అభిప్రాయం
అజ్మీర్ దర్గాకు సంబంధించిన వార్తలు ముస్లింలకు మాత్రమే బాధ కలిగిస్తాయనుకుంటే పొరపాటు. తరతరాలుగా హిందువులు ఆ దర్గాలో ఆరాధనలు జరుపుతున్నారు. ‘చాదర్’ సమర్పిస్తు న్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా ‘గరీబ్ నవాజ్’ అని పిలుచుకునే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎదుట మొక్కులు తీర్చుకుంటున్నారు. భారత దేశంలోని ముస్లింలు, హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్రాన్ని ప్రతి రోజూ 1.5 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. భారతీయ ముస్లింలలో అత్యధికులు అజ్మీర్ దర్గాను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. అజ్మీర్ దర్గా భారతదేశంలోని ముస్లింలకు మక్కా లాంటిదని పలువురు భావిస్తారు. అజ్మీర్ ఖ్వాజాను ‘హిందూస్థాన్ కే వలీ’ లేదా ‘హింద్ వలీ’ అని పిలుస్తారు.
కాని ఇటువంటి ఈ సామరస్య కేంద్రం ఇప్పుడు వార్తల్లో అనవసర కారణాలతో నిలవడం బాధాకరం. భారతదేశంలో బాబ్రీ తర్వాత సాగుతున్న హైందవ సంస్కృతి ఆనవాళ్ల వెతుకులాట మసీదుల చుట్టూ ఇంతకాలం ఉండగా... ఇప్పుడు దర్గాలకు చేరడం, అదీ కోట్లాది మంది సెంటిమెంట్‌గా భావించే అజ్మీర్ దర్గాకు చేరడం ఆందోళన కలిగించే అంశం. చినికి చినికి గాలివాన అయినట్టుగా ఇది ఎక్కడకు చేరబోతున్నదో పాలకులకూ, ఈ వివాదాన్ని రేపుతున్నవారికీ అంచనా ఉందా? ఈ వివాదాన్ని లేపేవారు భారతీయ హిందూ– ముస్లింల మధ్య ఎడతెగని అనిశ్చితి, ఘర్షణ, విభజన, ద్వేషం ఆశిస్తున్నారా? ఒక దేశంలో కలిసిమెలిసి ఉండవలసిన రెండు ప్రధాన మతాలు నిత్యం ఘర్షణల్లో ఉంటే ఆ దేశ ప్రగతి ఏ రీతిలో కొనసాగుతుందనేది మనలో ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి.
అయోధ్యలో ప్రార్థనా స్థలంపై జరిగినట్లుగా అజ్మీర్‌లో దీర్ఘకాలంగా పోరాటం లేదు. ఇది మసీదు వంటి బహిరంగ ప్రదేశం కాదు. ఇది సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి. అజ్మీర్ దర్గాపై ఎటువంటి న్యాయపోరాటం లేనప్పుడు, 800 ఏళ్ల సూఫీ సాధువు సమాధి వద్ద యంత్రాలు, గునపాలు చేరడం చట్టవిరుద్ధం. హిందూసేన కోర్టు సహాయంతో అజ్మీర్ ఖ్వాజా దర్గాను సర్వే చేయాలనుకుంటోంది. ఈ సర్వేను నిలిపివేయాలని ఈ దేశంలో బాధ్యతగల పౌరులెవరైనా ఆశిస్తారు. తాజ్‌మహల్, కుతుబ్‌మినార్‌ల విషయంలో చేసినట్లుగా అజ్మీర్ దర్గా సర్వేను తిరస్కరించాలి. వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించవలసిన అవసరం ఏమిటని గౌరవనీయమైన పెద్దలు ముందుకు రావాలి.
హిందూ ముస్లింలకు ఇది దర్గా అని తెలుసు. ఇది రెండు మతాలకు చెందినది కాబట్టి వారు దానిని ఒకే దృష్టితో చూశారు. భక్తులు అక్కడ సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారిని భంగపరచి దేశవ్యాప్తంగా ఎందుకు హింసను ప్రేరేపించాలి? శివలింగం ఉందా... లేదా ఉందని వెలికితీయడానికీ, లేదా లేకపోయినా ఉందని వాదించడానికీ పవిత్రమైన 800 సంవత్సరాల నాటి సూఫీ సాధు సమాధిని అన్వేషించడం 140 కోట్ల జనాల మనోభావాలను దెబ్బతీసినట్లే. దర్గా హిందువులు– ముస్లింల మధ్య వారధిగా నిలుస్తుంది. ఈ వంతెనను దెబ్బ తీస్తే, హిందువులు – ముస్లింల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేసినట్లే. ఇలా చేసి చివరికి ఏమి సాధించబోతున్నారు?
గత పాఠాలు బోధించడం, అవగాహన పెంపొందించడంలో చరిత్రకు దాని విలువ ఉంది. ప్రజలను విభజించడానికి లేదా శాంతికి భంగం కలిగించడానికి చరిత్రను ఆయుధంగా వాడకూడదు. చరిత్రను తవ్వకూడదు. చరిత్రకు దానిదైన విలువ ఉంటుంది. చరిత్ర గతిలో గడిచిపోయిన విషయాలను కొన్నింటిని వర్తమానంలోకి తెచ్చినప్పుడు అవి మనం కోరే వ్యాఖ్యానాలు, ఫలితాలు మాత్రమే ఇవ్వవు. తేనెతుట్టెను కదిల్చి తేనెటీగలను ఒక వరుస క్రమంలో ఎగిరి వెళ్లమని కోరడం లాంటిది ఇది. సమాజంలో అన్ని మతాలకూ, వారి పవిత్ర స్థలాలకూ గౌరవం అవసరం. సామరస్యాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసం విభజితం కాకుండా ఏకం కావాలని గుర్తించాలి. ఈ మతాతీత ప్రదేశాలు గౌరవం, ఐక్యతలకు సంబంధించిన స్థలాలుగా ఉండాలి.
చదవండి: ఒక అపరిచితుడి దయ
గత రెండు సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ‘మేము కొన్ని పరిస్థితుల్లో ప్రకృతికి విరుద్ధంగా బాబ్రీ మసీదు సమస్యను లేవనెత్తాము. ఇప్పుడు ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు మరలా ప్రతిరోజూ మసీద్–మందిర్ గొడవలు దేనికని? ఎందుకు అనవసర గొడవలు సృష్టిస్తు న్నారు? ప్రతీ మసీదులో శివలింగం ఉందని వాదించడం సరైనది కాదు. విధానం వేరైనప్పటికి మసీదుల్లో ముస్లింలు చేస్తున్నది కూడా దైవ ఆరాధనే. వారు మనవాళ్ళే, బయట నుండి ఏమి రాలేదు. ఇది అందరూ అర్థం చేసుకోండి’ అని చెబుతూనే వస్తున్నారు. కానీ, జరుగుతున్నది వేరు.
సూఫీ సాధువు సమాధి కింద శివలింగం ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. హింసను ప్రేరేపించడానికి అలాంటి కల్పనలను వదిలివేయాలి. భాగవత్ మాటలను గౌరవించమని హిందూ సోదరులకు విజ్ఞప్తి. అలాగే ముస్లిం సోదరులు కూడా సంయమనం పాటించాలి. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కలిసి నడుద్దాం. భారతదేశ జెండాను ప్రపంచంలో ఉన్నత శిఖరాల్లోకి ఎగరవేద్దాం. మేరా భారత్ మహాన్ హై! జై హింద్!!
- జహారా బేగం
సామాజిక కార్యకర్త
(ఇండియా/యు.ఎస్.ఎ)
Comments
Please login to add a commentAdd a comment