గ్రేటర్ వార్
- మేయర్-కమిషనర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
- సోమేష్‌కుమార్ నిర్ణయాలను తప్పుబట్టిన మాజిద్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్.. కమిషనర్ సోమేశ్‌కుమార్ మధ్య పొసగడం లేదా? పైకి బాగానే ఉన్నా.. లోలోన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందనే అనిపిస్తోంది. కమిషనర్ రూ. 5కే భోజన పథకాన్ని ప్రారంభించగా, మేయర్ రూపాయికే టిఫిన్ పథకాన్ని అమలు చేసే యోచన ఉందన్నారు. కమిషనర్ తన చాంబర్ నుంచి కనిపించేలా సీ త్రూ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోగా.. మేయర్ సైతం తన చాంబర్‌కు మెరుగులు దిద్దించుకుంటున్నారు. ఇప్ప టి వరకు ఇలా ఒకరి దారిలో ఒకరు నడిచిన వీరు తాజాగా, ఒకరి నిర్ణయాలతో మరొకరు విభేదించే పరిస్థితి నెలకొంది. బుధవారం మేయర్ విలేకరులతో మాట్లాడిన అంశాలు దీనినే నిరూపిస్తున్నాయి.
మేయర్ స్పందించారిలా..
‘రోజుకొక సంక్షేమ పథకాలను ప్రకటించడం సరికాదు. ఇప్పటికే ప్రకటించిన వాటిని పూర్తిగా అమలు చేయడంతో పాటు వర్షాకాలం మొదలైనందున చెత్త, పూడికతీత పనులపై శ్రద్ధ చూపాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఆమోదం పొందాకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. ఓ వైపు నాలాల్లో పూడిక పేరుకుపోయింది. మరోవైపు ప్రతిష్టాత్మక మెట్రోపొలిస్ సదస్సు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మొదట వాటిపై శ్రద్ధ చూపాలి’ అని పరోక్షంగా కమిషనర్ తీరుపై మేయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానికంగా అవసరమైన పనులను ఆయా కాలనీలు, బస్తీల సంఘాలకే అప్పగించే యోచన ఉందని, స్టాండింగ్ కమిటీలో అనుమతి పొందాక దీనిని అమలు చేయనున్నట్లు కమిషనర్ సోమేష్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని తనతో ప్రస్తావించకుండా ప్రకటించడం మేయర్‌కు రుచించి నట్లు లేదు. దీంతో బుధవారం జీహెచ్‌ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మేయర్.. కమిషనర్ నిర్ణయాలను తప్పుబట్టారు.
డీసిల్టింగ్ పనులు పూర్తయినట్టు స్థానిక కార్పొరేటర్ల నుంచి సంతృప్తికర లేఖలు పొందాలని సూచిస్తే, పది శాతం కార్పొరేటర్ల నుంచే అందాయన్నారు. డీసిల్టింగ్ పూర్తయిందని ఇంజినీర్లు చెబితే చాలదని, స్థానిక ప్రజాప్రతినిధు లు, ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. కార్పొరేటర్ల బడ్జెట్ నుంచి ఒక్కొక్కరు రూ.75 లక్షల మేర జలమండలి చేపట్టే పనుల కోసం విడుదల చేస్తున్నందున సదరు పనులపై శ్రద్ధ చూపాలన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని ఎవరూ కాదనరని, కానీ అంతకంటే ముందు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్లాస్టిక్, రసాయన, తుక్కు నిల్వ పరిశ్రమల వంటి ప్రమాదకర అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలంటూ పరోక్షంగా కమిషనర్ చర్యలను తప్పుబట్టారు. భూసేకరణ అంశాలు త్వరగా పరిష్కా రం కావడం లేవని, జీహెచ్‌ఎంసీ న్యాయవిభాగం నిద్రపోతోందన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు జీహెచ్‌ఎంసీకి అప్పగించే వరకు ఆ రోడ్లు బాగుపడవని, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.
వచ్చే వారం నుంచి వరుస సమీక్షలు
అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మేయర్ మాజిద్ హుస్సేన్ వచ్చే వారం నుంచి విభాగాల వారీగా వరుస సమీక్షలకు సిద్ధమయ్యారు.
సోమవారం : స్టాండింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ తీర్మానాల అమలు
మంగళవారం : {పజావాణిలో అందిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
బుధవారం : ‘ఫేస్ టూ ఫేస్’లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం
గురువారం : స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి యూసీడీ పనులపై సమీక్ష
శుక్రవారం : పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి దీపం కనెక్షన్లు, ఇతర అంశాలపై చర్చ. వీలైతే సీఎంను కలిసే యోచన
శనివారం : మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లు.. పనుల నివేదిక పరిశీలన. వీలునుబట్టి ట్రేడ్ లెసైన్సు ఫీజుల పెంపు, తీర్మాలనాలపై సమీక్ష