ఆధునిక ప్రపంచంలో అందానికి ప్రాధాన్యత పెరిగింది. వయసు పైబడినా కూడా 20 సమ్‌థింగ్ లాగా కనిపించడం సాధ్యమే. శరీరంలోని ఏ భాగాన్నైనా మన ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత ఇరవయ్యేళ్లుగా గ్లోబల్ బ్యూటీ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించింది.
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషులను భయపెడుతున్న సమస్య బట్టతల. కొంతమందికి చిన్న వయసులోనే వెంట్రుకలు రాలుతూ ఉంటే బట్టతల వచ్చేస్తుందేమో అని టెన్షన్ వారిని స్థిమితంగా కూర్చోనీయదు దీనికి పరిష్కారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. మరోవిధంగా చెప్పాలంటే బట్టతల మీద కృత్రిమంగా జుట్టును మొలిపించుకోవడం. ఈ విషయంలో టర్కీ టాక్ ఆప్ ది వరల్డ్‌గా నిలుస్తోంది.
టర్కీకే ఎందుకు
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు భారీగానే ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల జుట్టు మార్పిడికి ప్రపంచ వ్యాప్తంగా టర్కీ ఒక ముఖ్యమైన డెస్టినేషన్‌గా మారిపోయింది. బట్టతలపై పుష్కలంగా జుట్టు రావాలన్నా, బట్టతల మచ్చలను కప్పిపుచ్చుకోవాలన్నా టర్కీకి క్యూ కడుతున్నారు పురుషులు.
పెరుగుతున్న ప్రజాదరణ
ఇండియా టుడే కథనం ప్రకారం "అత్యంత నైపుణ్యం, అనుభవజ్ఞులైన సర్జన్లు, అధునాతన వైద్య సదుపాయాలు, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చులతో సహా అనేక కారణాల వల్ల టర్కీ జుట్టు మార్పిడికి ప్రముఖ గమ్యస్థానంగా మారింది" అని ఆర్టెమిస్ హాస్పిటల్ చీఫ్, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ విపుల్ నందా తెలిపారు.
అంతేకాదు వసతి, రవాణాతో సహా మెడికల్ టూరిజం ప్యాకేజీలను కూడా అందజేస్తోందట టర్కీ ప్రభుత్వం. చికిత్స కోసం దేశాన్ని సందర్శించే ప్రతి వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాగే స్థానిక క్లినిక్‌లు అత్యాధునిక సాంకేతికతలు, సాంకేతికతలతో చక్కటి ఫలితాలను సాధిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టర్కీలో బ్లాక్ మార్కెట్ కూడా విస్తరించిందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చు విషయానికి వస్తే..
క్లినిక్, సర్జన్ నైపుణ్యం లాంటి అంశాల ఆధారంగా జుట్టు మార్పిడికి అయ్యే ఖర్చు మారుతుంది. మన ఇండియాలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు 83 వేల నుంచి రూ. 2 లక్షల 50 వేలు అవుతుంది. టర్కీలో, సగటున సుమారు రూ. 1,24,000 నుండి రూ. 2 లక్షల 90 వేల వరకు ఉంటుంది. ఇది పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ.
Comments
Please login to add a commentAdd a comment