సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ కవి ఫెయిజ్ అహ్మద్ ఫెయిజ్ రాసిన ‘హమ్ దేఖేంగే (మనం చూస్తాం)’ కవితలోని పంక్తులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో యువతకు స్ఫూర్తినిస్తున్న విషయం తెల్సిందే. కమ్యూనిస్టు భావాలు కలిగిన లౌకికవాది ఫెయిజ్ అహ్మద్ ఫెయిజ్. పాకిస్థాన్‌ను పాలించిన నియంత జనరల్ జియా ఉల్ హక్ పాలనకు వ్యతిరేకంగా 1979లో ‘హమ్ దేఖేంగే’ కవితను రాశారు. అప్పట్లో కొనసాగుతున్న ఇరాన్ తిరుగుబాటు, లెబనాన్ అంతర్యుద్ధం, అఫ్ఘాన్‌పై సోవియట్ దురాక్రమణ, సౌదీ పాలనకు వ్యతిరేకంగా మక్కాపై రెబెల్స్ తిరుగుబాటు తదితర అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా ఆయన కవితపై ఉన్నట్లు విశ్లేషించిన వారు లేకపోలేదు. ఈ కవిత ఇంగ్లీషుతోపాటు పలు ప్రపంచ భాషల్లోకి అనువాదం అయింది.
ఈ కవితను పాకిస్థాన్ ప్రముఖ గజల్ గాయకురాలు ఇక్బాల్ బానో 1986లో లాహోర్‌లోని ఓ ఇండోర్ స్టేడియంలో పాడినప్పుడు ప్రేక్షకులు ఉప్పెనలా ఆవేశంతో ఊగిపోయారు. ‘ఇక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. మధ్యమధ్యలో ఆ నినాదాల వల్ల ఆమె కవితా గానాన్ని ఆపాల్సి వచ్చింది. 50 వేలు శ్రోతలు హాజరైన నాటి కచేరి రికార్డులు ఆ తర్వాత కోకొల్లలుగా అమ్ముడు పోయాయి. మితవాద నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టోను నిర్దాక్షిణ్యంగా ఉరితీసిన జియా ఉల్ హక్ పాశవిక పాలన పట్ల ప్రజల్లో అంత వ్యతిరేకత ఉండింది. ఫెయిజ్ లౌకిక వాది అయినప్పటికీ జనాన్ని కదిలించడంలో కోసం ఈ కవిత్వంలో ‘ఖురాన్’ నుంచి కొన్ని కొటేషన్లు తీసుకున్నారు. 1962లో ఫెయిజ్ సోవియట్ యూనియన్ నుంచి ‘లెనిన్ పీస్ అవార్డు’ను అందుకున్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా కాన్పూర్ ఐఐటీలో డిసెంబర్ 17వ తేదీన ఓ విద్యార్థి ‘హమ్ దేఖేంగే’ కవితా పఠనంపై ఓ ప్రొఫెసర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది మతతత్వ కవిత్వమని, భారత్‌కు వ్యతిరేకమైనదంటూ ఫిర్యాదు చేశారు. ఆ అంశంపై దర్యాప్తునకు ఓ కమిటీని కూడా వేశారు. అప్పటి నుంచి సీఏఏను సమర్థిస్తున్న వాళ్లు ‘హమ్ దేఖేంగే’ కవితను, పోస్టర్లను ద్వేషిస్తున్నారు. జియా ఉల్‌హక్ అనంతరం పాకిస్థాన్‌లో జరిగిన ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో ‘హమ్ దేఖేంగే’ ప్రతిధ్వనించింది. ఉత్తర భారత్‌లో జరిగిన పలు వామపక్ష విద్యార్థుల ఉద్యమాలకు ఈ కవిత్వమే స్ఫూర్తినిచ్చింది.
చదవండి:
సీఏఏపై సుప్రీం కోర్టు ఎలా విచారిస్తుంది?
ప్రజాపోరులో ఐఏఎస్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment