Majid
-
షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 'షాహీ ఈద్గా మసీదును అడ్వకేట్ కమిషనర్‌తో సర్వే చేయించాలనే మా అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి అడ్వకేట్ జనరల్ అవసరం. ఇది చరిత్రాత్మక తీర్పు.' అని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
సీఎం ప్రకటనను స్వాగతిస్తూ అసద్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని గుడి, మసీదు కూల్చివేత పట్ల విచారం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ జారీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. అలాగే సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ యునైటెడ్ ముస్లిం ఫోరం సైతం ఓ ప్రకటన జారీ చేసింది. -
ఆలయం, మసీదులకు కాకతాళీయంగానే నష్టం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారాన్ని, బాధను వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’’అని ముఖ్యమంత్రి శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. ‘తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి, కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ క్రమంలో అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందనే విషయం నాకు తెలిసింది. ఇలా జరగడం పట్ల నేను ఎంతో బాధపడుతున్నాను. చింతిస్తున్నాను. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ అభిప్రాయం కాదు’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఎన్నికోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి, వాటికి చెందిన వ్యక్తులకు అప్పగిస్తాం. దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సచివాలయ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా అమర్, మాజిద్
సాక్షి, హైదరాబాద్: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సభ్యులుగా తెలంగాణ నుంచి ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, కార్యవర్గ సభ్యుడు ఎంఏ మాజిద్ నియమితులయ్యారు. పీసీఐకి దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల కోటా నుంచి ఏడుగురు సభ్యులను ఎంపిక చేయగా.. అందులో ఐజేయూ నుంచి అమర్, మాజిద్‌లతోపాటు బల్వీందర్‌సింగ్ జమ్మూ (పంజాబ్), ప్రభాత్‌దాస్, శరత్ బెహెరా (ఒడిశా)లు నియమితులయ్యారు. వీరితోపాటు వార్తా పత్రికల యాజమాన్యాల కేటగిరీ కింద నలుగురికి, సంపాదకుల కేటగిరీ కింద మరో నలుగురికి, వార్తా సంస్థల కేటగిరీ నుంచి ఒకరికి కలిపి మొత్తం 18 మందికి పీసీఐ సభ్యులుగా అవకాశం లభించింది. వీరంతా మూడేళ్లపాటు పీసీఐ సభ్యులుగా కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హర్షం వ్యక్తం చేసిన టీఎస్‌యూడబ్ల్యూజే.. తమ సంస్థ సభ్యులు దేవులపల్లి అమర్, ఎంఏ మాజిద్‌లు ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా నియామకం కావడంపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌యూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ ఒక ప్రకటన విడుదల చేశారు. పీసీఐ సభ్యులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. వారు పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి, జర్నలిజంలో నైతిక విలువలను పెంపొందించడానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పీసీఐ సభ్యులుగా నియమితులైన ఐజేయూ నాయకులకు పీసీఐ మాజీ సభ్యుడు కె.అమర్నాథ్ అభినందనలు తెలిపారు. -
రసవత్తరం
జీహెచ్ఎంసీ పాలక మండలి తొలి సమావేశం మేయర్ రామ్మోహన్ సంయమనం మాజీ మేయర్ మాజిద్ ప్రశ్నల పరంపర పాత.. కొత్తల మేలు కలయిక సిటీబ్యూరో: కొందరు అనుభవాన్ని రంగరించి ప్రశ్నించడం... అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూడడం.. మరికొందరు అనుభవ రాహిత్యంతో తమకు తోచినట్టు మాట్లాడడం... మేయర్ సర్దుబాటు ధోరణిలో ముందుకెళ్లడం... మొత్తమ్మీద జీహెచ్ఎంసీ పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశం రసవత్తరంగా సాగింది. రెండు, మూడు పర్యాయాలు గెలిచినవారు.. తొలిసారిగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాత, కొత్తల సమ్మిళితంగా కనిపించింది. అధ్యక్షత వహించిన మేయర్ బొంతు రామ్మోహన్ కాస్త తడబాటుకు గురైనా.. వడివడిగా సభను నడిపించడంలో సఫలీకృతులయ్యారు. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమైన సమావేశం ఏకదాటిగా దాదాపు మూడు గంటల పాటు నడిచింది. మాజీ మేయర్, ప్రస్తుత కార్పొరేటర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ తన అనుభవాన్ని రంగరించి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. కొత్త కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు అనుభవజ్ఞులతో సమానంగా తమ వాణి వినిపించారు. తాగునీటి సమస్యలు సహా వివిధ అంశాలను లేవనెత్తారు. ఎక్కువ మంది స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ప్రారంభించిన ఆటోట్రాలీలపై స్పందించారు. కొత్త ఆటో ట్రాలీలతో పాటు అవసరమైనన్ని డంపర్బిన్లు అందుబాటులోకి తేవాలని... కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని సూచించారు. మొత్తానికి కొత్త మేయర్.. కొత్త కమిషనర్ (జనార్దన్‌రెడ్డి వచ్చాక జరిగిన పాలక మండలి తొలి సమావేశం ఇదే) కొత్త కార్పొరేటర్లతో వింతైన వాతావరణం నెలకొంది. ప్రశ్నల పరంపర... మేయర్ పోడియం వద్దకు చేరుకోవడం.. ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అధికారుల తీరును మాజిద్ హుస్సేన్ ఆక్షేపిస్తుండగా... ‘మీరు సీనియర్.. ఇదేనా డిసిప్లిన్..’ అంటూ మేయర్ వారించే ప్రయత్నం చేశారు. సభ నిర్వహణలో అనుభవ రాహిత్యం కనిపించినప్పటికీ.. వ్యవధిలోగా ముగించడంతో కృతకృత్యులయ్యారు. చాలా మంది సభ్యులు కొత్త వారు కావడంతో ఓ వైపు పోడియం వద్ద గొడవ జరుగుతుండగానే.. మరోవైపు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడటంతో ఓ దశలో గందరగోళం చోటుచేసుకుంది. సందర్భం లేకుండా ‘జై తెలంగాణ’ నినాదాలూ వినిపించాయి. ఓ వైపు ఎంఐఎం బృందం పోడియంను చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నా... మరోవైపు తమంత తాముగా ప్రసంగం చదువుకుంటూ పోయిన వారూ కనిపించారు. అజెండాలో మొత్తం 9 అంశాలు పొందుపరచగా... ఏడింటిపైనే చర్చించారు. అంతకుముందు మేయర్, డిప్యూటీ మేయర్లకు టీఆర్ఎస్ నాయకుడు బంగారు ప్రకాశ్ అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. -
గ్రేటర్ వార్
మేయర్-కమిషనర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సోమేష్‌కుమార్ నిర్ణయాలను తప్పుబట్టిన మాజిద్ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్.. కమిషనర్ సోమేశ్‌కుమార్ మధ్య పొసగడం లేదా? పైకి బాగానే ఉన్నా.. లోలోన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందనే అనిపిస్తోంది. కమిషనర్ రూ. 5కే భోజన పథకాన్ని ప్రారంభించగా, మేయర్ రూపాయికే టిఫిన్ పథకాన్ని అమలు చేసే యోచన ఉందన్నారు. కమిషనర్ తన చాంబర్ నుంచి కనిపించేలా సీ త్రూ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోగా.. మేయర్ సైతం తన చాంబర్‌కు మెరుగులు దిద్దించుకుంటున్నారు. ఇప్ప టి వరకు ఇలా ఒకరి దారిలో ఒకరు నడిచిన వీరు తాజాగా, ఒకరి నిర్ణయాలతో మరొకరు విభేదించే పరిస్థితి నెలకొంది. బుధవారం మేయర్ విలేకరులతో మాట్లాడిన అంశాలు దీనినే నిరూపిస్తున్నాయి. మేయర్ స్పందించారిలా.. ‘రోజుకొక సంక్షేమ పథకాలను ప్రకటించడం సరికాదు. ఇప్పటికే ప్రకటించిన వాటిని పూర్తిగా అమలు చేయడంతో పాటు వర్షాకాలం మొదలైనందున చెత్త, పూడికతీత పనులపై శ్రద్ధ చూపాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఆమోదం పొందాకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. ఓ వైపు నాలాల్లో పూడిక పేరుకుపోయింది. మరోవైపు ప్రతిష్టాత్మక మెట్రోపొలిస్ సదస్సు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మొదట వాటిపై శ్రద్ధ చూపాలి’ అని పరోక్షంగా కమిషనర్ తీరుపై మేయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా అవసరమైన పనులను ఆయా కాలనీలు, బస్తీల సంఘాలకే అప్పగించే యోచన ఉందని, స్టాండింగ్ కమిటీలో అనుమతి పొందాక దీనిని అమలు చేయనున్నట్లు కమిషనర్ సోమేష్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని తనతో ప్రస్తావించకుండా ప్రకటించడం మేయర్‌కు రుచించి నట్లు లేదు. దీంతో బుధవారం జీహెచ్ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మేయర్.. కమిషనర్ నిర్ణయాలను తప్పుబట్టారు. డీసిల్టింగ్ పనులు పూర్తయినట్టు స్థానిక కార్పొరేటర్ల నుంచి సంతృప్తికర లేఖలు పొందాలని సూచిస్తే, పది శాతం కార్పొరేటర్ల నుంచే అందాయన్నారు. డీసిల్టింగ్ పూర్తయిందని ఇంజినీర్లు చెబితే చాలదని, స్థానిక ప్రజాప్రతినిధు లు, ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. కార్పొరేటర్ల బడ్జెట్ నుంచి ఒక్కొక్కరు రూ.75 లక్షల మేర జలమండలి చేపట్టే పనుల కోసం విడుదల చేస్తున్నందున సదరు పనులపై శ్రద్ధ చూపాలన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని ఎవరూ కాదనరని, కానీ అంతకంటే ముందు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్లాస్టిక్, రసాయన, తుక్కు నిల్వ పరిశ్రమల వంటి ప్రమాదకర అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలంటూ పరోక్షంగా కమిషనర్ చర్యలను తప్పుబట్టారు. భూసేకరణ అంశాలు త్వరగా పరిష్కా రం కావడం లేవని, జీహెచ్ఎంసీ న్యాయవిభాగం నిద్రపోతోందన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు జీహెచ్ఎంసీకి అప్పగించే వరకు ఆ రోడ్లు బాగుపడవని, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. వచ్చే వారం నుంచి వరుస సమీక్షలు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మేయర్ మాజిద్ హుస్సేన్ వచ్చే వారం నుంచి విభాగాల వారీగా వరుస సమీక్షలకు సిద్ధమయ్యారు. సోమవారం : స్టాండింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ తీర్మానాల అమలు మంగళవారం : {పజావాణిలో అందిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం బుధవారం : ‘ఫేస్ టూ ఫేస్’లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం గురువారం : స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి యూసీడీ పనులపై సమీక్ష శుక్రవారం : పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి దీపం కనెక్షన్లు, ఇతర అంశాలపై చర్చ. వీలైతే సీఎంను కలిసే యోచన శనివారం : మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లు.. పనుల నివేదిక పరిశీలన. వీలునుబట్టి ట్రేడ్ లెసైన్సు ఫీజుల పెంపు, తీర్మాలనాలపై సమీక్ష -
నిరసనల నడుమ సీఎం పర్యటన
కూకట్పల్లి, గచ్చిబౌలి జోన్ బృందం,న్యూస్‌లైన్: చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం నగరంలో పర్యటించారు. నిరసనలు, ఆందోళనల నడుమ ఆయన పర్యటన కొనసాగింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది. సీఎం కిరణ్ తొలుత కేపీహెచ్‌బీ ముల్లకతువ చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం కేపీహెచ్‌బీ-హైటెక్ సిటీ జంక్షన్, సర్వీసురోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మియాపూర్-ఎల్లమ్మబండ లింకు రోడ్డు నిర్మాణపు పనులకు, రూ.16.43 కోట్లతో ఏర్పాటు చేయనున్న మంజీరా పైపులైన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఖానామెట్‌లో నిర్మించనున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం) భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు మహీదర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ముఖేష్‌గౌడ్, ప్రసాద్‌కుమార్, ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు జయప్రకాష్ నారాయణ, భిక్షపతియాదవ్, కూన శ్రీశైలంగౌడ్, మేయర్ మాజిద్, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అత్యుత్సాహం.. సీఎం పర్యటనలో పోలీసు ఎస్కార్టు బృందం అత్యుత్సాహం ప్రదర్శించింది. మియాపూర్‌లోని సుభాష్‌చంద్రబోస్ నగర్ వేదిక వద్దకు వస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు రోడ్డుపైనే కూర్చోని ధర్నా చేపట్టారు. అయినా అనుమతించక పోవడంతో జర్నలిస్టులు సీఎం పర్యటనను బహిష్కరించారు. మేయర్, డిప్యూటీ మేయర్లను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ముల్లకత్వ చెరువు శంకుస్థాపన అనంతరం సీఎం కాన్వాయ్‌తో పాటు వెళ్లబోయిన మేయర్ మాజిద్ వాహనాన్ని కూడా నిలువరించారు. దీంతో కలత చెందిన ఆయన తదుపరి కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు. సీఎం పర్యటనను అడ్డుకంటారని భావించిన పోలీసులు ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను అరెస్టు చేశారు. జేఏసీ శేరిలింగంపల్లి చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర భూ పరిరక్షణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం బహిరంగ సభ లేకపోయినప్పటికీ, స్థానిక నాయకులు మహిళలను తరలించేందుకు తంటాలు పడ్డారు గిరిజన మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి సీఎంతో కలిసి పర్యటించారు టీడీపీ కార్పొరేటర్లు అశోక్‌గౌడ్, భానుప్రసాద్‌లను పోలీసులు వేదిక వద్దకు అనుమతించలేదు. సీఎం పర్యటన కోసం.. ముల్లకతువ చెరువులో మట్టిని నింపిన అధికారులు కూకట్పల్లి, న్యూస్‌లైన్: బయోడైవర్సిటీ పార్కు పేరుతో ముల్లకతువ చెరువు అభివృద్ధికి అధికారులు చేపట్టిన పనులు జలాశయానికి ముప్పుగా పరిణమించనున్నాయి. సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ముల్లకతువ చెరువు ఇప్పటికే కుంచించుకుపోయి, 35 ఎకరాలకు చేరింది. తాజాగా బయోడైవర్సిటీ పార్కు పనుల శంకుస్థాపన కోసం అధికారులు చేపట్టిన పనులతో చెరువు నీటిలో మరో అర ఎకరానికి పైగా మట్టిని నింపారని సమాచారం. గతంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణం కోసం సుమారు రెండు ఎకరాలు చెరువు స్థలాన్ని చదును చేసి వినియోగంలోకి తీసుకున్నారు. తాజాగా, సీఎం శంకుస్థాపన వేదిక ప్రాంతం పూర్తిగా జలాశయంలో మట్టిని నింపిన ప్రాంతంలోనే ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఒకవైపు చెరువుల పరిరక్షణ కోసం రూ.కోట్లు వెచ్చించి జలశయాలను కాపాడాలని ధృడసంకల్పంతో ఉంటే.. కేవలం సీఎం పర్యటన కోసమే అర ఎకరం మేర జలశయాన్ని పూడ్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.