జుట్టు రాలిపోతోంది, ఏమయినా చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. ఈ మధ్య వెంట్రుకలు బాగా రాలిపోతుంటే డాక్టర్‌ను సంప్రదించాను. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. దీనికి హోమియోలో ఏమయినా చికిత్స ఉందా? - అనిల్‌కుమార్, హైదరాబాద్
జుట్టు రాలే సమస్యను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి స్త్రీలలో జుట్టు రాలడం, పురుషుల్లో జుట్టు రాలడం, పేను కొరకడం, జుట్టు మొత్తం ఊడిపోవడం.
పురుషుల్లో జుట్టు రాలడం: కొందరు పురుషుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీనివల్ల ముఖం మీద, నుదురు భాగంలో ఉండే జుట్టు సరిహద్దు క్రమంగా పలచబడి వెనక్కు వెళుతుంది. వీరిలో ఏదో ఒక ప్రాంతంలో పూర్తిగా జుట్టు ఊడిపోయి, తిరిగి అభివృద్ధి చెందదు. దీన్ని బట్టతల అంటారు. ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది.
స్త్రీలలో జుట్టు రాలడం: స్త్రీలలో ముఖ్యంగా తలస్నానం చేసిన తర్వాత దువ్వుకొనేటప్పుడు ఎక్కువగా చిక్కుబడిపోయి జుట్టు ఊడుతుంది. స్త్రీలలో జుట్టు రాలడానికి హార్మోన్ సమస్యలు, థైరాయిడ్, నెలసరి సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన కారణం.
పేనుకొరుకుడు: దీనిని అలోపేసియా అంటారు. కొందరిలో తలలో లేక మీసం, గడ్డంలో జుట్టు వృత్తాకారంలో ఊడిపోవడం జరుగుతుంది. దీనికి మానసిక ఒత్తిడి ఒక కారణమైతే శరీర రక్షణ వ్యవస్థ జుట్టు మీదకు దాడి చేసి కుదుళ్లను దెబ్బతీయడం మరోకారణం.
జుట్టు మొత్తం ఊడిపోవడం: టోటల్ అలోపెసియస్: కొద్దిమందిలో తలపై ఉండే జుట్టు మొత్తం కనుబొమలు, కనురెప్పలతో సహా ఊడిపోవడం జరుగుతుంది. దీనికి మానసిక ఒత్తిడి, ఆటో ఇమ్యూనిజం కొంతవరకు కారణం కావచ్చు.
కారణాలు: పోషకాహార లోపం, గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత, అధిక ఒత్తిడి, ఐరన్ లోపం, దీర్ఘకాలిక వ్యాధులు, స్త్రీలలో బిడ్డ పుట్టిన తర్వాత మూడు నెలలకు జుట్టు రాలడం ఎక్కువ కావచ్చు. కొన్ని రకాల మందుల ప్రభావం, ఇన్ఫెక్షన్లు, పిల్లల నెత్తిపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లు.
నిర్ధారణ: సీబీపీ, టిఎస్‌హెచ్, హార్మోన్ పరీక్షలు, రక్తంలో గ్లూకోజ్ శాతం, కొవ్వుశాతం నిర్థారించే పరీక్షల ద్వారా.
జాగ్రత్తలు: కృత్రిమంగా తయారయే హెయిర్‌డైలు, కృత్రిమ రంగులను జుట్టుకు ఉపయోగించవద్దు. మంచి షాంపూతో వెంట్రుకలను శుభ్రం చేసుకుని, తడి లేకుండా తుడుచుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, క్యాల్షియం, ఐరన్ ప్రొటీన్లు, అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. తగినంత నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
హోమియో చికిత్స: హోమియో చికిత్స విధానంలో జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు మంచి మందులున్నాయి. ముందే కనిపెట్టి, తగిన మందులు వాడితే ఉపయోగం ఉంటుంది. పూర్తిగా బట్టతల అయిన తర్వాత ఇంక హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషనే శరణ్యం. జన్యులోపాలు, హార్మోన్ల సమస్యలను సరిచేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. దీనికి యాసిడ్ ఫ్లోర్, ఆలోస్, నెటమొర్, యూస్పిలిగో, ఫాస్పరస్ మందులు డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు 15 ఏళ్లు. గత ఏడాది క్రికెట్ ఆడుతుండగా అతడి కుడి మోకాలిలో నొప్పి వచ్చింది. తర్వాత అది తగ్గినా మోకాలిలో కొన్నిసార్లు వాపు వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాం. ఎక్స్-రే తీయించాం. కానీ అది నార్మల్ అని వచ్చింది. రెండు వారాల తర్వాత ఎమ్మారై కూడా చేయించాం. అందులో కార్టిలేజ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. అది తగ్గదనీ, ఆ తర్వాత ఆర్థరైటిస్‌కు దారి తీస్తుందని డాక్టర్ చెబుతున్నారు. రెండో మోకాలిలోనూ నొప్పి వస్తోంది. ఈ వయసులోనే ఇలా ఉంటే, భవిష్యత్తులో అతడి పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - సురేశ్‌బాబు, బాపట్ల
పిల్లలు ఆడుకునే సమయంలో జరిగే దురదృష్టకరమైన సంఘటనలు ఇవి. ఎమ్మారైలో కనిపించిన రిపోర్టులను బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ అబ్బాయికి వచ్చిన సమస్యను వైద్యపరిభాషలో ‘ఆస్టియో కాండ్రైటిస్ డిసెకాన్స్’ అంటారు. కంటికి కనిపించనంత చిన్న గాయాల వల్ల కార్టిలేజ్‌కు రక్తసరఫరాలో వచ్చే లోపాలతో ఈ సమస్య వస్తుంటుంది. మరీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఒక మోకాలికి ఈ సమస్య వస్తే 20 శాతం మందిలో రెండో మోకాలికీ ఇదే సమస్య రావచ్చు.
అయితే ఈ విషయంలో రోగులకు శుభవార్త ఏమిటంటే... గతంలోలా దీనికి చికిత్స లేని పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానం వల్ల తగిన చికిత్స చేసి ఈ ‘ఆస్టియోకాండ్రైటిస్ డిసెకాన్స్’ సమస్యను నయం చేయవచ్చు. ఆర్థ్రోస్కోప్ (కీ-హోల్ సర్జరీ) ప్రక్రియ ద్వారా ఎముకకు ఆగిపోయిన రక్తప్రసరణను పునరుద్ధరించవచ్చు. దాంతో ఎముకలో కార్టిలేజ్ (చిగురు ఎముక/మృదులాస్థి) మళ్లీ పెరిగి, మోకాలు ముందులాగే ఉండేలా చూడవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే... ఈ చికిత్స అయ్యేవరకూ అతడు ఆటలాడకుండా, పరుగెత్తకుండా చూడాలి. మీరు ఆందోళన చెందకుండా ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,
హైదరాబాద్
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. మూడేళ్లుగా హైబీపీ ఉంది. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రొటీన్‌గా టెస్ట్ చేయించుకుంటే క్రియాటినిన్ 6 అనీ, యూరియా 120 అని రిపోర్టు వచ్చింది. నా కిడ్నీలు పనిచేయడం లేదని చెప్పారు. ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఇలా ఉండవచ్చా? - కుమారస్వామి, గూడూరు
మీకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది. రెండు కిడ్నీలు పనితీరు 50 శాతం తగ్గినప్పటికీ లక్షణాలు ఏవీ కనిపించకపోవచ్చు. కొంతమందిలో కిడ్నీ పనితీరు 15 శాతానికి పడిపోయినప్పుడు కూడా ఏ ఇబ్బందులూ కనిపించకపోవచ్చు. కానీ కేవలం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే విషయం బయటపడుతుంది. అందుకే ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ రిస్క్ ఉంటుందో (బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీలో ఇన్ఫెక్షన్, ఫ్యామిలీలో కిడ్నీ వ్యాధులు) వారు ప్రతి ఏడాదీ కిడ్నీ పనితీరు ఎలా ఉందో పరీక్షలు చేయించుకొని తెలుసుకోవాలి. క్రానిక్ కిడ్నీ డిసీజ్‌ను ముందుగానే కనుగొంటే ఆ తర్వాత వచ్చే దుష్ర్పభావాలను ముందునుంచే నివారించడానికి అవకాశం ఉంటుంది.
నాకు 38 ఏళ్లు. ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకొన్నాను. నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- రాఘవరావు, మార్కాపురం
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత కిడ్నీ రిజెక్ట్ కాకుండా ఇచ్చే మందులు క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. చాలామంది పేషెంట్స్ కిడ్నీ బాగా పనిచేస్తుంది కదా అనుకొని మందులు వాడరు. ఇలా చేయడం వల్ల కిడ్నీ రిజెక్ట్ అవుతుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జలుబుగాని, జ్వరంగాని, ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఏ ఇతర మందులు వాడరాదు.
అప్పటికప్పుడు ఒండిన ఆహారం తీసుకోవాలి. మంచినీరు కాచి, చల్లార్చినవి వాడాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్‌లను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్