బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్, కృతి సనన్ జంటగా వచ్చిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది.
శుక్రవారం ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హిందూ సేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ చిత్రం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు రామాయణాన్ని, అలాగే శ్రీరాముడిని, భారత సంప్రదాయాల్ని ఎగతాళి చేసినట్లు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారాయన.
సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదనేది హిందూ సేన ప్రధాన అభ్యంతరం. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో, అలాగే తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లోనూ ప్రధాన పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్‌లో పాత్రలను చూపించిన తీరుకు చాలా తేడాలు ఉన్నాయని పిటిషన్‌లో ప్రస్తావించారు.
హిందూ దేవుళ్లైన రాముడు, సీత, హనుమంతుడు, రావణుడికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేదంటే సరిదిద్దడానికి చిత్రయూనిట్‌కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా రావణ బ్రహ్మ పాత్రధారి(సైఫ్ అలీఖాన్)ను గడ్డంతో ఏదో క్రూరుడిగా చూపించినట్లు ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది హిందూ సేన. ప్రామాణికమైన వాల్మీకి రామాయణం గురించి తెలుసుకోవాలంటే పండితుల్ని, సాహిత్యకారుల్ని సంప్రదించాల్సిందేనంటూ ఈ చిత్ర ప్రారంభంలోనే నోట్ ఇవ్వడం గమనార్హం.
ఇదీ చదవండి: ఆదిపురుష్ ఆ ఓటీటీలోనే.. వచ్చేసిన క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment