Kanpur IIT
-
కానిస్టేబుల్ కుమార్తెకు కాన్పూర్ ఐఐటీ సీటు
గుంటూరు: మార్టూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పూర్ణాంజనేయరాజు చిన్న కుమార్తె అనుపమ ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ సీటు సాధించింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ గురువారం తమ కార్యాలయానికి పిలిపించుకొని అనుపమను శాలువాతో సత్కరించి రూ.10 వేలు నగదు పురస్కారం బహుమతిగా అందించారు. ప్రస్తుతం కాన్పూర్ ఐఐటీ కళాశాలలో మూడో ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్న కానిస్టేబుల్ పూర్ణాంజనేయరాజు పెద్ద కుమార్తె జాహ్నవి గతంలో ర్యాంకు సాధించిన సందర్భంగా ఎస్పీ మల్లికా గర్గ్ రూ.25 వేలు నగదు పురస్కారం అందించి అభినందించినట్లు కానిస్టేబుల్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ భార్య సునీత కుమార్తెలు జాహ్నవి, అనుపమ పాల్గొన్నారు. -
వారం రోజుల్లో గేట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది ఎదురుచూసే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)–2023 నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదలవ్వనుంది. ఇందుకోసం కాన్పూర్ ఐఐటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గేట్ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో గేట్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే వీలుంది. 2023 ఫిబ్రవరి 4 నుంచి 13 తేదీల మధ్య పరీక్ష నిర్వహించాలని కాన్పూర్ ఐఐటీ నిర్ణయించినట్టు తెలిసింది. దేశంలోని ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ కీలకమైంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా గేట్ ర్యాంకు ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. బీటెక్‌తో పాటు సంప్రదాయ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా గేట్ రాస్తారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఏడాది నుంచే ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. గత ఏడాది 7.11 లక్షల మంది గేట్ రాశారు. వీరిలో 1.26 లక్షల మంది అర్హత సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఏటా దాదాపు 1.25 లక్షల మంది గేట్ రాస్తుంటారు. -
‘హమ్ దేఖేంగే’పై అభ్యంతరం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ కవి ఫెయిజ్ అహ్మద్ ఫెయిజ్ రాసిన ‘హమ్ దేఖేంగే (మనం చూస్తాం)’ కవితలోని పంక్తులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో యువతకు స్ఫూర్తినిస్తున్న విషయం తెల్సిందే. కమ్యూనిస్టు భావాలు కలిగిన లౌకికవాది ఫెయిజ్ అహ్మద్ ఫెయిజ్. పాకిస్థాన్‌ను పాలించిన నియంత జనరల్ జియా ఉల్ హక్ పాలనకు వ్యతిరేకంగా 1979లో ‘హమ్ దేఖేంగే’ కవితను రాశారు. అప్పట్లో కొనసాగుతున్న ఇరాన్ తిరుగుబాటు, లెబనాన్ అంతర్యుద్ధం, అఫ్ఘాన్‌పై సోవియట్ దురాక్రమణ, సౌదీ పాలనకు వ్యతిరేకంగా మక్కాపై రెబెల్స్ తిరుగుబాటు తదితర అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా ఆయన కవితపై ఉన్నట్లు విశ్లేషించిన వారు లేకపోలేదు. ఈ కవిత ఇంగ్లీషుతోపాటు పలు ప్రపంచ భాషల్లోకి అనువాదం అయింది. ఈ కవితను పాకిస్థాన్ ప్రముఖ గజల్ గాయకురాలు ఇక్బాల్ బానో 1986లో లాహోర్‌లోని ఓ ఇండోర్ స్టేడియంలో పాడినప్పుడు ప్రేక్షకులు ఉప్పెనలా ఆవేశంతో ఊగిపోయారు. ‘ఇక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. మధ్యమధ్యలో ఆ నినాదాల వల్ల ఆమె కవితా గానాన్ని ఆపాల్సి వచ్చింది. 50 వేలు శ్రోతలు హాజరైన నాటి కచేరి రికార్డులు ఆ తర్వాత కోకొల్లలుగా అమ్ముడు పోయాయి. మితవాద నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టోను నిర్దాక్షిణ్యంగా ఉరితీసిన జియా ఉల్ హక్ పాశవిక పాలన పట్ల ప్రజల్లో అంత వ్యతిరేకత ఉండింది. ఫెయిజ్ లౌకిక వాది అయినప్పటికీ జనాన్ని కదిలించడంలో కోసం ఈ కవిత్వంలో ‘ఖురాన్’ నుంచి కొన్ని కొటేషన్లు తీసుకున్నారు. 1962లో ఫెయిజ్ సోవియట్ యూనియన్ నుంచి ‘లెనిన్ పీస్ అవార్డు’ను అందుకున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా కాన్పూర్ ఐఐటీలో డిసెంబర్ 17వ తేదీన ఓ విద్యార్థి ‘హమ్ దేఖేంగే’ కవితా పఠనంపై ఓ ప్రొఫెసర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది మతతత్వ కవిత్వమని, భారత్‌కు వ్యతిరేకమైనదంటూ ఫిర్యాదు చేశారు. ఆ అంశంపై దర్యాప్తునకు ఓ కమిటీని కూడా వేశారు. అప్పటి నుంచి సీఏఏను సమర్థిస్తున్న వాళ్లు ‘హమ్ దేఖేంగే’ కవితను, పోస్టర్లను ద్వేషిస్తున్నారు. జియా ఉల్హక్ అనంతరం పాకిస్థాన్‌లో జరిగిన ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో ‘హమ్ దేఖేంగే’ ప్రతిధ్వనించింది. ఉత్తర భారత్‌లో జరిగిన పలు వామపక్ష విద్యార్థుల ఉద్యమాలకు ఈ కవిత్వమే స్ఫూర్తినిచ్చింది. చదవండి: సీఏఏపై సుప్రీం కోర్టు ఎలా విచారిస్తుంది? ప్రజాపోరులో ఐఏఎస్ అధికారి ‘పౌర ప్రకంపనల వెనుక విపక్షాలు’ ‘వాళ్లనూ ఎడ్యుకేట్ చేయాలి’ -
‘హమ్ దేఖేంగే’ను ఆలాపించడంపై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పాకిస్థానీ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దెఖేంగే’ కవితను ఐఐటీ కాన్పూర్‌లో ఆలాపించడం వివాదంగా మారింది. ఫైజ్ కవిత హిందూ వ్యతిరేకమైనదని, దీనిని పాడటం దేశద్రోహం అంటూ ఈ కవితను పాడిన విద్యార్థులకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. ఈ కేసు వివాదంపై ప్రఖ్యాత బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ స్పందించారు. ఫైజ్ కవితను హిందూ వ్యతిరేకమైనదని పేర్కొనడం అసంబద్ధం, హాస్యపూరితమని ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి వివాదాన్ని అసలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అప్పటి పాకిస్థానీ పాలకుడు జియా ఉల్ హక్ ఛాందసవాద, మతతత్వ, ప్రగతినిరోధక పాలనకు వ్యతిరేకంగా ఫైజ్ ఈ కవిత రాశారని తెలిపారు. అవిభాజ్య భారతం నుంచి వచ్చిన ప్రగతిశీల రచయితల్లో ఫైజ్ ప్రముఖుడని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రం గురించి కవితలు రాసిన ఫైజ్.. ఆ తర్వాత చోటుచేసుకున్న దేశ విభజన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కవితలు రాశారని, దేశ విభజనను వ్యతిరేకించిన కవిని ఇప్పుడు దేశద్రోహి అని అభివర్ణించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఫైజ్ తన జీవితంలో సగభాగం పాక్ వెలుపలే గడిపాడని, అప్పట్లో పాక్ ద్రోహి అని కూడా అతనికి ముద్ర వేశారని గుర్తు చేశారు. -
పీహెచ్డీ దళిత విద్యార్థి ఆత్మహత్య కలకలం
సాక్షి, కాన్పూర్: ప్రముఖ ఐఐటీలో పీహెచ్డీ చదువుతున్న దళిత విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లోని మూడో సంవత్సరం పీహెచ్బీ విద్యార్ధి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడిని భీమ్‌సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గలకారణాలు ఇంకా తెలియ రాలేదు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిలేష్ కుమార్ మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే సూసైడ్ నోట్ ముక్కలు, ముక్కలుగా చింపి ఉండడం పలు అనుమానాలను రేకేత్తిస్తోంది. మరోవైపు ఈ పేపర్ ముక్కలను ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని కాన్పూర్ ఐఐటీ డిప్యూటీ డైరెక్టర్ మణింద్ర అగర్వాల్ వెల్లడించారు. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌కు చెందిన సింగ్ తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. గురువారం రోజు పోస్టుమార్టం నిర్వహించనున్నారని స్థానిక కళ్యాణ్పూర్ పోలీసు స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతీష్ కుమార్ సింగ్ చెప్పారు. కాగా సింగ్ వరంగల్ నిట్ లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 2015లో మెకానికల్ ఇంజీనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీలో జాయిన్ అయినట్టు సమాచారం -
నల్ల గౌన్లు, టోపీలకు చెల్లు!
లక్నో: కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు తమ స్నాతకోత్సవం సందర్భంగా గురువారం భారత సంప్రదాయాలు ఉట్టిపడేలా కుర్తా – పైజామా, కుర్తా – సల్వార్‌లను ధరించారు. బ్రిటిష్ కాలం నాటి నల్లటి కోట్లు, తలపై టోపీలను దూరం పెట్టారు. ‘దేశంలో తొలిసారి ఐఐటీలో విద్యార్థులు బ్రిటిష్ కాలం నాటి గౌన్లు, టోపీలు కాకుండా పైజామాలు, సల్వార్లు ధరించి తమ పట్టాలు పొందారు. తమ తమ కోర్సులను సూచించేలా వేర్వేరు రంగుల్లో స్టోల్స్(స్కార్ఫ్ లాంటి వస్త్రాలు)ను కూడా ధరించారు’ అని ఐఐటీ డైరెక్టర్ ప్రొ.ఇంద్రాణిల్ మన్నా తెలిపారు. భవిష్యత్తులో జరిగే స్నాతకోత్సవాల్లో కూడా విద్యార్థులు భారత సంప్రదాయ దుస్తులే వేసుకుంటారని అన్నారు. 673 మంది బీటెక్, 136 మంది బీఎస్ విద్యార్థులు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ నుంచి పట్టాలు అందుకున్నారు.