిగినంత పొడవుతో విగ్గులు తయారుచేస్తున్నారు.
యువతే ఎక్కువ..
చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం సర్వసాధారణం అయిపోయింది. నాలుగేళ్ల క్రితం చాలా అరుదుగా విగ్గు కావాలని అడిగేవారు. ప్రస్తుతం నెలకు 60 నుంచి 100 మంది వరకూ కొత్త వ్యక్తులు వస్తున్నారు. వివాహం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు విగ్గుల ధరించేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. విగ్గు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తక్కువ ఖర్చులో మంచి లుక్ వస్తుంది.
– రవికాంత్, ఆర్కే హెయిర్ సొల్యూషన్స్
Comments
Please login to add a commentAdd a comment