Someskumar
-
ఇదే చాన్స్
సాక్షి, సిటీబ్యూరో: అక్రమార్కుల చూపు మళ్లీ జీహెచ్ఎంసీ వైపు మళ్లింది. అవకతవకలకు... ఆమ్యామ్యాలకు అలవాటు పడిన వారు జీహెచ్ఎంసీకి క్యూ కడుతున్నారు. గతంలో ఇక్కడ పని చేస్తుండగా వచ్చిన అవినీతి ఆరోపణలు, పనుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో వెళ్లిపోయిన వారు తిరిగి జీహెచ్ఎంసీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు కోరుకున్న స్థానాల్లో చేరగా... మరికొందరు అతి త్వరలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవలే బదిలీపై వెళ్లిన కమిషనర్ సోమేశ్ కుమార్ హయాంలోనే కాక... అంతకు ముందు కమిషనర్‌గా పని చేసిన కృష్ణబాబు హయాంలో మాతృ సంస్థలకు వెళ్లిన వారు కూడా తిరిగి జీహెచ్ఎంసీలో తిష్ట వేసేందుకు పెద్ద మొత్తాల్లోనే ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీలోనే ఉంటున్నప్పటికీ తాము కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు పావులు కదుపుతున్న వారు గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులే కాక, ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న అటెండర్లు, డ్రైవర్లు వంటి వారు కూడా కోరుకున్న స్థానాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే జీహెచ్ఎంసీలో పనులు ఎక్కువగా ఉండటం.. బడ్జెట్ కూడా భారీగానే ఉండటం.. డబ్బులు చేతులు మారడం కూడా అదే దామాషాలో ఉండటంతో ఇక్కడ పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ఇటీవల బదిలీ అయిన సోమేశ్‌కుమార్ కచ్చితత్వంతో ఒక దశలో జీహెచ్ఎంసీలో పని చేసేందుకే భయపడిన పరిస్థితి ఏర్పడగా... ఆయన వెళ్లగానే మళ్లీ ఇటువైపు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారు భారీగా పెరుగుతున్నారు. ఇదీ వరుస * గతంలో ఒక ఉన్నతాధికారి ద్వారం వద్ద ఉంటూ.. సందర్శకులను గదిలోకి పంపించే ఓ ఔట్సోర్సింగ్ అటెండర్ పనితీరు అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అక్కడి నుంచి తప్పించారు. సోమేశ్ కుమార్‌కు బదిలీ అయిన మరుసటి రోజే పాత స్థానంలో ఆ అటెండర్ విధులు నిర్వహించడం విస్మయానికి గురి చేసింది. * అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఒక అధికారిని దాదాపు మూడేళ్ల క్రితం కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో అవసరం లేదని రిలీవ్ చేశారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి మంజూరు లేకుండానే బిల్లులు పాస్ చేయడం వంటి అంశాలు దృష్టికొచ్చి కృష్ణబాబు ఆయనను జీహెచ్ఎంసీ నుంచి పంపించినట్లు సమాచారం. ఆ అధికారి కొద్దికాలం క్రితం తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ అయినప్పటికీ విధుల్లో చేరలేకపోయారు. సోమేశ్ కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు విధుల్లో చేరలేకపోయిన ఆయన గతంలో కంటే పైస్థానంలో నేడో రేపో జీహెచ్ఎంసీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. * చాలా ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారిలో కొందరిని సోమేశ్ కుమార్ హయాంలో ఇతర స్థానాలకు పంపించారు. అలాంటి వారంతా తిరిగి పాత స్థానాల్లోకి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దిశగా ఒకరిద్దరు సఫలీకృతులైనట్లు సమాచారం. * వీరి చర్యలతో గతంలో ఏ కారణం లేకుండా జీహెచ్ఎంసీ నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
పరిశ్రమలపై పెత్తనం ఎందుకు..?
ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ఒప్పుకోం పరిశ్రమల మంత్రికి తేల్చిచెప్పిన తెలంగాణ పారిశ్రామిక వేత్తలు 30 పారిశ్రామికవేత్తల సంఘాలతో జూపల్లి సమావేశం సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వాడలపై జీహెచ్ఎంసీ పెత్తనాన్ని తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఆస్తిపన్ను వసూళ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)లను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఇటీవలి కాలంలో కమిషనర్ సోమేశ్‌కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై పారిశ్రామిక వేత్తలు విరుచుకుపడ్డారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే జీహెచ్ఎంసీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, పారిశ్రామిక వేత్తలను పీడించడమే ధ్యేయంగా వ్యవహరిస్తుందని తెలంగాణ పారిశ్రామిక వేత్తలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమల కమిషనర్ జయేష్ రంజన్‌లతో సోమవారం సచివాలయంలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో 30 సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 700 కోట్ల మేర రాయితీలను విడుదల చేయడం, నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడంపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పారిశ్రామిక వేత్తలపై జీహెచ్ఎంసీ చేస్తున్న పెత్తనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జులై 22న కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమై ‘ఐలా’ను పటిష్టం చేస్తానని, పరిశ్రమలకు స్వయం ప్రతిపత్తి కాపాడుతామని హామీ ఇచ్చిన విషయాన్ని పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా పరిశ్రమలపై గుత్తాధిపత్యాన్ని కార్పొరేషన్‌కు దఖలు చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు ఎస్.వి. రఘు, సుధీర్, పారిశ్రామిక వేత్తల సంఘాల ప్రతినిధులు ఎ.ఎల్.ఎన్.రెడ్డి(జీడిమెట్ల), ఎం.గోపాల్ రెడ్డి(చర్లపల్లి), జనార్దన్ రెడ్డి (పటాన్చెరు), నర్సింగ్‌రావు(మెదక్), మహిళా పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షురాలు సరిత, ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి రాజ మౌళి, ఎన్వీ నరేందర్, సూక్ష్మ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంతయ్య పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ తీరుపై ఆందోళన ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ వ్యవహరించడం పట్ల ఇతర సంఘాల ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆస్తిపన్ను పేరుతో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రకాల పన్నులు చెల్లిస్తూ పరిశ్రమలను నడుపుతున్న తమకు ఆస్తిపన్నును వాణిజ్య అవసరాల పేరుతో వసూలు చేయడం వల్ల నష్టపోతున్నామని మంత్రి జూపల్లికి వివరించారు. కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం తాగునీటి కనెక్షన్లు తీసుకుంటే వాటికి కూడా వాణిజ్య అవసరాల టారిఫ్‌లో బిల్లులు వేస్తున్నారని తెలిపారు. ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, ఆస్తిపన్ను, నీటి పన్నులకు సంబంధించి జీహెచ్ఎంసీ, పురపాలక శాఖలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న తెలంగాణ పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో వెయ్యి ఎకరాలు కేటాయించి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పరిశ్రమలతో సంబంధం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మునిసిపల్ శాఖ, రిజిస్ట్రేషన్లు, పీసీబీ వంటి విభాగాల అధికారులతో మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను కోరారు. త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. -
ట్రాఫిక్ ఫ్రీ మార్గం కావాలి...
మైత్రివనం-లక్డీకాపూల్ రూట్లో అడ్డంకుల తొలగింపుపై సమావేశం అధికారులు సమన్వయంతో పనిచేయాలి సోమేశ్‌కుమార్ ఆదేశం సిటీబ్యూరో: నగరంలోని మైత్రివనం నుంచి లక్డీకాపూల్ నిరంకారి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ట్రాఫిక్ ఫ్రీ రూట్‌గా మార్చడానికి, మధ్యలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, మెట్రోరైలు, ఆర్టీసి, జలమండలి,విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మైత్రివనం నుంచి లక్డీకాపూల్ నిరంకారీ భవన్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి రోడ్ల విస్తరణ, దారివెంట ఉన్న శ్మశాన వాటికలను తొలగించకుండా వాటిపై ర్యాంప్‌ల నిర్మాణాలను చేపట్టడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు. అదేవిధంగా ఆ మార్గంలో ఉన్న ప్రార్ధన స్థలాలను ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా సంబంధిత వర్గాలతో చర్చించాలన్నారు. అదేవిధంగా ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వరకు నాలుగు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణానికి అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. 760 మీటర్ల పొడవు గల ఈ కారిడార్‌ను ట్రాఫిక్ రహితంగా అభివృద్ధి చేయడానికి త్వరలో పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 60 బస్ షెల్టర్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ షెల్టర్లను నిర్మించే స్థలాలను గుర్తించి తమకు అందజేస్తే వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు ఆర్టీసి అధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జంక్షన్ అభివృద్ధి, బస్ షెల్టర్ల ఏర్పాటు ప్రాంతాల్లో కనీస సౌకర్యాల ఏర్పాటుతో పాటు ఆటో స్టాండ్లకు తగు స్థలం కూడా కేటాయించాలని సూచించారు. నగరంలో వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ లైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. సిటీ యూత్‌కు పోలీసు సెలక్షన్ ట్రైనింగ్ నగరంలోని యువత ప్రధానంగా పాతబస్తీ యువతకు పోలీసు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. సిటీ పోలీసు విభాగంలో కలిసి నిర్వహించే శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ మెట్రోరైలు నిర్మాణ మార్గంలో ఉన్న అవరోధాలను తొలగించడానికి సంబంధిత శాఖలు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. -
ఇదేం..కక్కుర్తి..?
జీహెచ్ఎంసీ సామగ్రి ఇంటికి పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురే లేదు మాజీ ఫ్లోర్‌లీడర్ నిర్వాకంపై విచారణకు ఆదేశించిన సోమేశ్‌కుమార్ ఆయన తాజా మాజీ కార్పొరేటర్.. జీహెచ్ఎంసీలో ప్రధాన ప్రతిపక్షానికి ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు.. పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురే లేదు. సర్వసభ్య సమావేశాల్లో అందరిదీ ఒక ఎత్తయితే ఆయనది ఒక ఎత్తు. ఆయన నోటికి జడిసి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. తన మాట వినని అధికారులను లక్ష్యంగా చేసుకొనేవారు. సర్వసభ్య సమావేశంలో నిలదీసేవారు. అందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టేవారు కూడా. ఇది నాణేనికి ఒక వైపు. మరోవైపు తనకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు ద క్కేలా చేసేవారు.. పలు విభాగాల్లో పనులు చేయించుకోవడంలో నేర్పరి. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనులు చేయించడంలోనూ అందెవేసిన చేయి. ఇలా వివిధ మార్గాల్లో పదవిని బాగా వినియోగించుకున్నారు. పదవి నుంచి దిగిపోయే ముందూ కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్లీ ఫ్లోర్‌లీడర్ హోదాలో జీహెచ్ఎంసీ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఒక చాంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ఫర్నిచర్, టీవీ, ఫ్రిజ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసింది. సాధారణంగా పదవి దిగిపోయేముందు వాటిని సంబంధిత మెయింటనెన్స్ విభాగానికి అప్పగించాలి. అయితే అలా జరగలేదు. ఈ నెల 3న కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిపోయింది. ఆరోజు తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య సమయంలో కొంతమంది గుంపుగా ఆయన చాంబర్లోకి వెళ్లి టేబుల్, కుర్చీలు, టీవీ, ఫ్రిజ్ తదితర వస్తువులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు విశ్వసనీయ సమాచారం. అడ్డుకోబోయిన సెక్యూరిటీని గద్దించారు. ‘మా అన్న సింగిరెడ్డి పంపాడు.. మాకే అడ్డుచెబుతావా’ అంటూ గద్దించారు. సెక్యూరిటీ సిబ్బంది సామగ్రి వివరాలు నోట్ చేసుకున్నారు. వచ్చినవారు దర్జాగా వాటిని వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది మెయింటనెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు. మౌనం వహించారు. శుక్రవారం టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ‘జీహెచ్ఎంసీ ఫర్నిచర్’ను ఎత్తుకుపోయారంటూ టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ విచారణ జరపాల్సిందిగా జీహెచ్ఎంసీ విజిలెన్స్, పరిపాలన విభాగం, ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. సామగ్రికి సంబంధించిన రికార్డులు ఎవరు నిర్వహించాలి.. ఈ ఘటనలో ఎవరి బాధ్యత ఎంత.. తదితర వివరాలతో సహ పూర్తి సమాచారం అందించాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఫ్లోర్ లీడర్‌తో ఎందుకొచ్చిన గొడవనుకొని తీసుకువెళ్లిన సామగ్రిని తిప్పి పంపించాల్సిందిగా కొందరు అధికారులు ఆయనను కోరినట్లు తెలిసింది. ‘ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు. నాకు సంబంధం లేదు. కావాలంటే అందుకయ్యే ఖర్చు ఎంతో చెల్లిస్తా’ అని ఆయన అధికారులతో అన్నట్టు తెలిసింది. అందుకు అధికారులు నిరాకరించారు. సామగ్రిని తిరిగి ఇవ్వాల్సిందేనంటూ సిబ్బందిని ఆయన ఇంటికి పంపించారు. సింగిరెడ్డి ఇంటి ముందు మీడియా ప్రతినిధులు ఉండడంతో సిబ్బంది వెనుదిరిగినట్టు సమాచారం. ‘గతంలో ఎవ్వరూ సామాన్లు తీసుకెళ్లలేదా..? నాగురించే ఎందుకు ప్రచారం చేశారు’ అంటూ శ్రీనివాసరెడ్డి కొందరు ఉద్యోగులతో ఫోన్లో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సెక్యూరిటీ, మెయింటనెన్స్ విభాగాల వారు ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు. అధికారులు కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించనున్నట్టు తెలిసింది. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు రిఫ్రిజిరేటర్, టీవీ, టేబుల్, కప్బోర్డు, 12 ప్లాస్టిక్ కుర్చీలు, మరో ఖరీదైన కుర్చీ తరలించినట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో ఇతర ఫ్లోర్‌లీడర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరుల చాంబర్లలోని ఫర్నిచర్ సరిగ్గా ఉందా అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నాకు తెలియదు.. సామగ్రి తరలింపుపై సింగిరెడ్డిని వివరణ కోరగా, వాటిని ఎవరు ఎత్తుకెళ్లారో తనకు తెలియదన్నారు. వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. -
నాలాల అభివృద్ధికి కమిటీలు
సమీక్ష సమావేశంలో సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో: చెరువులు, నాలాల పరిధిలో ఆక్రమణల తొలగింపు.. వాటి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అందుకనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధమయ్యారు. తొలి విడతలో భాగంగా ఐదు ప్రధాన నాలాల పరిధిలో వెలసిన ఆక్రమణలను గుర్తించి , వాటిని తొలగించడంతోపాటు సదరు నాలాలను అభివృద్ధి చేసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఈ అంశాలపై ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈపనుల కోసం ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, భూసేకరణ విభాగాల్లోని అధికారులతో సర్కిళ్ల స్థాయిలో సమన్వయకమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పనుల పర్యవేక్షణకు ప్రతి నాలాకు ప్రత్యేకాధికారిని నియమించనున్నట్లు చెప్పారు. తొలిదశలో మారియట్ హోటల్ నుంచి మూసీకి వెళ్లే హుస్సేన్‌సాగర్ సర్ప్లస్ నాలా, శేరిలింగంపల్లి నాలా, మీరాలం చెరువు- నూర్ మహ్మద్ట్యాంక్, ముర్కినాలా, కూకట్పల్లి నాలాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అఫ్జల్పార్కు పునరుద్ధరణకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా కన్సల్టెంట్‌కు సూచించారు. సమావేశంలో ఈఎన్సీ ధన్సింగ్, చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, జయరాజ్కెన్నెడితదితరులు పాల్గొన్నారు. -
మొహర్రం ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో వచ్చేనెల 4న మొహర్రం సందర్భంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బీబీకాఆలం ఊరేగింపు మార్గం లో, ఇతరత్రా ప్రధాన మార్గాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మేయర్ మాజిద్‌హుస్సేన్ అధికారులకు సూచించారు. శనివారం కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి మొహర్రం ఏర్పాట్లపై సమీక్షజరిపారు. రహదారులు, పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మొహర్రం సందర్భంగా ఎంపికచేసిన మార్గాల్లో ఎల్ఈడీ లైట్లు.. పాతబస్తీలో పారిశుధ్యానికి స్పెషల్‌డ్రైవ్ చేపట్టాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. -
నగర కేంద్ర గ్రంథాలయంలో ‘రూ.5 భోజనం’
వివేక్‌నగర్: నగర కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్‌తో కలసి రూ.5కు భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ హరేకృష్ణ మూవ్మెంట్ వారి సహకారంతో జీహెచ్ఎంసీ రూ.5కే భోజనాన్ని నగరంలో 15సెంటర్లలో అందిస్తోందన్నారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోంచి గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారని, వారిలో చాలామంది పేదవారు ఉన్నారని అన్నారు. ఇక్కడ రూ.5కే భోజనం ఏర్పాటు చేయడంతో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డా.లక్ష్మణ్, స్థానిక కార్పొరేటర్, ఇతర జీహెచ్ఎంసీ అధికారులు భోజన ఏర్పాట్లలో కృషిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం 500 మంది విద్యార్థులకు భోజనం అందజేస్తున్నామని, అవసరమైతే వెయ్యి మందికి సరఫరా చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డా.కే.లక్ష్మణ్ మాట్లాడుతూ బీదవారికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ సెస్ నిధులు విడుదల చేయాలి: గ్రంథాలయ చైర్మన్ కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నుంచి ఆరేళ్లుగా రావాల్సిన లైబ్రరీ సెస్సు దాదాపు రూ.80 కోట్లు ఉందని, దీంతో గ్రంథాలయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నగరంలోని 86 శాఖా గ్రంథాలయాల్లో విద్యుత్ బిల్లులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితి ఉందన్నారు. సెస్సు విడుదల చేయాలని కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ పీఆర్ఓ రవిలోచన స్వామి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ డా.సత్యనారాయణ, డీఎంసీ యాదగిరిరావు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. -
సొగసు చూడతరమా!
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు సర్కారు సరికొత్త ఆలోచన జలాశయ అందాలు ప్రతిబింబించేలా ప్రణాళిక సాక్షి, సిటీబ్యూరో: ఆకాశాన్ని తాకేలా విభిన్న ఆకృతులలోని భవనాలు... ఆ ఎదురుగా సుందర జలాశయం... చుట్టూ ఇంద్రధనుస్సును పోలినట్టుండే సప్త వర్ణాల పూలు... ఆ నీటిపై నుంచి భవనాలను కలుపుతూ ముచ్చటగొలిపే విద్యుత్ కాంతులు... ఈ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది కదూ. నగరానికి మణిహారంలా ఉన్న హుస్సేన్‌సాగర్ వద్ద ఈ దృశ్యం సాక్షాత్కరిస్తే... అబ్బో... ఆ ఊహే మహాద్భుతం... ఇక వాస్తవ రూపం దాలిస్తే...‘దాలిస్తే’ ఏంటి? దాల్చబోతోంది. అవును సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు వెలిసేందుకు అవ సరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం మరోవైపు జలాశయం చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే తలంపులో ఉంది. ఇందులో భాగంగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించింది. వీటికి సంబంధించి 26 కోర్టు కేసులు ఉన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పం దించిన ఆయన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అడ్వొకేట్ జనరల్‌కు సూచిం చారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న భూములను పలువురు ఆక్రమించడం.. ఏళ్ల తరబడి అవి కోర్టు కేసుల్లో నలుగుతుండటం తెలిసిందే. లీజు గడువు ముగిసిపోయినా కోర్టు స్టేతో ఖాళీ చేయకపోవడం... సాగర్‌కు ఒకవైపు ఆక్రమణలు వంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటిని తొలగించాలని యోచి స్తోంది. విదేశాల్లోని ప్రసిద్ధ నగరాలతో పాటు మనదేశంలోని ముంబై, కోచిల్లోని మెరైన్డ్రైవ్ల తరహాలో అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నగరాల మాదిరిగా హైదరాబాద్‌లోనూ ‘స్కైలైన్’ భవనాలను నిర్మించేందుకు అన్ని అంశాలను అధ్యయనం చేసి.. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. ఈ ‘ఆకాశహర్మ్యాల’ విషయం వాస్తవమేనని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. -
‘గ్రేటర్’ మార్పులు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. దీంతో నగరంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రత్యూష్‌సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల తుది జాబితా శుక్రవారం విడుదలైంది. గ్రేటర్లో ముఖ్య విభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్పెషల్ కమిషన ర్లు అహ్మద్‌బాబు, ప్రద్యుమ్న, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఆయా స్థానాల్లో కొత్త అధికారులు రానున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్‌ను అక్కడి నుంచి ఇప్పటికే బదిలీ చేయడంతో ఆ స్థానానికీ కొత్త అధికారి రానున్నారు. గత జాబితాలోనే వీరిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించి నప్పటికీ, తుది జాబితాలో మార్పుచేర్పులకు అవకాశముంటుం దనే అభిప్రాయాలు వెలువడ్డాయి. మెట్రోపొలిస్ సదస్సు ముగింపు రోజే తుది జాబితా వెలువడటం యాధృచ్ఛికమే అయినా, జీహెచ్ఎంసీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. తుదిజాబితాలో సోమేశ్‌కుమార్‌ను తెలంగాణకే కేటాయిస్తారని.. కాదు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తారని పందేలు కూడా జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు.. సమగ్ర కుటుంబ సర్వే.. బతుకమ్మ ఉత్సవాలు.. మెట్రోపొలిస్ వంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సోమేశ్‌కుమార్ ముఖ్యభూమిక పోషించారు. మెట్రోపొలిస్ నిర్వహణలో, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంలో అహ్మద్‌బాబు ఎంతోకృషి చేశారు. పనితీరుతోనే కాక, వ్యవహార తీరుతోనూ సోమేశ్‌కుమార్ వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. పలువురికి కంటగింపుగామారినప్పటికీ తనదైన శైలిలో ముందుకు సాగారు. గత ఏడాది అక్టోబర్ 23న సోమేశ్‌కుమార్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్నప్పటికీ తొలిజాబితాలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. తుది జాబితాలో మార్పులు జరగవచ్చుననే అభిప్రాయాలు వెలువడ్డాయి. స్పెషల్ కమిషనర్లు అహ్మద్‌బాబు, ప్రద్యుమ్నలు కొద్దినెలల కిందటే జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చారు. వీరిస్థానంలోనూ కొత్త అధికారులు రానున్నారు. తొలిజాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపు జరిగిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా సైతం తుదిజాబితాలోనూ అక్కడకే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రాబోయే అధికారుల కనుగుణంగా ఆయా విభాగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. -
బలపడిన ద్వైపాక్షిక బంధం
పలు నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చలు ప్రజారవాణా, గృహనిర్మాణం, స్మార్ట్ సిటీస్‌పై చర్చ పరస్పర సహకారానికి అంగీకారం వివరాలు వెల్లడించిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న సాక్షి, సిటీబ్యూరో: మెరుగైన ప్రజారవాణా, గృహ నిర్మాణం, స్మార్ట్‌సిటీల నిర్మాణం తదితర అంశాల్లో పలు నగరాలతో ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. హెచ్ఐసీసీలో మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం పలు నగరాల మేయర్లతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్ చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న విలేకరులకు వెల్లడించారు. ఆయా నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చించిన వివరాలు ఇలా.. మెట్రోపొలిస్ మేయర్ జీన్పాల్హచాన్తో.. తీరైన పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల నిర్మాణానికి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. మెట్రొపోలిస్ సదస్సులో ఆయా అంశాలపై జరిగిన చర్చలను వేర్వేరుగా డాక్యుమెంట్లను సిద్ధం చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను జీన్‌పాల్ హచాన్ ప్యారీస్‌కు ఆహ్వానించారు. త్వరలో వాతావరణ మార్పులపై ప్యారీస్‌లో నిర్వహించనున్న సదస్సులో పాల్గొనాలని కోరారు. బెర్లిన్ డిప్యూటీ మేయర్ బర్భరా బెర్నింగర్‌తో.. స్మార్ట్‌సిటీల నిర్మాణం,పేదలకు తక్కువ ఖర్చుతో నిర్మించనున్న గృహాలు, వికలాంగులకు చేయూతనిచ్చే విషయంలో బెర్లిన్ నగరం నుంచి సాంకేతిక సహకారం అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. జర్మన్ కంపెనీలు గ్రేటర్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఐటీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. వచ్చే ఏప్రిల్‌లో బెర్లిన్‌లో జరగనున్న మెట్రోపాలిటన్ సొల్యూషన్స్ సదస్సులో పాల్గొనాలని ఆమె కేటీఆర్‌ను ఆహ్వానించారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె హామీ ఇచ్చారు. మాషాద్ మేయర్ సోలాట్ మోర్తాజావితో.. సంస్కృతి, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారంతోపాటు పట్టణాభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై మంత్రి కేటీఆర్ చర్చించారు. ఇరాన్, హైదరాబాద్ నగరాలకు మధ్యనున్న చారిత్రక బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మషాద్ నగరం ఏటా 24 మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. ఇరాన్‌కు తమ నగరం ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతోందన్నారు. హైదరాబాద్ నుంచి మషాద్‌కు నేరుగా విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో పలు ఐటీ కంపెనీలు మషాద్ నగరంలోనూ తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి ఆయనకు తెలిపారు. జోహెన్స్‌బర్గ్ మేయర్ పార్క్స్ టవ్తో.. నగరాల్లో సురక్షిత భద్రతా ఏర్పాట్లు చేసే అంశంపై మంత్రి కేటీఆర్ చర్చించారు. విశ్వవిద్యాలయాల సౌజన్యంతో సైన్స్పార్క్ల ఏర్పాటుపై అభిప్రాయాలను పంచుకున్నారు. జోహెన్స్‌బర్గ్ నవనిర్మాణానికి అక్కడ చేపట్టిన సంస్కరణలు, సాధించిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను వివరించారు. జోహెన్స్‌బర్గ్ సహకారంతో హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. జోహెన్స్‌బర్గ్ నగరానికి ఐటీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. హరిత భవనాల నిర్మాణానికి సంబంధించిన సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు మంత్రి అంగీకారం తెలిపారు. ఐటీ, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. సావోపోలో మేయర్ రోవేనాతో.. దక్షిణ అమెరికాలోని సాపోలో నగరంలో 11 మిలియన్ల మంది నివసిస్తున్నారని రోవేనా మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. నిర్మాణరంగం,పట్టణాల్లో మౌలికవసతుల కల్పన, ఆరోగ్యం, గృహనిర్మాణం, వ్యాక్సీన్ల అభివృద్ధి విషయంలో పర స్పరం సహకరించుకోవాలనే ఆలోచనకు వచ్చారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో గృహనిర్మాణం, పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్, సావోపోలో నగరాల్లో ఉన్న అవకాశాలను చర్చించారు. బార్సిలోనా మేయర్ క్సేవియర్ ట్రయాస్తో.. స్మార్ట్‌సిటీల నిర్మాణం, ఇంధన భద్రత, సంక్షేమ పథకాల అమలు, ప్రజోపయోగ కార్యక్రమాలు, స్థలాలు, మేనేజ్మెంట్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పలు అంశాల్లో బార్సిలోనా సాధించిన విజయాలను ఆయన కేటీఆర్‌కు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. -
అఫ్జల్ పార్కును పునరుద్ధరిస్తాం
మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్ దత్తాత్రేయనగర్: ఉస్మానియా ఆస్పత్రి వెనుక గేటు వద్ద గల అఫ్జల్ పార్కును పునరుద్ధరించి సుందరంగా తీర్చి దిద్దుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. మూసీ ఒడ్డున గల చింతచెట్టు 150 మందిని రక్షించి సెప్టెంబర్ 28 నాటికి 106 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇండియాలో తనకు బాగా నచ్చిన చారిత్రక నగరం హైదరాబాద్ అన్నారు. నవాబుల కాలం నాటి ఈ పార్కు గత వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మూసీ నది ప్రక్షాళనకు అన్ని విభాగాల అధికారులతో పాటు ప్రజల సహకారం అవసరమన్నారు. ముఖ్యంగా ప్రజలు మూసీలో చెత్త వేయకుండా సహకరించాలన్నారు. అనంతరం ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.వేదకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పిన 1908 మూసీ నదికి వచ్చిన వరదతో నాటి పాలనా యంత్రాంగం వివిధ రంగాల నిపుణులతో కలిసి పలు పథకాలు చేపట్టిందన్నారు. దీంతో హైదరాబాద్ ఆధునిక సిటీ ప్లానింగ్‌కు ఒక ఉదాహరణగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రణాళికా రహిత వృద్ధి కారణంగా సమస్యలు పెరుగుతున్నాయన్నా రు. ఈ నేపథ్యంలోనే సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్‌లు నగర సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్ కార్యదర్శి సజ్జద్ షాహిద్, ఏకే హైమద్, జగన్ రెడ్డి, అన్వర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
పార్కింగ్‌కు ‘మార్కింగ్’
పార్కింగ్ లాట్ల వద్ద పూర్తి వివరాలతో బోర్డులు అక్రమ వసూళ్లకు త్వరలో జీహెచ్ఎంసీ చెక్ సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు పక్కన బండి పెడితే చాలు చేతిలో చీటి పెట్టి పార్కింగ్ చార్జ్ వసూలు చేసే అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలమేదో, కానిదేదో తెలియకపోవడంతో ఎవరు పడితే వారు చార్జ్ వసూలు చేస్తున్నారు. రహదారులనే పార్కింగ్ లాట్లుగా మార్చిన జీహెచ్ఎంసీ వైఖరిని ఆసరా చేసుకుని, ప్రైవేట్ వ్యక్తులు కూడా నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కూడళ్లలో ఈ దందాకు పాల్పడుతున్నారు. ఇకపై ఈ పరిస్థితి లేకుండా.. జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన స్థలాల్లో పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకో సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు పార్కింగ్ ప్రదేశంలో అవసరమైన మార్కింగ్‌లు.. పార్కింగ్ ఫీజుల వివరాలతో పాటు సదరు పార్కింగ్ ఏరియాను టెండర్ల ద్వారా జీహెచ్ఎంసీ ఎవరికి కేటాయించారు, తదితర వివరాలు ప్రముఖంగా కన్పించేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా.. ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పార్కింగ్ కేటాయించిన స్థలం కంటే అదనపు స్థలాన్ని ఆక్రమించి వసూలు చేస్తున్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తొలిదశలో ఎంపిక చేసిన 47 పార్కింగ్ ఏర్పాట్లలో వీటిని అమల్లోకి తేనున్నట్లు వివరించారు. రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎవరైనా అక్రమ వసూలుకు పాల్పడితే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసేందుకు సంబంధిత అధికారి ఫోన్ నంబరును కూడా అందుబాటులో ఉంచనున్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు సైతం (040-21 11 11 11) ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా ప్రజలకు పార్కింగ్ బాదుడు తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. పార్కింగ్ లాట్ల వద్ద ఉండాల్సిన వివరాలు.. పార్కింగ్ ఫీజు వివరాలు ప్రముఖంగా కనిపించేలా బోర్డుల ఏర్పాట్లు పార్కింగ్ సదుపాయం వేళల వివరాలు.. ప్రస్తుత రేట్ల మేరకు, పార్కింగ్ ఫీజులు.. నాలుగు చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 10, తర్వాత ప్రతి గంటకు రూ. 5 ద్విచక్ర వాహనాలు మొదటి రెండు గంటలకు రూ. 5. ఆపై గంటకు రూ. 3.మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ధరల్లోనూ మార్పులు చేసే అవకాశముంది. కొస మెరుపు: దాదాపు రెండేళ్ల క్రితం అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు సైతం ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ అప్పట్లో ఇది అమలుకు నోచుకోలేదు. -
ఇంటి నుంచే చూడొచ్చు!
మెట్రో పొలిస్ సదస్సు ప్రత్యక్ష ప్రసారం చురుగ్గా ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వచ్చేనెల 6- 10వ తేదీల జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సును టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు పర్యటించే మార్గాల్లోని అన్ని విభాగాలకు చెందిన రహదారులకు మరమ్మతులు చేయనున్నారు. మెట్రో రైలు కారిడార్లలో బారికేడ్లను తగ్గించనున్నారు. వాహనాలు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా సదస్సు పూర్తయ్యే వరకు కేవలం పని జరుగుతున్న ప్రాంతంలోనే బారికేడ్లు ఉంచుతారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఆ వివరాల ప్రకారం...9వ తేదీన సదస్సులో రాష్ట్రపతి పాల్గొంటారు. సదస్సును ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్‌బండ్‌లపై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనలు సైతం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ ద్వారా సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజుకారోజు నాలుగు పేజీల పత్రికను వెలువరించనున్నారు. సదస్సు విశేషాలు, ఫొటోలు తదితరమైన వాటితో నాలుగు రోజుల పాటు ఈ సంచికలు వెలువరిస్తారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, వీఐపీలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, జీహెచ్ఎంసీలు రాత్రి విందు ఇవ్వనున్నాయి. 6వ తేదీన తారామతి బారాదరిలో పర్యాటకశాఖ, 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి కేసీఆర్, 8న జలవిహార్‌లో జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ ఈ విందులిస్తారు. సదస్సు నిర్వహణకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రూ.కోటి, హెచ్ఎండీఏ రూ.2 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు నిధులిచ్చాయని కమిషనర్ తె లిపారు. ఎస్బీహెచ్ స్పాన్సర్‌షిప్‌గా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ జస్బీర్సింగ్ అనేజా రూ.30 లక్షల చెక్కునిచ్చారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు సైతం స్పాన్సర్‌షిప్‌నకు ముందుకొస్తున్నాయని కమిషనర్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. -
బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు
రూ.10 కోట్లతో పనులు 30 వేల బతుకమ్మలతో ప్రదర్శన జాతీయ స్థాయి మహిళా ప్రముఖులకు ఆహ్వానం జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడి హుస్సేన్ సాగర్‌ను సందర్శించిన సోమేశ్‌కుమార్ కవాడిగూడ: బతుకమ్మ వేడుకలను నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ట్యాంక్‌బండ్, రోటరీ పార్కు సమీపంలోని హుస్సేన్‌సాగర్‌ను సందర్శించారు. కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత తొలి బతుకమ్మ వేడుకలు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా హుస్సేన్ సాగర్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు మూడు ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోటరీ పార్కు వద్ద శాశ్వత ప్రాతిపదికన బతుకమ్మ ఘాట్‌ను నిర్మిస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన పనులను తక్షణమే ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ వేడుకలకు దేశంలో వివిధ హోదాల్లో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు, నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు. ఉత్సవాల చివరి రోజైన అక్టోబరు 2న బషీర్‌బాగ్ ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు సుమారు 30 వేల బతుకమ్మలతో భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం తదితర పనులు చేపడతామన్నారు. సాగర్ తీరాన్ని సందర్శించిన వారిలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రద్యుమ్న, సెంట్రల్ జోనల్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.ధన్సింగ్, చీఫ్ ఇంజినీర్ కె.సురేశ్, అడిషనల్ కమిషనర్లు ఎన్.రవికిరణ్, ఎల్.వందన్‌కుమార్ ఉన్నారు. -
రూ. 5కే భోజనం
తొమ్మిదో కేంద్రం ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో: పేదలకు సేవ చేయడం.. భగవంతునికి సేవ చేయడంతో సమానమని మేయర్ మాజిద్ హుస్సేన్ అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ. 5కే భోజన కార్యక్రమం తొమ్మిదో కేంద్రాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో లిబర్టీ బస్టాప్ వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల్ని జీహెచ్ఎంసీ చేపట్టినందున ఎంతో గర్వపడుతున్నానన్నారు. అక్టోబర్ 2వ తేదీకి మొత్తం 50 కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం రూపాయికే టిఫిన్ పథకాన్ని ప్రారంభించే యోచన ఉందన్నారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎంతోమందికి ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఈసెంటర్ను ప్రారంభించామన్నారు. ఈ పథకం వల్ల ఎందరో పేదలకు ఆకలి తీరుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పథకం వల్ల నేరాలు, దొంగతనాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ సమస్యల్లేకుండా ఉండేందుకుగాను మెరుగైన రహదారులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, సైనేజీలను ఏర్పాటుకు సహకరించాల్సిందిగా మేయర్, కమిషనర్లను కో రారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జి. రాజ్‌కుమార్, హరేకృష్ణ అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, కాంగ్రెస్ పక్ష నాయకుడు వాజిద్‌హుస్సేన్, స్పెషల్ కమిషనర్ ప్రద్యుమ్న, జోనల్ క మిషనర్ సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు. -
అత్యాధునిక హంగులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
లంగర్‌హౌస్: అంతర్జాతీయ ప్రమాణాలాతో అత్యాధునిక హంగులతో, నగరానికి సరికొత్త అందాలను తెచ్చిపెట్టేలా ఫుట్ ఓవర్, స్కైవాక్‌లను ఏర్పాటుచేస్తున్నామని నగర కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, పాదచారుల సౌకర్యార్ధం వీటిని నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలో 70 ప్రాంతాల్లో 100 బ్రిడ్జిలను, స్కైవాక్‌లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నామన్నారు. పశ్చిమ దిశలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను కలిపే లంగర్‌హౌస్ వద్ద ఉన్న టిప్పుఖాన్ బ్రిడ్జి, ఆర్టిలరీ సెంటర్ ప్రాంతాల్లో ఎంపీ అసదుద్దీన్, మేయర్ మాజీద్హుస్సేన్, కమిషనర్ తదితరులు మిలిటరీ అధికారులతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌లో ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయన్నారు. పాదచారుల సౌకర్యార్థం నగరంలోని ప్రధాన కూడళ్లలో 100 కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నామన్నారు. నాలుగు లైన్ల రోడ్లు, రద్దీ ఎక్కువ ఉన్న దాదాపు 70 ప్రాంతాల ను ఇప్పటికే గుర్తించామన్నారు పూర్తి స్తాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నామని ఆయన తెలిపా రు. వికలాంగులు, వృద్ధులు, చిన్నారుల కోసం ప్రతి ఫుట్ ఓవర్ బ్రిడ్డికి రెండు వైపులా లిఫ్ట్‌లు కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. గతంలో చేసినట్టు కాకుం డా సులువుగా ఉండేందుకు బ్రిడ్జిల నిర్మాణం, 3 సంవత్సరాల వరకు పర్యవేక్షణ ఒకరికి, బ్రిడ్జ్లపై వ్యాపార తదితర ప్రకటనల భాద్యతలు మరొకరికి, రోజు వారి శుభ్రత, పర్యవేక్షణ భాద్యతలు మరొకరికి అప్పజెప్పనున్నామన్నారు. ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు సహకరించి ప్రమాదాలను అరికట్టాలన్నారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నగర మేయర్, అధికారుల బృందం ఆర్టిలరీ సెంటర్‌ను సందర్శించారు. మిలటరీ కమాండెంట్ అధికారి కిరణ్‌కుమార్‌తో కలిసి చర్చలు జరిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేస్తేనే సామాన్య ప్రజలు కూడా రోడ్డు దాటడానికి అనుకూలంగా ఉంటదని ఎంపీ సూచించడంతో మిలటరీ అధికారులు అందుకు అంగీకరించారు. త్వరలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నమూనా రూపకల్పన చేసి మిలటరీ అధికారులకు అందిస్తామని, వారి అంగీకరన అనంతరం నిర్మాణ పనులు చేపడతామని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. మెహదీపట్నంలో నగరంలోనే సరికొత్త నమూనా బ్రిడ్జి.... మెహదీపట్నం వద్ద పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జికి మరింత వన్నెను తీసుకువస్తూ నగరంలోనే సరికొత్త రూపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మాంచనున్నామని ఎంపీ, కమిషనర్ తెలిపారు. కింద వాహనాలకు కాని, అటు ఫ్లై ఓవర్‌కు కాని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా పాదచారులకు సరికొత్త అనుభూతిని కల్పించేలా ప్రత్యేక నిపుణలతో ఈ ఫుట్ ఓవర్‌బ్రిడ్జి రూపకల్పన పనులను ప్రారంభించామన్నారు. ఈ పర్యటనలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్, అధికారులు రవికుమార్, సత్యకుమార్ తదితరులు ఉన్నారు. -
కలదో...లేదో!
మళ్లీ సర్వే కోసం ఎదురుచూపు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు కుటుంబాల సంఖ్యపై కనిపించని స్పష్టత రీ ఎంట్రీపై తలలు పట్టుకుంటున్న అధికారులు సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే మళ్లీ ఉంటుందా? లేదా అని గ్రేటర్‌లోని వివిధ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓవైపు మళ్లీ సర్వే జరిగే తేదీని ప్రకటించకపోవడం...మరోవైపు కంప్యూటరీకరణ ప్రక్రియ మొదలవడం సందేహాలకు తావిస్తోంది. గతనెల 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను మిగిలిన జిల్లాలతో పాటే గ్రేటర్‌లోనూ ఒక్కరోజులోనే పూర్తి చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. తమ వివరాలు సర్వేలో నమోదు కాలేదంటూ ఇంకా ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ఎంతలేదన్నా కనీసం లక్షకు తగ్గకుండా ఉంటాయని అంచనా. 2011 జనగణనలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నప్పటికీ 625 చ.కి.మీ. విస్తీర్ణం.. 20 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్న నగరంలో సర్వేకు ఒక్క రోజుసరిపోలేదు. 19న సర్వే జరిగినప్పటికీ..నేటి వరకు ఇంకా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. 19న ఎన్యూమరేటర్లు రాలేదని ఫిర్యాదులు చేసిన వారందరి ఇళ్లకు మరుసటి రోజు పంపించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. అయినప్పటికీ ఇంకా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ అనేకమంది రోజూ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వేలో నమోదు కాని వారందరికీ అవకాశం కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రెండు వారాలు గడిచిపోయినా నేటికీ సర్వే తేదీ ప్రకటించకపోవడంతో నమోదు కాని కుటుంబాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సర్వే పూర్తయిన ఇళ్ల కంప్యూటరీకరణ పనులు ప్రారంభం కావడంతో సర్వే ఉంటుందో, లేదోనని సందేహిస్తున్నారు. అంచనాలకు అందని కుటుంబాలు గ్రేటర్ జనాభాపై అధికారుల అంచనాలు మళ్లీ తప్పాయి. గతనెల 20 వరకు జరిగిన సర్వే వివరాల ప్రకారం దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు ఉండవచ్చునని అంచనా వేశారు. కానీ 2.40 లక్షల కుటుంబాల వారు తమంతట తామే అధికారులకు వివరాలు అందజేశారు. పూర్తి కాలేదంటూ... తమ ఇళ్లకు అధికారులెవరూ రాలేదని, తమ ప్రాంతాల్లో సర్వే జరగలేదని బస్తీలు, కాలనీల నుంచి నేటికీ ఫిర్యాదులు అందుతూనే ఉన్నా యి. కర్మన్‌ఘాట్ డివిజన్లోని మాధవనగర్, శివగంగ కాలనీ, డైమండ్ కాలనీ, నందనవనం భూపేష్ గుప్తా నగర్ కాలనీ, మన్సూరాబాద్ డివిజన్లోని మల్లికార్జున నగర్, శ్రీరామా హిల్స్, శ్రీరాంనగర్, వీకర్‌సెక్షన్ కాలనీ, మధురానగర్, అమ్మదయకాలనీ, సాయి సప్తగిరి కాలనీ, రాక్‌టౌన్, సాయినగర్, బాలాజినగర్ వాసులు సర్వే కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తపేట డివిజన్లోని వెంకటరమణ కాలనీ, మమతానగర్, బీకేరెడి ్డకాలనీలలో కేపీహెచ్‌బీ కాలనీ, వివేకానందన గర్కాలనీ, మోతీనగర్ ప్రాంతాలలో సర్వే పూర్తి కాలేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. సంఖ్యపై స్పష్టత కరవు: గ్రేటర్లో నిజంగా ఎన్ని కుటుంబాలున్నాయి.. జనాభా ఎంత అనే అంశాలపై నేటికీ స్పష్టత లేకుండా పోయింది. మిగిలిపోయిన కుటుం బాలన్నింటి సర్వే జరిగితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా సర్వేలో పేరు నమోదు కోసం గతనెల 19న జిల్లాలకు వెళ్లిన వారు సైతం జరగబోయే సర్వేలో తమ పేరు నమోదు చేయించుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీన్ని అధిగమించేదెలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కంప్యూటరీకరణలో జాప్యం సర్వే పూర్తయిన వివరాల కంప్యూటరీకరణ పనులు నగరంలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సర్వే చేయాల్సిన కుటుంబాలు 20 లక్షలకు పైగా ఉండటంతో టెండర్ల మేరకు అధిక మొత్తంలో కంప్యూటర్లు, ఆపరేటర్లు కలిగి ఉన్న సంస్థలకు పనులు అప్పగించడంలో జాప్యం జరిగింది. కంప్యూటరీకరణ పూర్తి కాకముందే మళ్లీ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారోనని పలువురు ఎదురు చూస్తున్నారు. గత నెల 20 వరకు అందిన సమాచారం మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 20,11,293 కుటుంబాల సర్వే పూర్తయింది. సర్వే పరిధిలోకి రాని కుటుంబాలు మరో 1,49,308 ఉండవచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ గత నెల 27 వరకు మరో 2,40,826 కుటుంబాలు సర్వేలో చోటు పొందాయి. మళ్లీ సర్వే కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు కనీసం లక్షకు తగ్గకుండా ఉండవచ్చునని అంచనా. -
సర్వేకు సన్నద్ధం
సాక్షి, సిటీబ్యూరో:సమగ్ర కుటుంబ సర్వేకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. ఆదివారం నిర్వహించిన ప్రీ సర్వేలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దుకుని సమర్ధవంతంగా సర్వే చేపడతామని కమిషనర్ సోమేష్‌కుమార్ చెప్పారు. ప్రీ సర్వేలో పదిళ్లు ఉన్న చోట వంద ఇళ్లు ఉండడంతో కరపత్రాలు సరిపోలేదు. ఇంటింటి స్టిక్కర్లు సైతం కొరత ఏర్పడింది. అలాగే సిబ్బంది కూడా సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇళ్లు ఎక్కువ ఉన్న చోట అదనంగా సిబ్బందిని నియమించనున్నారు. కళాశాల విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లతో పాటు వివిధ రంగాల్లోని వారిని ఇందుకు వినియోగించుకుంటామని కమిషనర్ చెప్పారు. కోటి జనాభా దాటిన నగరంలో ఇబ్బందులు సహజమేనని..వాటిని గుర్తించేందుకే ఏ జిల్లాలో లేని విధంగా నగరంలో రెండు రోజుల ప్రీ విజిట్లు నిర్వహిస్తున్నామన్నారు. గుర్తించిన లోటుపాట్లను దాదాపుగా పరిష్కరించామన్నారు. ఆదివారం దాదాపు 70 శాతం ప్రీ విజిట్ జరిగిందని, మంగళవారం మిగతా 30 శాతంతోపాటు.. రెండో విజిట్‌ను కూడా పూర్తిచేస్తామన్నారు. ఫిర్యాదులుంటే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు 040- 21 11 11 11 ఫోన్ చేయవచ్చునన్నారు. -
పకడ్బందీగా సమగ్ర సర్వే
రాంగోపాల్‌పేట్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 19వ తేదీన చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ అధికారులకు సూచించారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో స్పెషల్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, క్లస్టర్ ఇంచార్జ్, ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్ర భుత్వం ఈ సర్వే చేపట్టిందని అన్నారు. నగరంలో ఒకే రోజు కోటి మంది జనాభాను, 20 లక్షల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించడం సవాలులాంటిదేనని అన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ భాధ్యతగా తీసుకుని పనిచేయాలన్నారు. హదరాబాద్ నగరంలోనే అసోసియేట్ ఎన్యూమరేటర్స్గా ప్రైవేటు టీచర్లు, పోస్టుగ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ విద్యార్థులు తదితరులను వినియోగిస్తున్నామన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రీ విజిట్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. రెండు రోజులు సర్వే చేయడం వల్ల 19వ తేదీన చేపట్టే సర్వేలో ఎదురయ్యే ఇబ్బందులు ముందే తెలుస్తాయని వివరించారు. 19వ తేదీ ఉదయం 7గంటలకు ఫీల్డుకు వచ్చి రాత్రి 7గంటల వరకు సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. సర్వే రోజు ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులకు కూడా సెలవు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రజలు సర్వేకు వచ్చే అధికారులకు పూర్తిగా సహకరించాలని విద్యుత్, వాటర్, గ్యాస్, ఆధార్ కార్డు, అంగవైకల్యం ఉంటే సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ముఖేష్‌కుమార్‌మీనా, శ్రీధర్, స్పెషల్ కమిషనర్లు పద్యుమ్న, బాబు, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్, జోనల్ కమిషనర్లు, ఉప కమిషనర్లు సర్వేలో పాల్గొనే అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో సర్కార్‌కు నివేదిక
త్వరలో సర్కార్‌కు నివేదిక జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని 169 చెరువులకు సంబంధించి బఫర్ జోన్, ఎఫ్టీఎల్ల గుర్తింపు పూర్తయిందని, త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ల పరిధిలో కొత్త ఆక్రమణలు రాకుండా చూడటంతోపాటు ప్రస్తుతం జరుగుతోన్న నిర్మాణాలను కూల్చివేస్తామని పునరుద్ఘాటించారు. గతంలో, మునిసిపాలిటీల నుంచి భవన నిర్మాణ అనుమతులు పొంది చెరువు ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న వారి భవితవ్యంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వాటిపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్ఎంసీ విభాగాలు ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లపై సర్వే నిర్వహించినట్టు చెప్పారు. శిథిల భవనాలపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికుల పీఎఫ్‌లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలపై స్పందిస్తూ, పీఎఫ్, ఈఎస్‌ఐలపై తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని, ఇప్పటివరకు పీఎఫ్ పుస్తకాలు అందని వారుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇంకా ఎవరికైనా పీఎఫ్ పుస్తకాలు అందని పక్షంలో సంబంధిత అధికారులు వచ్చే మంగళవారంలోగా వాటిని అందజేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎఫ్ వ్యవహారాలు చూస్తున్న ప్రస్తుత ప్రైవేటు సంస్థ గడువు తీరిపోయిందని, త్వరలోనే కొత్త టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కూడా దోమలు వ్యాప్తి చెందకుండా తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. -
గ్రేటర్ వార్
మేయర్-కమిషనర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సోమేష్‌కుమార్ నిర్ణయాలను తప్పుబట్టిన మాజిద్ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్.. కమిషనర్ సోమేశ్‌కుమార్ మధ్య పొసగడం లేదా? పైకి బాగానే ఉన్నా.. లోలోన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందనే అనిపిస్తోంది. కమిషనర్ రూ. 5కే భోజన పథకాన్ని ప్రారంభించగా, మేయర్ రూపాయికే టిఫిన్ పథకాన్ని అమలు చేసే యోచన ఉందన్నారు. కమిషనర్ తన చాంబర్ నుంచి కనిపించేలా సీ త్రూ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోగా.. మేయర్ సైతం తన చాంబర్‌కు మెరుగులు దిద్దించుకుంటున్నారు. ఇప్ప టి వరకు ఇలా ఒకరి దారిలో ఒకరు నడిచిన వీరు తాజాగా, ఒకరి నిర్ణయాలతో మరొకరు విభేదించే పరిస్థితి నెలకొంది. బుధవారం మేయర్ విలేకరులతో మాట్లాడిన అంశాలు దీనినే నిరూపిస్తున్నాయి. మేయర్ స్పందించారిలా.. ‘రోజుకొక సంక్షేమ పథకాలను ప్రకటించడం సరికాదు. ఇప్పటికే ప్రకటించిన వాటిని పూర్తిగా అమలు చేయడంతో పాటు వర్షాకాలం మొదలైనందున చెత్త, పూడికతీత పనులపై శ్రద్ధ చూపాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఆమోదం పొందాకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. ఓ వైపు నాలాల్లో పూడిక పేరుకుపోయింది. మరోవైపు ప్రతిష్టాత్మక మెట్రోపొలిస్ సదస్సు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మొదట వాటిపై శ్రద్ధ చూపాలి’ అని పరోక్షంగా కమిషనర్ తీరుపై మేయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా అవసరమైన పనులను ఆయా కాలనీలు, బస్తీల సంఘాలకే అప్పగించే యోచన ఉందని, స్టాండింగ్ కమిటీలో అనుమతి పొందాక దీనిని అమలు చేయనున్నట్లు కమిషనర్ సోమేష్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని తనతో ప్రస్తావించకుండా ప్రకటించడం మేయర్‌కు రుచించి నట్లు లేదు. దీంతో బుధవారం జీహెచ్ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మేయర్.. కమిషనర్ నిర్ణయాలను తప్పుబట్టారు. డీసిల్టింగ్ పనులు పూర్తయినట్టు స్థానిక కార్పొరేటర్ల నుంచి సంతృప్తికర లేఖలు పొందాలని సూచిస్తే, పది శాతం కార్పొరేటర్ల నుంచే అందాయన్నారు. డీసిల్టింగ్ పూర్తయిందని ఇంజినీర్లు చెబితే చాలదని, స్థానిక ప్రజాప్రతినిధు లు, ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. కార్పొరేటర్ల బడ్జెట్ నుంచి ఒక్కొక్కరు రూ.75 లక్షల మేర జలమండలి చేపట్టే పనుల కోసం విడుదల చేస్తున్నందున సదరు పనులపై శ్రద్ధ చూపాలన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని ఎవరూ కాదనరని, కానీ అంతకంటే ముందు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్లాస్టిక్, రసాయన, తుక్కు నిల్వ పరిశ్రమల వంటి ప్రమాదకర అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలంటూ పరోక్షంగా కమిషనర్ చర్యలను తప్పుబట్టారు. భూసేకరణ అంశాలు త్వరగా పరిష్కా రం కావడం లేవని, జీహెచ్ఎంసీ న్యాయవిభాగం నిద్రపోతోందన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు జీహెచ్ఎంసీకి అప్పగించే వరకు ఆ రోడ్లు బాగుపడవని, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. వచ్చే వారం నుంచి వరుస సమీక్షలు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మేయర్ మాజిద్ హుస్సేన్ వచ్చే వారం నుంచి విభాగాల వారీగా వరుస సమీక్షలకు సిద్ధమయ్యారు. సోమవారం : స్టాండింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ తీర్మానాల అమలు మంగళవారం : {పజావాణిలో అందిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం బుధవారం : ‘ఫేస్ టూ ఫేస్’లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం గురువారం : స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి యూసీడీ పనులపై సమీక్ష శుక్రవారం : పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి దీపం కనెక్షన్లు, ఇతర అంశాలపై చర్చ. వీలైతే సీఎంను కలిసే యోచన శనివారం : మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లు.. పనుల నివేదిక పరిశీలన. వీలునుబట్టి ట్రేడ్ లెసైన్సు ఫీజుల పెంపు, తీర్మాలనాలపై సమీక్ష -
చెత్తే కదా అని విసిరేస్తే జైలుకే!
జీహెచ్ఎంసీ కొరడా దశలవారీగా జరిమానాలు పదేపదే అదే తప్పు చేస్తే జైలుశిక్ష ఎంపిక చేసిన 8 ప్రధాన మార్గాల్లో రేపట్నుంచి అమలు సాక్షి, సిటీబ్యూరో: ఇకపై రోడ్లపై ఇష్టానుసారం చెత్త వేస్తే కుదరదు. తొలిసారి రూ.500 జరిమానా.. మళ్లీ మళ్లీ అదే తప్పుచేస్తే ఈ మొత్తం దశల వారీగా రూ. 10 వేలకు పెరుగుతుంది. అంతేకాదు.. జైలు శిక్షా పడొచ్చు. గ్రేటర్లో చెత్త సమస్య పరిష్కారానికి సిద్ధమైన జీహెచ్ఎంసీ.. చెత్త రహిత రహదారుల (లిట్టర్ ఫ్రీ రోడ్స్)ను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 8 ప్రధాన మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ మార్గాల్లో ఆగస్టు 1 నుంచి ‘చెత్త వేస్తే జరిమానా’ చర్యలు అమల్లో ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. ప్రజారోగ్యం, నగర సుందరీకరణ కోసం ఈ కఠిన చర్యలకు సిద్ధమయ్యామన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టాలను అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవీ నిబంధనలు.. ఎంపిక చేసిన మార్గాల్లోని దుకాణదారులు, సంస్థలు, నివాసితులు చెత్తను జీహెచ్ఎంసీ నియమించిన వ్యక్తులకే అందజేయాలి సిబ్బంది రోజుకు రెండుసార్లు నిర్ణీత సమయాల్లో (ఉదయం 11-మధ్యాహ్నం 2, రాత్రి 8-10 గంటలు) చెత్తను సేకరిస్తారు. స్థానిక పరిస్థితులను బట్టి ఈ వేళల్లో మార్పుచేర్పులకు వీలుంది ఎంపిక చేసిన ప్రాంతాల్లోని రోడ్లపై ఎవరూ చెత్త వేయరాదు. దీనిని ఉల్లంఘిస్తే జరిమానా.. ఆపై జైలు శిక్ష ఉంటాయి ఈ మార్గాల్లోని దుకాణాదారులు, గృహాల వారితో పాటు తోపుడుబండ్ల వ్యాపారులు చెత్తను తమ ప్రాంగణంలోనే ఉంచాలి తడి, పొడి చెత్తలు వేయడానికి వీలుగా రెండు డబ్బాలను వినియోగించాలి. వాటికి మూతలుండాలి. ఆకుపచ్చ రంగు డబ్బాలో తడి చెత్త, తెలుపు రంగు డబ్బాలో పొడి చెత్త వేయాలి. నిర్ణీత సమయాల్లో వచ్చే జీహెచ్ఎంసీ గుర్తింపు పొందిన సేకరణదారుకు వీటిని అందజేయాలి రోజులోని 24 గంటల- నిబంధనలు అమల్లో ఉంటాయి. ఎప్పుడు చెత్త వేసినా అందుకు కారకులైన వారికి జరిమానా విధిస్తారు ఇవీ చెత్తర హిత మార్గాలు.. బంజారాహిల్స్ రోడ్‌నెంబరు 1: మాసాబ్‌ట్యాంక్ ప్యారడైజ్ హోటల్ నుంచి జీవీకే మాల్ మీదుగా నాగార్జున సర్కిల్ వరకు. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2: నాగార్జున సర్కిల్ నుంచి రోడ్డునెంబరు 2, టీవీ 9 కార్యాలయం, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చె క్పోస్టు వరకు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12: కళింగ ఫంక్షన్ హాల్ నుంచి ఇన్‌కంట్యాక్స్ క్వార్టర్స్ మీదుగా పెన్షన్ ఆఫీసు వరకు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 36: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి పెద్దమ్మగుడి మీదుగా మాదాపూర్ ఠాణా వరకు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 92: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి సీవీఆర్ న్యూస్, బాలకృష్ణ ఇంటి మీదుగా కళింగ ఫంక్షన్ హాల్ వరకు. ఖైరతాబాద్ ప్రధాన రహదారి: ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్ రోడ్డు, సోమాజిగూడ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం మీదుగా బేగంపేట ఫ్లైఓవర్ వరకు. బేగంపేట రోడ్: బేగంపేట ఫ్లైఓవర్ నుంచి గ్రీన్లాండ్స్ గెస్ట్‌హౌస్, పంజగుట్ట న్యూ ఫ్లైఓవర్ మీదుగా జీవీకే మాల్ వరకు. సచివాలయం రోడ్: ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ విగ్రహం, రవీంద్రభారతి మీదుగా అసెంబ్లీ వరకు. ఈ మార్గాల్లో రోడ్డుకు రెండు వైపులా నిబంధనలు అమలు చేస్తారు. -
గ్రేటర్ బాస్‌కు కోపమొచ్చింది
ఈఎస్ఐ నిధులు తెచ్చిన తంటా ఎస్బీహెచ్ అధికారుల తీరుపై గుర్రు చెప్పకుండానే మా నిధులు మళ్లిస్తారా? హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ కాళ్లబేరానికి వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్న సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ కమిషనర్‌కు ఒక్కసారిగా కోపమొచ్చింది. తమ కార్యాలయ ఆవరణలోని ఎస్బీహెచ్ శాఖ అధికారుల తీరుతో చిర్రెత్తిపోయారు. తమకు తెలియకుండా తమ నిధులను ఈఎస్ఐకి ఎలా మళ్లిస్తారంటూ మండిపడ్డారు. పక్కనే ఉంటూ తమను ఖాతరు చేయకుండా రూ.2 కోట్లను ఎలా బదిలీ చేశారంటూ ఏకంగా హైకోర్టుకెక్కారు. తప్పును తెలుసుకున్న బ్యాంకు అధికారులు కాళ్లబేరానికి వచ్చినా ససేమిరా అంటూ... తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే దిశగా సాగుతున్నారు. వివరాలు ఇలా.. జీహెచ్ఎంసీ కార్మికులకు చెందిన నిధుల (2010 సంవత్సరానివి) చెల్లింపులో జాప్యం జరిగిందంటూ ఈఎస్ఐ అధికారులు గత జనవరిలో జీహెచ్ఎంసీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈఎస్ఐ చెల్లింపుల్లో జాప్యం జరిగితే సదరు సంస్థ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే అధికారం ఈఎస్ఐకి ఉంది. అయితే ఇది ప్రైవేటు సంస్థలకు వర్తిస్తుంది తప్ప జీహెచ్ఎంసీకి వర్తించద ని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెబుతున్నారు. ఈఎస్ఐకి చెల్లించాల్సిన నిధుల్లో జాప్యానికి సంబంధించి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తే.. సదరు సంస్థ కోర్టు ద్వారా తిరిగి ఖాతాల పునరుద్ధరణకు ప్రయత్నం చేస్తుంది. లేదా నిధులు చెల్లిస్తుంది. జీహెచ్ఎంసీ కొన్ని సర్కిళ్ల పరిధిలో ఈఎస్ఐ చెల్లింపుల్లో జాప్యం జరిగిందంటూ ఈఎస్ఐ అధికారులు జీహెచ్ఎంసీ ఖాతా ఉన్న ట్యాంక్‌బండ్ శాఖ(ఇది జీహెచ్ఎంసీ కార్యాలయ ఆవరణలోనే ఉంది) అధికారులను సంప్రదించారు. సదరు బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే ఈనెల 2న సదరు బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసరావు ఈఎస్ఐకి రూ. 2కోట్ల పే ఆర్డర్ ఇచ్చారు. సదరు చెల్లింపులు జరిపినట్టు మరుసటి రోజు బ్యాంకు అధికారులు జీహెచ్ఎంసీ ఆర్థిక విభాగానికి తెలియజేశారు. ఆ విభాగం అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన కమిషనర్ తమ సొమ్మును తమకు తెలియకుండా ఇతరులకు ఎలా చెల్లిస్తారంటూ మండిపడ్డారు. ‘బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్’ అంటూ ఎస్బీహెచ్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దాంతో బ్యాంకు ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులతో గురువారం రాత్రి కమిషనర్ వద్దకు చేరుకున్నారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. అందుకు శాంతించని కమిషనర్ శుక్రవారంలోగా తమ సొమ్ము తిరిగి తమకు చేరాలన్నారు. లేనిపక్షంలో క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, జరిగిన విషయాన్ని వివరిస్తూ శుక్రవారం లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఈఎస్ఐకి జారీ అయిన సదరు ‘పే ఆర్డర్’ చెల్లింపులు నిలివేయాల్సిందిగా ఆదేశిస్తూ మూడు వారాల వరకు స్టే ఇచ్చింది. ఎస్బీహెచ్ అధికారులు కమిషనర్‌తో కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ ఆవరణలోనే బ్యాంకు శాఖ ఉన్నా తమ దృష్టికి తేకుండానే సొమ్మును బదిలీ చేయడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. జీహెచ్ఎంసీ గౌరవానికి భంగం కలిగించిన ఎస్బీహెచ్ అధికారుల తీరును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కార్యాలయ ఆవరణలోని ఈ బ్యాంక్ శాఖను తరలించే యోచనతోపాటు.. తమ డిపాజిట్లను అక్కడి నుంచి వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. సదరు బ్యాంక్‌లో జీహెచ్ఎంసీకి చెందిన దాదాపు రూ.వెయ్యికోట్లకు పైగా డిపాజిట్లున్నాయి. మరో రూ.200 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ అవసరాల కోసమే ఆవరణలోనే బ్యాంకు బ్రాంచీని ఏర్పాటు చేశారు. ఇతర ఖాతాదారులు స్వల్పంగానే ఉంటారు. గ్రేటర్ కమిషనర్ నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. -
మెట్రో మార్గాల్లో నో ఫికర్
సాక్షి,సిటీబ్యూరో: మెట్రోరైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు తగ్గి ఇరుకుగా మారినందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) జితేందర్లతో కలిసి మెట్రోరైలు కారిడార్-1 లోని నిరంకారి భవన్, లాజరస్ హాస్పిటల్, లక్డికాపూల్-రంగమహల్ జంక్షన్, జాంబాగ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వస్తున్నది వర్షాకాలం అయినందున బారికేడ్లు బలంగా లేకుంటే ప్రమాదాలకు ఆస్కారముం టుందన్నారు. ప్రజాభద్రత దృష్ట్యా రోడ్ల తవ్వకాలు జరిగిన ప్రదేశాల్లోనూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. పనులు పూర్తయిన ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించాలని, పద్ధతి ప్రకారం రోడ్ల రీకార్పెటింగ్ పనులు పూర్తిచేయాలని.. తద్వారా వాహనాలు సాఫీగా ప్రయాణించగలుగుతాయని చెప్పారు. ప్రజలకు అసౌకర్యంగా ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని,మ్యాన్‌హోల్స్ రోడ్డు ఎత్తుకు సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాదచారుల సదుపాయార్థం కనీసం నాలుగైదు అడుగుల వెడల్పు ఉండేలా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తున్నామంటూ..ఎన్వీఎస్‌రెడ్డిలు ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ ఇంజినీర్లు, ఇతరత్రా అధికారులకు కమిషనర్ సోమేశ్‌కుమార్ తగు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పి.వెంకటరామిరెడ్డి, జోనల్ కమిషనర్ రోనాల్డ్‌రాస్, రఘు తదితరులు వీరి వెంట ఉన్నారు. -
మెట్రో కారిడార్లలో రోడ్ల విస్తరణ వేగవంతం
అధికారులను ఆదేశించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మైట్రో రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రహదారుల విస్తరణ వేగవంతం చేయాలని, ఆస్తుల సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ పనులపై శుక్రవారం హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో కలిసి బల్దియా కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ ..రహదారి విస్తరణకు వీలుగా కారిడార్-1 పరిధిలో మూసాపేట్,అమీర్‌పేట్,నాంపల్లిలో 38, ఉస్మానియా మెడికల్ కళాశాల, న్యూ మలక్‌పేట్‌లలో 25 ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. కారిడార్-2 పరిధిలో క్లాక్‌టవర్, బోయిగూడ వై-జంక్షన్లో 5, ముషీరాబాద్ ఎక్స్‌రోడ్స్ నుంచి కాచిగూడా ఎక్స్‌రోడ్స్ వరకు ఉన్న 51 ఆస్తులు, ఎంజీబీఎస్ నుంచి శాలిబండ వరకు 445 ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. కారిడార్-3 పరిధిలో మెట్టుగూడ-గ్రీన్‌ల్యాండ్స్ మార్గంలో 10, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి శిల్పారామం వరకు 12 ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. సెల్లార్లు ప్రమాదకరంగా ఉంటే చర్యలు: సోమేష్‌కుమార్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవంతుల సెల్లార్లు ప్రమాదకరంగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు నోటీసులు జారీ చేయాలని క మిషనర్ సోమేష్‌కుమార్ టౌన్‌ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం 18 సర్కిళ్ల పరిధిలో 58 భవంతుల సెల్లార్లు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పురాతన భవంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. గ్రేటర్ పరిధిలో సుమారు 1538 పురాతన భవంతులున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్‌కు తెలిపారు. వర్షాకాలంలో ఇవి కూలి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత యజమానులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో సదరు యజమానులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సూచించారు. ఆక్యుపెన్సీ పత్రాల జారీని వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు వెంకటరామిరెడ్డి, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
జూన్ 6న ‘స్టాండింగ్’ ఎన్నికలు
నోటిఫికేషన్ విడుదల చే సిన జీహెచ్ఎంసీ కమిషనర్ 26 వరకు నామినేషన్ల స్వీకరణ 28న స్క్రూటినీ..ఉపసంహరణ గడువు 31 సిటీబ్యూరో, న్యూస్‌లైన్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల గడువు త్వరలో ముగిసిపోనుండటంతో కొత్త సభ్యుల ఎన్నిక కోసం ఎన్నికల షెడ్యూలు జారీ అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ శనివారం షెడ్యూలు విడుదల చేశారు. వచ్చేనెల 6వ తేదీన స్టాండింగ్ కమిటీ సభ్యత్వాలకు ఎన్నిక నిర్వహిస్తారు. శనివారం నుంచే నామినేషన్ల స్వీకరణనూ ప్రారంభించారు. ఈ నెల 26 వరకు (పనిదినాల్లో) స్టాండింగ్ కమిటీ సభ్యత్వానికి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేసినవారి జాబితా 27న వెలువరిస్తారు. 28వ తేదీన ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరిపి పోటీకి అర్హులైన వారి పేర్లు వెలువరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను అదే రోజు వెలువరిస్తారు. జూన్ 6వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆసక్తికరంగా మారనున్న ఎన్నికలు జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లుండగా.. పదిమంది కార్పొరేటర్లకు ఒక సభ్యుడు వంతున మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో 8 మంది కాంగ్రెస్ సభ్యులుండగా.. ఏడుగురు మజ్లిస్ సభ్యులున్నారు. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య అవగాహనతో రెండు పార్టీల నుంచి సభ్యులు ఎన్నికయ్యారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య విభేదాలతోపాటు.. ఆయా పార్టీల నుంచి పలువురు ఇతర పార్టీల్లోకి ఫిరాయించడంతో ఈసారి స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ-బీజేపీ పొత్తు జీహెచ్ఎంసీలోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు జత క ట్టడంతోపాటు ఇతరులను కూడా తమ దారిలోకి తెచ్చుకుంటే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే డిసెంబర్లో ముగియనుండటంతో ఈసారి స్టాండింగ్ కమిటీ సభ్యులకు మరింత డిమాండ్ పెరిగింది. -
నరకం
‘జడి’సిన నగరం అకాల వానతో కకావికలం గోదారులైన రహదారులు స్తంభించిన రాకపోకలు రోడ్లపై నిలిచిన నీళ్లు పూడికతీయని నాలాలు లోతట్టు ప్రాంతాలు మునక సాక్షి, సిటీబ్యూరో: షరా మామూలు. శుక్రవారం కురిసిన వానతో నగరం కకావికలమైంది. సరిగ్గా కార్యాలయాలకు వెళ్లే.. తిరిగి వచ్చే వేళ కురిసిన వానతో రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల నాలాలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. మెహిదీపట్నం, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. నాలాలు, మురుగునీటి పైప్లైన్లలో పేరుకుపోయిన పూడికతో వర్షపు నీరు వెళ్లే దారి లేకుండాపోయింది. దీంతో నీరంతా సమీపంలోని రహదారులు, కాలనీలను ముంచెత్తింది. ఇంత జరిగినా జీహెచ్ఎంసీ, జలమండలిలోని అత్యవసర బృందాలు జాడలేకుండా పోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షం ప్రభావం ట్రాఫిక్‌పై పడింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్, మలేషియా టౌన్షిప్, పంజగుట్ట, అమీర్‌పేట తదితర ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. ఉదయం వేళ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పనులపై బయల్దేరిన జనం అవస్థలు పడ్డారు. తిరిగి సాయంత్రం పడిన వానతో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. అబిడ్స్, కోఠి, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, తార్నాక, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, బాలానగర్, సనత్‌నగర్, మెహిదీపట్నం, చార్మినార్, బహదూర్‌పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నరకం చూపించింది. పూర్తికాని పనులు.. రోడ్లపైకి నీళ్లు వర్షం పడిన ప్రతిసారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం నగరంలో షరా మామూలైంది. వాననీరు వెళ్లే దారిలేక రోడ్లపైనే నిలిచిపోతుండటం ఇందుకు కారణం. ఏటా ఎదురవుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు, రోడ్లపై నీరు నిలవకుండా, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో వరదనీటి సంపులు నిర్మించాలని, అవసరమైన పైప్ డ్రెయిన్లు వేయాలని, మరమ్మతులు చేయాలని, సీసీ రోడ్లు నిర్మించాలని అధికారులు భావించారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తీరుతుందని అంచనా వేశారు. తరచూ నీరు నిలిచిపోతుండటం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరుగుతున్న నష్టాన్ని నివారించవచ్చని లెక్కలు వేశారు. ఈ క్రమంలో 104 నీటిముంపు ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులన్నింటినీ వేసవిలోపు, వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలనుకున్నారు. 13 ప్రదేశాలకు మాత్రం ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఏప్రిల్‌లోనే మరమ్మతులు చేయాలనుకున్నారు. ప్రణాళిక బాగానే ఉన్నా.. కార్యాచరణ కొరవడింది. దీంతో గురు, శుక్రవారాల్లో కురిసిన వానతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పనులు చేయలేకుంటే, మిగతా ప్రాంతాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన పనుల అంచనా వ్యయం రూ. 61. 33 లక్షలు. నిధులున్నా పనులు పూర్తికాలేదు. ఫలితంగా నాలుగు చినుకులకే నగరవాసి నరకం చవిచూశాడు. ఇక, వర్షాకాలంలో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, బషీర్‌బాగ్, అంబర్‌పేట, అమీర్‌పేట ధరంకరం రోడ్డు ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులందాయి. లక్డికాపూల్లో పోలీస్‌స్టేషన్ సమీపంలో నీటినిల్వకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఇదా మీ పనితీరు? నగరంలో నీటి నిల్వ ప్రాంతాలు, డీసిల్టింగ్ పనుల తనిఖీకి శుక్రవారం ఆయా ప్రాంతాలకు వెళ్లిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్.. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద నీటి నిల్వ సమస్య గురించి గవర్నర్ నరసింహన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అధికారులపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా హెచ్చరించారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ దగ్గర పనులకు మార్గదర్శకాలతోపాటు అవసరమైన నిధులు మంజూరుచేసినా పనులెందుకు పూర్తి చేయలేదంటూ ఈఈపై విరుచుకుపడ్డారు. శుక్రవారం రాత్రిలోగా పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్య లు తప్పవని సోమేష్‌కుమార్ హెచ్చరించారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయనందునే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని కమిషనర్ అన్నారు. గతంలో తీవ్ర సమస్యగా ఉన్న మైత్రీవనం వద్ద అవసరమైన చర్యలు తీసుకున్నందున అక్కడ నీటినిల్వ సమస్య సమసిపోయిందని, 15 నిమిషాల్లో వరద నీరు మొత్తం వెళ్లిపోతోందన్నారు. తగినన్ని నిధులున్నా, ప్రజలు కష్టాలు పడుతున్నా చలించని ఇంజినీర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్.. ఈఎన్సీ ధన్సింగ్, చీఫ్ ఇంజినీర్ ఆంజనేయులు తదితరులతో కలిసి సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం, బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్, టోలిచౌకి, షేక్‌పేట, మైత్రీవనం ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. -
రె‘ఢీ’
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం జరగనున్న పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, సామగ్రి, సిబ్బంది సమస్తం అందుబాటులో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన పోలింగ్ ఏర్పాట్లపై మాట్లాడారు. గత ఎన్నికల్లో జిల్లాలో 53 శాతం మాత్రమే జరిగిన పోలింగ్‌ను ఈసారి కనీసం 70 శాతానికి పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో ఎన్నికల తేదీ, సమయం, పోలింగ్ కేంద్రం వంటి కనీస సమాచారం కూడా చాలామందికి తెలియకపోవడంతో పోలింగ్ తక్కువగా జరిగిందన్న అంశాన్ని తమ సర్వే ద్వారా గుర్తించామని చెప్పారు. అదే పరిస్థితి ప్రస్తుతం పునరావృతం కాకుండా ఉండేందుకు ఓటర్లకు పోలింగ్‌కేంద్రం తదితరమైన వివరాలు తెలిసేలా ఓటరుస్లిప్‌లు ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు 67 శాతం మందికి ఈ స్లిప్పుల పంపిణీ జరిగిందన్నారు. మొత్తంగా 80-85 శాతం మందికి ఈ స్లిప్పులు అందగలవని అంచనా వేశామని చెప్పారు. ఓటరు స్లిప్పులు అందకపోయినప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఓటరు జాబితాలో పేరుంటే చాలు.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చునన్నారు. ఓటర్లు స్లిప్పులు లేనివారు సంబంధిత బీఎల్ఓల దగ్గర వాటిని తీసుకోవచ్చన్నారు. అదీ కుదరని వారు 91779 99876 నెంబరుకు ఎస్ఎంఎస్ చేస్తే నిమిషంలోగా వారి పోలింగ్ కేంద్రం, వరుస సంఖ్యలతో సహా వివరాలు అందుతాయన్నారు. ఇందుకు కేవైపీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎపిక్‌కార్డు నెంబరు (ఉదా: కేవైపీ టీజడ్టీ1277533) ఎస్ఎంఎస్ చేయాలన్నారు. హైదరాబాద్ జిల్లాలోని వారు మాత్రమే కాక గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఓటరు స్లిప్ లే కపోయినా ఓటరు జాబితాలో పేరున్నవారు ఏదేని ఫొటో గుర్తింపుకార్డును చూపి ఓటు వేయవచ్చునన్నారు. 11 రకాలైన డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపినా జాబితాలో పేరున్నవారు ఓటు వేయవచ్చని.. ఓటరు జాబితాలో పేరున్నదీ లేనిదీ జీహెచ్ంఎసీ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. జాబితాలో పేరు లేకపోతే మాత్రం ఓటుహక్కు ఉండదని స్పష్టం చేశారు. ఓటర్ల సదుపాయం కోసం పోలింగ్‌కేంద్రాల వద్ద బీఎల్ఓలు, హెల్ప్డె స్క్‌లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. జిల్లా పరిధిలోని 3,386 పోలింగ్ కేంద్రాల వద్ద లైవ్ వెబ్‌కాస్టింగ్ ఉంటుందని, దీని ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న 1480 భవనాల వద్ద ఈ- హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్నికల విధుల కోసం 22,348 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను నియమించామన్నారు. వీరితోపాటు 255 మంది సెక్టోరల్ అధికారులు, 1,482 మంది అదనపు సెక్టోరల్ అధికారులు ఉంటారన్నారు. అవసరానికి మించి ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా జరిగేందుకు వీలుగా తగినన్ని పోలీసు బృందాలు, బలగాలు అందుబాటులో ఉన్నాయని సోమేశ్‌కుమార్ వివరించారు. 30న సెలవు అందరూ ఓటు వేసేందుకు వీలుగా 30వ తేదీన జిల్లాలోని అన్ని హోటళ్లు, మాల్స్, థియేటర్లు, పార్కులు మూసివే యనున్నట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన గుర్తింపు కార్డులివీ... 1. పాస్‌పోర్టు 2.డ్రైవింగ్లెసైన్సు 3. కేంద్ర/ రాష్ట్ర/ప్రభుత్వాల్లో పనిచేసే వారి సర్వీసు ఐడీ కార్డులు 4. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలిచ్చే గుర్తింపు కార్డులు 5. బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌బుక్స్ (ఫొటోలతో కూడినవి) 6. పాన్‌కార్డు 7. ఆధార్ కార్డు 8. ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు 9. ఎంఎన్ఆర్ ఈజీఏ జాబ్‌కార్డు 10. కార్మికశాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్‌కార్డు 11.పెన్షన్ డాక్యుమెంట్( ఫొటోతో కూడినది). -
పోలింగ్ పెంపే లక్ష్యం
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 53 శాతం మాత్రమే ఉన్న పోలింగ్‌ను 75 శాతానికి పెంచడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘నో యువర్ పో లింగ్ బూత్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ వెల్లడించారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీ, జాబితాలపై ఆదివారం ఆయన బంజారాహిల్స్ రోడ్‌నెం.14లోని బాదం సరోజాదేవి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌బూత్‌ను జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోనల్ కమిషనర్ రొనాల్డ్ రాస్, డీఎంసీ సోమరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ, నగరంలో పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి కారణం పోలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో, జాబితాలో పేరు ఉందో లేదో, ఓటరు స్లిప్‌లు అందాయో లేదో అనే విషయాలు ఓటర్లకు తెలియకపోవడమే కారణమని ఓ సర్వేలో తేలిందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 40 వేల మంది ఓటర్ల పేర్లు జాబితాలో లేవని తెలియడంతో తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. నగరంలో 3091 పో లింగ్ బూత్‌లలో ఓటర్లకు తమ పోలింగ్ బూత్‌లపై అవగాహన, ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకునే నిమిత్తం పది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశామని చెప్పారు. బీఎల్ఓలు గైర్హాజరైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వందశాతం ఓట ర్లకు ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తామన్నారు. 24 గంటలు పని చేసే 040-21111111 నంబర్లో తమ బీఎల్ఓ పేరు, తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల పని తీరును 35 మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. 30న థియేటర్ల బంద్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈనెల 30న అన్ని థియేటర్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, కార్యాలయాలు, పరిశ్రమలు మూయించి వేస్తామని సోమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే థియేటర్లు, ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశామన్నారు.ఇందు కోసం 15 స్క్వాడ్స్ రంగంలోకి దించుతున్నామని, ఎక్కడైనా తెరిచినట్లు తెరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని బంద్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీని వల్ల ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు
రాజకీయ పార్టీలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి ఎన్నికల నిర్వహణపై సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కోరారు. అందుకుగాను స్థానిక పోలింగ్ ఏజెంట్లకు తగిన శిక్షణ నివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి శుక్రవారం జీహెచ్ఎంసీలో ఆయా రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలింగ్ శాతాన్ని కనీసం 75 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని సాధించేందుకు మీదే ముఖ్యభూమిక అని వారి నుద్దేశించి అన్నారు. ఈనెల 20న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు ‘నో యువర్ పోలింగ్ స్టేషన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా చివరి క్షణంలో తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదన్నారు. ‘నో యువర్ పోలింగ్ స్టేషన్’ ద్వారా 20వ తేదీన (ఆదివారం) జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్‌లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని, కుటుంబంలోని కనీసం ఒకరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటర్ల జాబితాలో తమ పేర్లున్నదీ.. క్రమసంఖ్య నిర్ధారించుకోవాలన్నారు. దాంతోపాటు అప్పటిలోగా ఫొటోఓటరు స్లిప్స్(పీవీఎస్) తమ ఇళ్లకు రానట్లయితే పోలింగ్ కేంద్రంలో వాటిని అడిగి తీసుకోవచ్చన్నారు. అధికార యం త్రాంగమే ఇళ్లకు వెళ్లి పీవీఎస్‌లు అందజేసే పద్థతిని దేశంలోనే తొలిసారిగా ప్రారంభించామన్నారు. తగిన ఆధారాలుంటే కుటుంబసభ్యులందరి పీవీఎస్ లు కుటుంబంలోని ఒకరు తీసుకోవచ్చునని చెప్పారు. అంతే తప్ప ఎవరికి పడితే వారికి పీవీఎస్‌లు ఇవ్వరని చెప్పారు. -
ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీ
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరానికి (2014-15) సంబంధించి ఏప్రిల్ 30 లోగా మొత్తం ఆస్తిపన్ను చెల్లించేవారికి 5 శాతం రిబేటు ఇవ్వనున్నారు. ‘ఎర్లీ బర్డ్’ పేరిట ఈ ఏడాది నుంచే ఈ కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేసిన చట్ట సవరణకు అనుగుణంగా దీన్ని అమలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అదనపు కమిషనర్ (రెవెన్యూ) సూర్యదేవర హరికృష్ణతో కలిసి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. డిమాండ్ నోటీసు రాలేదని ఎదురు చూడకుండా ప్రజలు తమ ఆస్తి పన్నును ఈసేవా కేంద్రాలు, సీఎస్సీల ద్వారా చెల్లించవచ్చునన్నారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను మొత్తాన్ని ఒకే పర్యాయం చెల్లించేవారికి.. పాత బకాయిలు లేనివారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. అలాగే జూలై లోగా చెల్లించని వారికి ఆగస్టు నుంచి ప్రతి నెలా రెండు శాతం చొప్పున వడ్డీ విధిస్తామన్నారు. ఈ పథకం అమలు ద్వారా ఏప్రిల్‌లో రూ. 250 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలు కాగలదని అంచనా. గత ఆర్థిక సంవత్సరం (2013-14) ఆస్తిపన్ను రూపేణా జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.1022 కోట్లు వచ్చాయని కమిషనర్ తెలిపారు. -
అనర్హులను అడ్డుకోండి...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచన బూత్‌ల వద్ద క్యూ ఉంటే ఓటరుకు మెస్సేజ్ జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ వెల్లడి పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశం కవాడిగూడ,న్యూస్‌లైన్: ఈసారి ఎన్నికల్లో అనర్హులు నామినేషన్ దాఖలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికల జీహెచ్ఎంసీ రౌండ్‌టేబుల్ సమావేశం సోమేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లోయర్‌ట్యాంక్‌బండ్ హోటల్ మారియట్‌లో జరిగింది. దీనికి భన్వర్‌లాల్‌తోపాటు హైదరాబాద్ కలెక్టర్ ఎంకే మీనా, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ప్రత్యేక కమిషనర్ రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో 20శాతం పోలింగ్ పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూఅధికంగా ఉండటం కారణంగా చాలామంది వెనుదిరిగి వెళ్తున్నారని, ఈ పరిస్థితి నివారించేందుకు ఓటర్లకు ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పించే యోచన ఉన్నట్లు చెప్పారు. పోలింగ్‌బూత్‌ల వద్ద ఎంతమంది క్యూలో ఉన్నారు అనే విషయాన్ని ఓటర్లకు సమాచారమిచ్చేందుకు ప్రత్యేక ఎస్ఎంఎస్ నంబర్ ను తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీకాకుండా జీహెచ్ఎంసీ 21111111 నంబర్ కు ఫోన్‌చేసి సమాచారమడిగితే వివరాలు చెబుతారని తెలిపారు. రెండురోజుల్లో ప్రత్యేక ఎస్ఎంఎస్ నంబర్‌ను ప్రకటిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎంకే మీనా మాట్లాడుతూ నియె ూజకవర్గాల్లోని సెక్టార్లలో అసిస్టెంట్ సెక్టార్ అధికారి అత్యంత క్రియాశీలకంగా పనిచేయాలని, అసిస్టెంట్ సెక్టార్ అధికారులను సెక్టార్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్‌బూత్‌ల వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించా రు. పోలింగ్‌బూత్‌ల వద్ద అన్నిరకాల సదుపాయాలు సమకూర్చాలంటూ.. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయంపై ఎప్పటికప్పుడు అధికారులు నివేదిక తయారుచేసి పంపాలన్నారు. ముందుగానే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, పోలింగ్‌బూత్‌లను ఓటర్లకు పరిచయం చేయడం, పోలింగ్‌రోజును ఓటర్లకు తెలియజేయడం, బూత్‌ల వద్ద రిస్పెషన్ల ఏర్పాట్ల గురించి వివరించా రు. ఈసందర్భంగా జీహెచ్ఎంసీ 24 నియోజకవర్గాల్లో జరిపిన సర్వేవివరాలను అధికారులకు వివరించారు. ఇందులో 93.67 శాతం మందికి ఓటరు ఐడీకార్డులు ఉన్నట్లు తేలిందని, 86శాతం మంది ఎన్నికలు జరుగుతున్నట్లు టీవీల ద్వారా తెలుసుకున్నారని, ఎస్సీలు, వీకర్‌సెక్షన్‌కాలనీల్లో ఎన్నికలు ఉన్నట్లుగా తమకు తెలియదని 30 నుంచి 40 శాతం మంది చెప్పినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎంఎస్ ఎన్నికలకు సంబంధించి ప్రజల సమస్యలు.. వివిధ రకాల ఫిర్యాదులు ఎస్ఎంఎస్ ద్వారా స్వీకరించి పరిష్కరించేందుకు అధికారులు కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదు రాగానే అది అందిన విషయాన్ని తెలియజేస్తారు. సమస్య పరిష్కారం కోసం వెంటనే దాన్ని సంబంధిత అధికారికి ఎస్ఎంఎస్ చేస్తారు. -
‘గ్రేటర్’ వసూళ్లు
రూ. వెయ్యి కోట్లకు పైగాఆస్తిపన్ను వసూలు తొలిసారిగా దాటిన నాలుగంకెల ఫిగర్ ఫలించిన కమిషనర్ సోమేశ్‌కుమార్ వ్యూహం సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ అరుదైన రికార్డు నమోదు చేసింది. నాలుగంకెల మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. గతంలో మున్నెన్నడూ లేని విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1010 కోట్లు (సోమవారం రాత్రి 8 గంటల వరకు లెక్కించిన మేరకు) వసూలు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత భారీమొత్తంలో ఆస్తిపన్ను వసూలు కావడం ఒక రికార్డు కాగా.. పన్నును ఏమాత్రం పెంచకుండా.. బకాయిదార్ల పేర్లు బజార్లలో ప్రదర్శించకుండా భారీ మొత్తంలో సొమ్మును వసూలు చేయడం మరో విశేషం. గత మూడేళ్లుగా ఏటికేడు ఆస్తిపన్ను వసూళ్లు పెరుగుతున్నప్పటికీ, గడచిన ఆర్థిక సంవత్సరం కంటే ఎంతో ఎక్కువ ఆస్తిపన్ను వసూలు చేయడం.. అదీ భారీ హెచ్చరికల వంటివి లేకుండానే వసూలు చేయడం ఈ సంవత్సరం ప్రత్యేకత. కొత్త విధానం సక్సెస్ జీహెచ్ఎంసీ గత సంవత్సరం రూ. 779 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది. ఈ ఏడాది కొత్త విధానం అనుసరించి వెయ్యి కోట్లకు పైగా వసూలైంది. ఈసారి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల వారిని భాగస్వాములను చేస్తూ కమిషనర్ సోమేశ్‌కుమార్ కొత్త విధానాన్ని అనుసరించారు. జీహెచ్ఎంసీలోని ఏయే విభాగాల్లోని సిబ్బందికైతే ఇళ్ల చిరునామాలు తెలుసో వారందరి సేవల్ని ఆస్తిపన్ను వసూళ్లకు వినియోగించుకున్నారు. వారిని ఔట్రీచ్ బృందాలుగా పేర్కొంటూ బకాయిలున్న వారి ఇళ్లకు పంపించడం ద్వారా ఎక్కువమంది నుంచి ఆస్తిపన్ను వసూలు చేయగలిగారు. ఔట్రీచ్ బృందంలోని సభ్యులు.. బకాయిదారుల ఇళ్లకు వెళ్లి ఈ నెలాఖరు లోగా చెల్లిస్తే పెనాల్టీ ఉండదని చెప్పి చెల్లింపులకు వారిని ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. దీంతోపాటు ఆస్తిపన్ను జాబితాలోని వారందరి ఫోన్‌నెంబర్లు సేకరించారు. జీహెచ్ఎంసీలోని కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల దాకా లక్షలమంది పన్ను బకాయిదారులకు ప్రత్యేకంగా ఫోన్లు చేశారు. కాల్‌సెంటర్ నుంచీ ఫోన్లు చేయించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు క్షేత్రస్థాయిలోనూ బాగా తిరిగారు. ఇలా వీలైనన్ని మార్గాల ద్వారా ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. గత నెల రోజులుగా ఏరోజుకారోజు పరిస్థితిని సమీక్షించుకుంటూ లక్ష్యం చేరేందుకు కృషి చేశారు. పెద్దగా బకాయిలు లేకుండా కేవలం ఒక వాయిదా మాత్రమే చెల్లించాల్సిన వారిపైనా దృష్టి సారించారు. అదే తరుణంలో భారీ బకాయిలున్న వారిపైనా శ్రద్ధ చూపారు. చాలావరకు సంప్రదింపుల ద్వారా యజమానులు ఆస్తిపన్ను చెల్లించేలా చూశారు. అవసరాన్ని బట్టి జప్తు వంటి చర్యలకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ యజమానులే కాక, ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలపైనా కొరడా ఝళిపించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే కాక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటి వాటి నుంచీ ఆస్తిపన్ను వసూలు చేశారు. సిబ్బందికి ప్రోత్సాహకాలు మరోవైపు, ఆస్తిపన్ను విభాగంలోని సిబ్బందికి ప్రోత్సాహకాలు అమలు చేశారు. గత సంవత్సరం కంటే ఎక్కువ ఆస్తిపన్ను వసూలు చేసిన వారికి నెల జీతం ఇంక్రిమెంట్‌గా అమలు చేశారు. అండర్ అసెస్డ్, అన్ అసెస్డ్ భవనాలను గుర్తించడం వంటి చర్యలు చేపట్టారు. బకాయిదారుల పేర్లు ఫ్లెక్సీల కెక్కించడం, జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పెట్టడం వంటి విధానాలకు పోలేదు. ప్రజల పరువు తీయడం తమ లక్ష్యం కాదన్న కమిషనర్ సోమేశ్‌కుమార్.. వారి పరువుకు భంగం వాటిల్లకుండానే పన్ను వసూలు చేయడంపై శ్రద్ధ కనబరిచారు. సిబ్బంది సేవల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. బాగా పనిచేసేవారికి తగిన గుర్తింపు ఇచ్చారు. ఇలా.. వీలైనన్ని మార్గాల ద్వారా ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి పెట్టడంతో భారీ మొత్తంలో ఆస్తిపన్ను జీహెచ్ఎంసీ ఖజానాకు చేరింది. అందరి సహకారంతోనే.. అటు ప్రజలు, ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది.. వివిధ ప్రభుత్వ విభాగాల సహకారం వల్లే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను వసూలైంది. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయనేందుకు ఇది నిదర్శనం. ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు తెలంగాణ.. వరుస సెలవులు.. ఇన్ని క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ అందరూ సహకరించినందునే ఈ ఫలితం సాధించగలిగాం. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సవాల్‌గా తీసుకొని పనిచేశారు. ప్రజలూ బాగా సహకరించారు. అందరికీ అభినందనలు. కృతజ్ఞతలు. ప్రజల నుంచి వసూలైన ఈ సొమ్మును వారికి మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే ఖర్చు చేస్తాం. - సోమేశ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ -
రూ.5కే భోజనం షురూ
నాంపల్లిలో ప్రారంభించిన మేయర్ ఐదు రూపాయలు ఖర్చుపెడితే గట్టిగా సింగిల్ టీ కూడా రాని ఈ రోజుల్లో.. ఐదు రూపాయలకే నిరుపేదలకు కడుపు నిండా వేడివేడి భోజనాన్ని అందించే పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లాంఛనంగా ప్రారంభించింది. హరేకృష్ణ ఫౌండేషన్ వారి అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రతి డివిజన్ లోను ఈ పథకాన్ని చేపడుతున్నారు. నాంపల్లి సరాయి వద్ద మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ ఆదివారం ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ‘ఈ పథకానికి 2014-15 సంవత్సరానికి రూ.11 కోట్ల నిధులు కేటాయించాం. అవసరమైతే దీన్ని రూ.50 కోట్లకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు రూపాయలకే పేదలకు మధ్యాహ్న భోజనాన్ని అందించే ఈ పథకాన్ని ఎంఐఎం వ్యవస్థాపక దినోత్సవం నాడు ప్రారంభించడం సంతోషంగా ఉంది’ అన్నారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు రూ.5 టికెట్ కొనుగోలు చేసి సహపంక్తి భోజనం చేశారు. త్వరలో 50 కేంద్రాలు... కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ... ‘ఐటీ హబ్‌గా పేరొందిన మహానగరంలో పెద్ద సంఖ్యలోనే పేదలు, అడ్డా కూలీలున్నారు. వారందరికీ తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలన్న తలంపుతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం. పుట్టినరోజు వంటి వేడుకలు, లేదా తమకు కావల్సిన వారి జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాల సందర్భంగా అన్నదానాలు చేయాలనుకునేవారిని కూడా ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ఆలోచిస్తున్నాం. ఆయా రోజున భోజన కేంద్రాల్లో ఖర్చు భరిస్తే... వారి పేర్లతో పాటు ఏ సందర్భంగా భోజనం అందిస్తున్నారో నోటీసు బోర్డుపై రాసి ఉంచుతాం’ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ ప్లోర్‌లీడర్లు దిడ్డి రాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షులు సత్యగౌరు చంద్రదాస్ పాల్గొన్నారు. చాలా బాగుంది... పేదవాళ్ల కోసం బల్దియా ప్రారంభించిన ఈ పథ కం ఎంతో బాగుంది. బయట రూ.40 పెట్టినా ఇంత మంచి భోజనం లభించదు. - రహీముద్దీన్, ఖైరతాబాద్ -
ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీ రద్దు
ఈ నెల 31లోగా చెల్లిస్తే వర్తింపు 21 వరకు వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీలు(వడ్డీలు) రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఈ నెల 31 లోగా ఆస్తిపన్ను చెల్లించేవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రతియేటా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నప్పటికీ.. మార్చి నెలాఖరులో దీనికి సంబంధించిన జీవోను జారీ చేసేది. దాని బదులు త్వరితంగా జీవో జారీ చేస్తే వసూళ్లలో గణనీయ ప్రగతి ఉంటుందని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ అంశంపై చొరవ తీసుకోవాల్సిందిగా కమిషనర్‌ను కోరింది. త్వరలోనే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత జీవోను త్వరితంగా జారీ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో తాజా జీవో జారీ అయింది. దీని ప్రకారం.. పాత బకాయిల్ని.. ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఏక మొత్తంలో కానీ.. వాయిదాల్లో కానీ మార్చి 31 లోగా చెల్లిస్తే వడ్డీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక వసూళ్లపై దృష్టి.. పెనాల్టీలను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇక ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. మార్చి 21 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకనుగుణంగా తగిన నియమ నిబంధనలు పొందుపర్చారు. వసూళ్ల కోసం సర్కిల్స్థాయిల్లో ప్రత్యేక బృందాలను నియమించారు. బృందాలకు అవసరమైన వాహనాలు సమకూరుస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ వాహనాలతోపాటు జీహెచ్ఎంసీ టిప్పర్లను వినియోగించుకోవచ్చునన్నారు. సర్కిల్ స్థాయిలో టాప్ 200 బకాయిలున్న వారిపై ప్రత్యేక శ్రద్ధతో వసూళ్లు చేపడతారు. వారిలో రోజుకు పదిమంది నుంచి ఆస్తిపన్ను వసూళ్లు చేయాలి. ఎవరి వద్ద నుంచైనా ఆస్తిపన్ను వసూలు చేయని పక్షంలో ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాలి. వివరణ సంతృప్తికరంగా లేనట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఆస్తిపన్ను వసూళ్ల పర్యవేక్షణ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ స్థాయిల్లో సీనియర్ అధికారులను నియమించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ. 1250 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 605 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. నెలరోజులే గడువున్నందున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మేయర్ పదవి బీసీకిస్తూ ప్రభుత్వం జీవో తేవడాన్ని ప్రస్తావించారు. -
‘షి ట్యాక్సీ’ ప్రారంభం
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘షి ట్యాక్సీ’ ప్రారంభమైంది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ ట్యాక్సీని నగర మేయర్ మాజిద్ హుస్సేన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, డిప్యూటీ స్పీకర్ రాజ్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్, గ్రీన్ క్యాబ్స్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ బ్యాంకుల ద్వారా ట్యాక్సీకి రుణాలు మంజూరు చేయిస్తుందన్నారు. 15 శాతం వ్యయాన్ని భరించగలిగే అభ్యర్థులకు 85 శాతం రుణం బ్యాంకుల ద్వారా మంజూరు చేయించనున్నట్లు వివరించారు. త్వరలో ఈ పథకం ద్వారా 200 మందికి ట్యాక్సీలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయించనున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ క మిషనర్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని రాణించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. షి ట్యాక్సీలతో మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా 200 కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. గురువారం ప్రయోగాత్మకంగా 5 ట్యాక్సీలను ప్రారంభించామన్నారు. కనీస విద్యార్హత 8వ తరగతి ఉండి, బ్యాంకు రుణంలో 15శాతం భరించగలిగిన ఆసక్తి గల అభ్యర్థులు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫుడ్ ప్రాసెస్ శాఖ జాయింట్ సెక్రెటరీ అనూరాధ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ‘ఫోన్ ఇన్’కు అనూహ్య స్పందన
పచ్చ‘ధనం’ కోసం నినదించిన సిటీ‘జనం’ విలువైన సలహాలు, సూచనలు ఆద్యంతం అర్థవంతంగా సాగిన కార్యక్రమం కార్యాచరణకు కమిషనర్ సంసిద్ధత రోడ్డు తవ్వి వదిలేశారు... మా ప్రాంతంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. చెత్త ఎత్తడం లేదు. రోడ్డు తవ్వి వదిలేశారు. మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్లకు ఫోన్ చేసినా స్పందన లేదు. - మహేశ్, తుకారాం గేట్, అడ్డగుట్ట కమిషనర్ సోమేశ్‌కుమార్ : రేపట్నుంచి 24 గంటల్లోగా చెత్త తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. తిరిగి మళ్లీ సమస్యలు తలెత్తితే 21111111కి ఫోన్ చేయండి. ఇలాంటి ఫిర్యాదుల కోసం కొత్త నెంబర్ ప్రారంభిస్తున్నాం. ఖాళీ స్థలాలకు ప్రహరీలు నిర్మించాలి బృందావన్‌కాలనీలో ఉంటాం. భూగర్భ డ్రైనేజీ కోసం దరఖాస్తు చేసుకున్నాం. కాలనీలో ఖాళీగా ఉన్న ప్లాట్లలో పరిసరాల వారు చెత్తాచెదారం వేస్తూ, బహిరంగ యూరినల్స్గా మార్చేశారు. పారిశుధ్య సిబ్బంది ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. - ఎం.ఎస్.శర్మ, ఏఎస్రావు నగర్ కమిషనర్: నగరమంతా భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సదుపాయం కోసం బడ్జెట్లో రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్డు కటింగ్లతో ఇబ్బంది చైతన్యపురి ప్రభాత్‌నగర్ పెట్రోలుబంక్ దగ్గర తరచూ రోడ్డు కటింగ్‌లు చేస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేరు. - శంకర్, కొత్తపేట కమిషనర్: ధన్యవాదాలు. రెండంశాలు దృష్టికి తెచ్చారు. రెండు మూడు రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తాం. మట్టికుప్పలతో ట్రాఫిక్ జాం మల్లేపల్లి, ఆగాపురా ప్రాంతాల్లో మట్టికుప్పలతో ట్రాఫిక్జాంలవుతున్నాయి. చర్యలు తీసుకోండి. - ఎం.ప్రసాద్, ఆగాపురా కమిషనర్: మూడు నాలుగు రోజుల్లో పరిష్కరిస్తాం. పేరుకుపోతున్న చెత్త కూకట్పల్లి దాయార్‌గూడలో 400 గుడిసెలున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నారు. దుర్వాసన భరించలేకున్నాం. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. - ఎ.రాము, కూకట్పల్లి కమిషనర్: రెండు మూడు రోజుల్లో సమస్య క్లియర్ చేస్తాం. అదనపు చెత్త డబ్బాలు కావాలి రాజీవ్ గృహకల్ప కాలనీలో ఇందిరమ్మ స్కూల్ వెనుక ఒకే చెత్త డబ్బా ఉండటంతో చాలడం లేదు. వారానికి రెండుసార్లే డబ్బాల నుంచి చెత్త తొలగిస్తున్నారు. రోజూ తొలగించేలా చర్యలు తీసుకోవాలి. మీరు పేదల కోసం ప్రారంభించనున్న సబ్సిడీ భోజనంతో ఎందరికో మేలు జరుగుతుంది. ధన్యవాదాలు సార్. - టి.శివరామయయ,చందానగర్ కమిషనర్: మీ సమస్యలు కొన్ని రోజుల్లోనే పరిష్కరిస్తాం. డ్రైనేజీ సమస్య తీవ్రం రెండున్నర నెలలుగా రోడ్డు మీద పారుతున్న డ్రైనేజీతో తీవ్ర సమస్యగా ఉంది. రోడ్డు మధ్య టూ వీలర్ కూడా వెళ్లలేదు. ఫొటో మెయిల్ చేయమన్నా చేస్తాను. - మదు, చంపాపేట కమిషనర్: మా అధికారులు వచ్చి సమస్య పరిశీలిస్తారు. రోడ్డు పక్కనే చెత్త డంప్ బైపాస్ రోడ్డు పక్క చెత్త మొత్తం డంప్ చేశారు. అధికారులు కొంతమేర పని చేశారు. కానీ సమస్య తీరలేదు. - రంగారెడ్డి, వివేక్‌నగర్, రామంతాపూర్ కమిషనర్: రెండు రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తాం. ఫిర్యాదు చేసినా పరిష్కారమేదీ? ప్రియదర్శిని అపార్ట్మెంట్ పరిసరాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ఫిర్యాదులిచ్చినా స్పందనలేదు. - రాంనారాయణరెఇ్డ,ఉప్పర్‌పల్లి, రాజేంద్రనగర్ కమిషనర్: వీలైనంత త్వరితంగా పరిష్కరిస్తాం. డ్రైనేజీ సమస్య తీవ్రం దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటైన మా కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. - బంగార్రాజు, చంపాపేట కమిషనర్: డిప్యూటీ కమిషనర్, ఇంజినీర్లు వచ్చి పరిశీలి స్తారు. లేదంటే 21111111 నెంబరుకుఫోన్ చేయండి. మామూళ్లే తప్ప పనులు నిల్ పారిశుధ్య కార్మికులు దుకాణాల వారి నుంచి మామూళ్లు వసూలు చేయడం తప్ప పనులు చేయడం లేదు. పేరుకు బంగారం బజార్ అయినా చెత్తకుప్పలతో నిండిపోతోంది. - మాణిక్యప్రభు, జనరల్‌బజార్, సికింద్రాబాద్ కమిషనర్: ఏ డోర్ నుంచి ఏ డోర్‌నెంబరు వరకు పారిశుధ్య పనులకు ఎవరు బాధ్యులో తెలియజేసేలా బోర్డులు రాస్తాం. వారి పనితీరు కోసం బీట్బుక్ పెడతాం. దుకాణదారులు సర్టిఫై చేస్తేనే పనిచేసినట్లు గుర్తిస్తాం. చెత్త ఎవరు తొలగిస్తారు? రెండు కాంప్లెక్స్‌ల మధ్య చెత్త వేస్తున్నారు. దానిని ఎవరూ తొలగించడం లే దు. జీహెచ్ఎంసీ వారు మా పని కాదంటున్నారు. దోమలు తీవ్రమై జ్వరాలు వస్తున్నాయి. - భాగ్యలక్ష్మి, జ్యోతినగర్, బోరబండ కమిషనర్: చర్యలు తీసుకుంటాం. సమస్య పరిష్కరిస్తాం సిబ్బంది సరిగా పనిచేయట్లేదు పారిశుధ్యసిబ్బందిలో ఏడుగురికి ఇద్దరు ముగ్గురే పనిచేస్తున్నారు. వీధిదీపాలకు అడ్డొచ్చే చెట్ల కొమ్మలు నరికేయాలి. - నజీర్ అహ్మద్, జనరల్సెక్రటరీ, సుందర్‌నగర్‌కాలనీ కమిషనర్: అలాగే చేస్తాం. మీ సమస్య పరిష్కరిస్తాం. చెరువులోనే వ్యర్థాలు నాగోలు - బండ్లగూడ దారిలో కుడివైపు చెరువులో చెత్త వేస్తున్నారు. పశువుల కళేబరాలు ఇతరత్రా వ్యర్థాలు వేస్తున్నారు. దాంతో తీవ్ర దుర్వాసనతో అల్లాడుతున్నాం. - లక్ష్మి, వెంకటరెడ్డి నగర్, నాగోల్. కమిషనర్: మీ సమస్య అర్థమైంది. చర్యలు తీసుకుంటాం. కబ్జాను అడ్డుకోండి పీపుల్స్ పార్కు స్థలంలో వాణిజ్య భవన నిర్మాణానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. స్థలం కబ్జాను అడ్డుకోవాలి. - రాఘవేంద్రరావు, చిక్కడపల్లి కమిషనర్: అది ప్రభుత్వ ఓపెన్‌ల్యాండ్ అయితే ఎలాంటి నిర్మాణాలకు అనుమతించం. చెత్తకుండీ పెట్టరూ అన్నానగర్‌లో ఒక్క చెత్తకుండీ కూడా లేదు. రోడ్లపైనే వేస్తున్న చెత్తతో తీవ్ర దుర్గంధంతో పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. దోమల బెడద ఉంది. - మహేశ్వరి, బోరబండ కమిషనర్: అధికారులను పంపి వెంటనే క్లీన్ చేయిస్తాం. భవిష్యత్‌లో తిరిగి ఇలాంటి సమస్య రాకుండా చూస్తాం. ఎక్కడ చెత్త అక్కడే మట్టికుప్పలు. చెత్త ఎక్కడిదక్కడే ఉంటున్నాయి. - రాములమ్మ, రైల్ నిలయం, సికింద్రాబాద్ కమిషనర్: తప్పకుండా పరిష్కరిస్తాం. పార్కు పనులు పెండింగ్ ఎస్బీహెచ్ ఎదురుగా పార్కు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పరిసరాల్లో చెత్త పేరుకుపోయి తీవ్ర ఇబ్బందిగా ఉంది. వేసవిలో మొక్కలకు నీటి సదుపాయం లేదు. - కృష్ణారెడ్డి, జెట్కాలనీ, సనత్‌నగర్ కమిషనర్: మా అధికారులు తగు చర్యలు తీసుకుంటారు. పేరుకుపోతున్న చెత్త చెత్తపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. - సతీష్‌గౌడ్, కందికల్ గేట్, ఉప్పుగూడ కమిషనర్: ఇకపై 21111111 నెంబరుకు ఫిర్యాదు చేయండి. మీ సమస్య 24 గంటల్లో పరిష్కారమవుతుంది. పొంగుతున్న భూగర్భ డ్రైనేజీ శివారు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ పొంగి పొరలుతోంది గుర్నాథ్, చింతకుంట, ఎల్బీనగర్ కమిషనర్: శివారు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తీర్చే పనులు చేస్తాం. పగిలిన పైప్‌లైన్ నెలరోజులుగా డ్రైనేజీ లీకేజీ. పైప్‌లైన్ పగిలిందంటున్నారు. - రంగనాథ్, చందానగర్ కమిషనర్: మీ సమస్య పరిశీలించి పరిష్కరిస్తాం. కార్మికులకు రక్షణ ఏర్పాట్లు చేయండి చెత్తబండ్ల ద్వారా చెత్త కళ్లలో పడుతుంది. కార్మికుల రక్షణ కోసం మేం రూపొందించిన ప్రొటెక్ట్కేర్ వల్ల ప్రయోజనం ఉంటుందేమో పరిశీలించండి. - శివశంకర్, లంగర్‌హౌస్ కమిషనర్: మీరు చేసినవి చూపించండి. లేదా ఫొటోలు పంపండి. పరిశీలిస్తాం. చెత్తకుండీలకు మరమ్మతులు చేయండి చెత్తకుండీలు పాడై పోవడం వల్ల లారీల్లో తరలిస్తుండగా, వాటి నుంచి చెత్త రోడ్లపై పడుతోంది. - ఎం. రవినాయక్, షాపూర్‌నగర్ ,జీడిమెట్ల కమిషనర్: ప్రైవేట్ ఏజెన్సీ ఇంటింటి నుంచి చెత్తను తరలించడంతోపాటు కాంపాక్టర్ల ద్వారా చెత్తను శాస్త్రీయంగా తరలిస్తారు. త్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుంది. పార్కులు ఏర్పాటు చేయండి మా దగ్గర రెండు ఖాళీ ప్రదేశాలున్నాయి. మొక్కలు నాటితే బాగుంటుంది. ఇక్కడ పార్కులు ఏర్పాటుచేస్తే కాలనీసంఘాల వాళ్లం శ్రద్ధ తీసుకుంటాం. ఇళ్ల నిర్మాణం చేసేవారు తప్పనిసరిగా కొన్ని మొక్కలైనా నాటాలనే నిబంధన పెడితే బాగుంటుంది సార్. - నాగార్జున, స్వరూప్‌నగర్, ఉప్పల్ కమిషనర్: జీహెచ్ఎంసీలో మొత్తం 385 ఖాళీ ప్రదేశాలు గుర్తించాం. మీరు చెప్పిన ఖాళీ స్థలాల్ని గుర్తించని పక్షంలో వాటి వివరాలు తెలపండి. మా జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రమోహన్‌రెడ్డి నా పక్కనే ఉన్నారు. వారి సిబ్బందిని పంపి ప్రహరీ ఉన్న స్థలంలో చెట్లు పెంచి పార్కును అభివృద్ధి చేస్తారు. ఈ పార్కును ఈ సంవత్సరం చేస్తాం. అలాగే మీవద్ద రోడ్డు పక్కన చెట్లు పెంచే అవకాశాలుంటే చెప్పండి. పెంచుతాం. మంచి సూచన చేశారు. థాంక్యూ! పరిశ్రమల బారి నుంచి రక్షించండి గగన్‌పహడ్‌లో 4 పరిశ్రమల నుంచి వెలువడే వరిపొట్టు బూడిద కళ్లలో పడి పలువురి చూపు పోతోంది. పరిసరాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. స్థానికుల ఫిర్యాదులతో కొద్దికాలం క్రితం తొలగించిన ఎముకల ఫ్యాక్టరీని ప్రస్తుతం మళ్లీ తెరిచారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని రహదారిపై నాలా పనులు పూర్తికాక అస్తవ్యస్తంగా ఉంది. మంత్రి ఆదేశించినా చర్యల్లేవు. - ధనంజయ, రాజేంద్రనగర్ కమిషనర్: సిటీలో పారిశుధ్య పనులు నిర్ణీత దూరం వరకు ఎవరు చేయాలో వివరాలు బోర్డులపై లేదా గోడలపై రాస్తాం. అక్కడ పనులు జరగకపోతే ఏ అధికారికి ఫోన్ చేయాలో నెంబరూ రాస్తాం. కార్మికులు తాము పనిచేసినట్లు రాసేం దుకు కాలనీసంఘాల వద్ద బీట్ పుస్తకాలు ఉంచుతాం. ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి గతంలో ఇళ్లు, కాలనీల చెత్తను నిర్ణీత ప్రదేశంలో వేసేవారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే చెత్త వేస్తున్నారు. దీనిపై ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. చెత్త డబ్బాలోనే చెత్త వేసేలా అవగాహన కల్పించాలి. జీహెచ్ఎంసీ లారీల్లో చెత్తను తెచ్చి శ్మశానవాటికలో సమాధులపైనే వేస్తుండటంతో మృతుల సంబంధీకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నాం. - పాలడుగు అనిల్‌కుమార్, హిందూశ్మశానవాటిక అధ్యక్షుడు. కమిషనర్: నగరంలోని అన్ని శ్మశానవాటికల్లో దశలవారీగా సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. అనేకచోట్ల ఆక్రమణలు జరుగుతున్నాయి. వీటన్నిటిపై తగు శ్రద్ధ తీసుకుంటాం. -
గ్రేటర్ కొత్త నంబర్ 040 -21 11 11 11
సమస్యల పరిష్కారానికి సరికొత్త ఏర్పాటు డయల్ చేయడంతోనే రికార్డు కానున్న ఫిర్యాదు పరిష్కారమైన సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా వెల్లడి సాక్షి ‘ఫోన్ ఇన్’లో కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రకటన సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీకి సంబంధించి ప్రజలెదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు మరో కొత్త నెంబరును జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. 24 గంటలూ పని చేసే ఈ నెంబరు (040-21111111) ద్వారా ప్రజలు తాము నిత్యం ఎదుర్కొం టున్న పారిశుధ్యం, చెత్త తరలింపు, టౌన్‌ప్లానింగ్, దోమలు.. ఇతరత్రా ఏ సమస్యపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ అందుబాటులోకి తెచ్చిన ఈ నెంబరు ద్వారా వెళ్లే ఫిర్యాదులు ఆన్లైన్లో రికార్డు కావడమే కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది. పరిష్కారమయ్యాక ఆ సమాచారమూ తెలుస్తుంది. ఇదే పనివిధానంతో ఇప్పటికే ఒక నెంబరు 155304 అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని ప్రజలు గుర్తుంచుకోవడం కష్టంగా ఉన్నందున తేలిగ్గా గుర్తుండిపోయే కొత్త నెంబరు 21 11 11 11ను అందుబాటులోకి తెచ్చినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలి పారు. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తున్న ఁసాక్షిరూ. ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కమిషనర్‌తో ఁఫోన్ ఇన్రూ. కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ కమిషనర్ ఈ విషయం వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జీహెచ్ఎంసీ తగు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కొత్తనెంబరు పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. కొత్త నెంబరుతోపాటు పాత నెంబరు కూడా పనిచేస్తుందని ప్రజలు ఈ సదుపాయాల్ని వినియోగించుకోవాల్సిందిగా కమిషనర్ సూచించారు. అనూహ్య స్పందన పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాలపై ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన ఫోన్ ఇన్‌కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఫిర్యాదులతోపాటు ప్రజలు సమస్యల పరిష్కారానికి త మవంతు సూచనలు కూడా అందజేశారు. ఇంటి నిర్మాణానికి అనుమతించేటప్పుడే కొన్ని మొక్కలైనా పెంచేలా నిబంధనను అమలు చేయాలని, చెత్తడబ్బాలు తడి, పొడివి వేర్వేరుగా ఏర్పాటుచేస్తే మేలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. పాడైపోయిన చెత్తడబ్బాల నుంచి వ్యర్థాలు రోడ్లపై పడుతుండటాన్నీ దృష్టికి తెచ్చారు. చెరువుల్ని మృతకళేబరాలతో నింపుతున్న వైనాన్నీ వెలుగులోకి తెచ్చారు. పార్కు స్థలాలు కబ్జా కాకుండా తగుచర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఎంతో ఉత్సాహంతో ఫిర్యాదుల్ని కమిషనర్ దృష్టికి తెచ్చేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఏయే ప్రాంతంలో పారిశుధ్య బాధ్యతలు ఎవరివో ప్రజలందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా జవాబుదారీ తనం పెరుగుతుందన్నారు. అంతేకాదు.. పని జరిగినట్లు స్థానికులు ధ్రువీకరిస్తేనే వారికి వేతనాలందజేస్తామని చెప్పారు. రాబోయే రెండు మూడేళ్లలో నగరమంతా భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. తొలి దశలో రూ. 300 కోట్లతో శివారు ప్రాంతాల్లో ఈ పనుల చేపడతామన్నారు. శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. దశలవారీగా నగరమంతా ఈ సదుపాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఫోన్ ఇన్ సందర్భంగా కమిషనర్‌తోపాటు ఁఆరోగ్యం-పారిశుధ్యంరూ. అడిషనల్ కమిషనర్ ఎన్.రవికిరణ్, జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఫిర్యాదుల్ని నోట్ చేసుకున్నారు. పరిష్కార చర్యల్లోకి దిగారు. -
ఆస్తిపన్ను అంచనా ఇక ఆన్లైన్
త్వరలో అందుబాటులోకి.. వచ్చే వారం ప్రయోగాత్మక పరిశీలన నేరుగా దరఖాస్తుల స్వీకరణకూ ఏర్పాట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో : కొత్తగా ఇళ్లు కట్టుకున్నవారు తమ ఇంటిని జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను జాబితాలో చేర్చడానికి పడుతున్న పాట్లు ఎన్నో. ఎంత ఆస్తిపన్ను చెల్లించాలో అసెస్ చేయాల్సిందిగా నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. ఇలాంటి వారు వేలసంఖ్యలో ఉన్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్.. సెల్ఫ్ అసెస్మెంట్ విధానానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. అదెలాగంటే.. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్లి తాముంటున్న ప్రాంతాన్ని (చిరునామాను) నమోదు చేస్తే.. ఆ ప్రాంతంలో ఆస్తిపన్ను శ్లాబ్ రేట్ ఎంత ఉందో.. తదితర వివరాలు తెలుస్తాయి. వాటి ఆధారంగా తమ ఇంటి ప్లింత్ఏరియాను బట్టి ఎంత ఆస్తిపన్ను చెల్లించాలో తెలుసుకోవచ్చు. అందుకనుగుణంగా వెబ్సైట్లో కనిపించే వివరాలను భర్తీ చేయాలి. వాటి ఆధారంగా క్షేత్రస్థాయి తనిఖీలకు వచ్చే అధికారులు లోటుపాట్లేమైనా ఉంటే చూసి తగు సవరణలతో ఆస్తిపన్ను ఖరారు చేస్తారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు సైతం సెల్ఫ్ అసెస్మెంట్ను అమలు చేశారు. అయితే అప్పట్లో ఆన్లైన్ అందుబాటులో లేదు. జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో శనివారం నిర్వహించిన ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం (పీటీపీ) కార్యక్రమం అనంతరం .. కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ) ఎస్. హరికృష్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పీటీపీకి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. వారి నుంచి వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా త్వరలోనే సెల్ఫ్ అసెస్మెంట్ను ప్రారంభిస్తామన్నారు. వచ్చేవారం ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి.. అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ చేయలేని వారి నుంచి స్వయంగా దరఖాస్తులు స్వీకరించేందుకు సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు. వారికి సహకరించేందుకు అవసరమైన సిబ్బందిని నియమిస్తామన్నారు. పీటీపీలో అసెస్మెంట్ల కోసం 60 విజ్ఞప్తులు అందగా.. వాటిలో మూడింటిని అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మొత్తం 515 ఫిర్యాదులు రాగా.. వాటిల్లో 283 రివిజన్ పిటిషన్లు (ఎక్కువ పన్ను తగ్గించాల్సిందిగా) ఉన్నాయన్నారు. అందులో 69 ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించామన్నారు. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌ల నుంచి ఎక్కువ ఫిర్యాదులొచ్చాయన్నారు. సెంట్రల్‌జోన్‌లోని రెండు సర్కిళ్లలో పీటీపీ తీరును తాను పరిశీలించానన్నారు. ఎక్కువ మొత్తాల్లో బకాయిలున్న పార్క్‌హయత్ హోటల్, హైదరాబాద్ ఆస్బెస్టాస్ వంటి సంస్థల నుంచి కూడా రివిజన్ పిటిషన్లు అందాయన్నారు. ఇకపై కొత్త భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చిన వెంటనే సదరు భవనం ఆస్తిపన్ను జాబితాలోకి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. తద్వారా ఇకపై అసెస్మెంట్ సమస్యలు ఉండబోవన్నారు. ఆస్తిపన్ను అసెస్మెంట్లలో ఎక్కువ మొత్తాలు విధించే అధికారులపైనా.. ప్రజల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా జాప్యం చేసేవారిపైనా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మార్చి 2న మళ్లీ పీటీపీ శనివారం సెలవు లేనందున చాలామంది పీటీపీని వినియోగించుకోలేకపోయారనే విజ్ఞప్తుల మేరకు సెలవురోజైన ఆదివారం (మార్చి2న) మరోమారు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో పీటీపీ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. పల్స్‌పోలియోను వినియోగించుకోండి ఆదివారం జరగనున్న పల్స్‌పోలియోను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు కమిషనర్ సూచించారు. పల్స్ పోలియోకు 85 మొబైల్ వాహనాలను కూడా వినియోగిస్తున్నామన్నారు. వసూళ్లకు ప్రత్యేక బృందాలు ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనున్నందున ఆస్తిపన్ను వ సూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్(ఏఎంసీ)ల నేతృత్వంలో ఆస్తిపన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. అనేక వాణిజ్య భవనాలు.. నివాస భవనాల పన్నునే చె లిస్తుండటాన్ని గుర్తించామని.. వాటన్నింటినీ వాణిజ్య పరిధిలోకి తెస్తామన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆస్తిపన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగా సర్కిళ్లలోని టాప్-200 బకాయిదారులను గుర్తించి, వారి నుంచి వసూళ్లకు శ్రద్ధ చూపుతున్నామన్నారు. కోర్టు వివాదాల పరిష్కారంపైనా దృష్టి సారించినట్లు చెప్పారు. రివిజన్ పిటిషన్ల పరిష్కారం ద్వారా కూడా వసూళ్లు పెరుగుతాయన్నారు. ఆస్తిపన్ను ఫిర్యాదుల పరిష్కారం తరహాలో త్వరలోనే పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ఫైళ్ల పరిష్కారానికీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. -
టౌన్‘ప్లానింగ్’వికేంద్రీకరణ
భవన నిర్మాణ అనుమతులికసులభం జోనల్ స్థాయిలోనే పరిష్కారం జీ ప్లస్ ఐదంతస్తుల వరకు అనుమతులు సాక్షి, సిటీబ్యూరో : భవన నిర్మాణ అనుమతుల కోసం.. నిర్మాణం తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం సిటీజనులు పడే ఇబ్బందులు తొలగనున్నాయి. సమస్యలన్నీ జోనల్ స్థాయిలోనే పరిష్కారమయ్యే విధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చర్యలు తీసుకున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో వికేంద్రీకరణ చేపట్టారు. దీనిలో భాగంగానే ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ చీఫ్ సిటీప్లానర్లను (ఏసీసీపీలను) జోనల్ స్థాయి టౌన్‌ప్లానింగ్ చీఫ్ ప్లానర్లు(సీపీలు)గా నియమించారు. అంటే.. ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీప్లానర్ (సీసీపీ) పర్యవేక్షించే బాధ్యతల్ని జోనల్ స్థాయి వరకు సీపీలు పర్యవేక్షిస్తారు. జోనల్ స్థాయిలో అనుమతులిచ్చే అధికారాన్ని సైతం విస్తృతం చేశారు. ఇప్పటివరకు జీ ప్లస్ నాలుగంతస్తుల వరకు మాత్రమే జోనల్ స్థాయిలో అనుమతిలిచ్చేవారు. ఇప్పుడు దానిని జీ ప్లస్ ఐదంతస్తుల వరకు పెంచారు. సంబంధిత జోనల్ సీపీ స్థాయిలోనే వాటికి అనుమతులు మంజూరు చేస్తారు. బహుళ అంతస్తుల భవనాల అనుమతులు, రోడ్డు వెడల్పులో స్థలం కోల్పోతే పొందే నష్టపరిహారాలు వంటి ప్రత్యేక అనుమతులకు మాత్రమే ప్రజలు ప్రధాన కార్యాలయం దాకా రావాల్సి ఉంటుంది. మిగతావన్నీ జోనల్ స్థాయిలోనే పరిష్కారమవుతాయి. జోనల్లోనూ బిల్డింగ్ కమిటీ మీట్ ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంలో మాత్రమే నిర్వహిస్తున్న బిల్డింగ్ కమిటీ సమావేశాలు ఇకపై జోనల్ స్థాయిలోనూ నిర్వహించాల్సి ఉంది. బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చేందుకు ఈ బిల్డింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ కమిటీలో టౌన్‌ప్లానింగ్‌లోని వివిధ స్థాయిల అధికారులు, సంబంధిత విభాగం అడిషనల్ కమిషనర్, ఫైర్‌సేఫ్టీ అధికారులతోపాటు కమిషనర్ సైతం ఉంటారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల మేరకు జోనల్ స్థాయిలోని అనుమతులకు బిల్డింగ్ కమిటీ సమావేశం కావాల్సిన అవసరం లేదు. ఇకపై జోనల్ స్థాయిలోనూ.. బిల్డింగ్ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. కాగా, ప్రధాన కార్యాలయంలో కమిషనర్ స్థానే జోనల్‌స్థాయి బిల్డింగ్ కమిటీలో జోనల్ కమిషనర్ పాల్గొంటారు. సీపీలను జోన్లలో నియమించడం ద్వారా క్షేత్రస్థాయి తనిఖీలకూ వీలుంటుందని భావిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియకు ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించినందున.. ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు గ్రేటర్‌లోని అన్ని దరఖాస్తులను ఎప్పుడు ఏదశలో ఉందో పరిశీలించే వీలుంది. తద్వారా టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఆరోపణలకు ఆస్కారం లేకుండా, పారదర్శకంగా ఉంటుందన్నది కమిషనర్ యోచన. స్థాయి తగ్గిందా..? ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించిన ఏసీసీపీలను జోనల్ కార్యాలయాలకు పరిమితం చేయడంతో తమ స్థాయిని తగ్గించారని ఏసీసీపీలు కలత చెందుతున్నారు. హోదా రీత్యా అడిషనల్ డెరైక్టర్లయిన తాము.. హోదా రీత్యా తమకంటే తక్కువైన జోనల్ కమిషనర్లకు రిపోర్టు చేయాల్సి రావడం.. వారి అజమాయిషీలో పనిచేయాల్సి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కంటే తక్కువ స్థాయిలోని (హోదా రీత్యా డిప్యూ టీ డైరక్టర్లయిన వారిని) సిటీప్లానర్లను ప్రధాన కార్యాలయానికి మార్చి.. తమను జోనల్ కార్యాలయాలకు బదిలీ చేయడం వారికి మింగుడు పడటం లేదు. కాగా.. ప్రధాన కార్యాలయంలో నియమించినంత మాత్రాన.. అడిషనల్ డైరక్టర్ల స్థాయి తగ్గదని, సీసీపీకి సహాయంగా ఉండేందుకే ఇప్పటివరకు జోన్లలో ఉన్న సిటీప్లానర్ల(డిప్యూటీ డెరైక్టర్ స్థాయి) ను ప్రధాన కార్యాలయానికి కమిషనర్ బదిలీ చేశారని మరికొందరు చెబుతున్నారు. అనుమతుల్లో అవకతవకలు జరుగకుండా ఉండేం దుకు.. అందరినీ భాగస్వాములను చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నారని వారు చెబుతున్నారు. -
గ్రేటర్ వివక్ష
ఆస్తిపన్నులో అవకతవకలు పేదోళ్లపైనే ప్రతాపం పెద్దోళ్లపై ప్రేమ జీహెచ్ఎంసీ ఖజానాకు లోటు సాక్షి, సిటీబ్యూరో : ‘జీహెచ్ఎంసీలోని ఏ జోన్‌లోని ఏ సర్కిల్‌లోనైనా ఆస్తిపన్ను అసెస్మెంట్లన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్పగలరా..? ఎక్కడా అవకతవకల్లేకుండా అన్ని భవనాలకు సక్రమంగా ఆస్తిపన్ను విధించామని చెప్పే ధైర్యం ఉందా?’ అంటే.. అవునన్నవారే లేరు. ఇటీవల ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్ష సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అడిగిన ఈ ప్రశ్నకు సంబంధిత అధికారుల నుంచి సమాధానం కరువైంది. అంటే.. లోటుపాట్లు ఉన్నాయని అంతా ఒప్పుకున్నారు. వీరి చర్యల వల్ల ఎక్కువ మొత్తాల్లో జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తప్పించుకుంటున్నారు. సామాన్య ప్రజలపై మాత్రం ప్రతాపం చూపుతున్న సిబ్బంది.. వారి పరువును బజారు కీడుస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో : పేద బాలికలకు విద్యనందిస్తోన్న మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలకు ఆస్తిపన్ను మినహాయింపు అలా ఉంచి వ్యాపార సంస్థగా అధిక పన్ను నిర్ధారించారు. గతంలో రూ. 13 వేలుగా ఉన్న ఆస్తిపన్నును ఏకంగా రూ. 6 లక్షలకు పెంచడంతో.. నిర్వాహకులు కోర్టు నాశ్రయించారు. వివాదం కోర్టులో ఉంది. 80 ఏళ్ల క్రితం నిర్మించిన.. పురాతన భవనంలో బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఈ పాఠశాలపై కనీస కనికరం చూపని జీహెచ్ఎంసీ సిబ్బంది.. అదే పాఠశాలకు కూతవేటు దూరంలోని నారాయణగూడలోని ఓ సినిమాహాల్‌పై మాత్రం ఎంతో ఔదార్యం కనబరిచారు. ఆ థియేటర్‌కు లెక్కించాల్సిన ఆస్తిపన్నును సక్రమంగా లెక్కించకుండా.. తక్కువ ప్లింత్ ఏరియాను చూపి దాని ఆస్తిపన్ను దాదాపు రూ.74 వేలుగా నిర్ధారించారు. ఇటీవల తిరిగి సర్వే చేస్తే.. రూ. 2.32 లక్షలు ఆస్తిపన్ను కట్టాల్సి ఉంటుందని తేల్చారు. అంటే ఇంతకాలం వరకు వాస్తవ మొత్తంలో రెండింతలు తక్కువ చూపారు. జీహెచ్ఎంసీ అధికారులు ఆమ్యామ్యాలకు మరిగి బడా సంపన్నులకు ఆస్తిపన్నులో ‘రాయితీ’లు కల్పిస్తూ.. సాధారణ ప్రజలు, దాతృత్వంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలపై మాత్రం ప్రతాపం చూపుతున్నారు. పేద విద్యార్థులకు విద్యనందించే పాఠశాలలు, అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థల భవనాలపై అదనపు భారం మోపిన సిబ్బంది.. అడుగడుగునా లాభాలతో జేబులు నింపుకొనే వ్యాపారసంస్థలు, బహుళ అంతస్తుల భవనాలపై మాత్రం ఔదార్యం కనబరుస్తున్నారు. అంతేకాదు పేరుమోసిన ప్రజాప్రతినిధులు, తదితరుల విషయంలోనూ ఇలాగే చూసీ చూడనట్లు వదిలేస్తూ.. కొన్ని చోట్ల వారికి తక్కువ ఆస్తిపన్ను మాత్రమే విధిస్తూ.. మరికొన్ని చోట్ల తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయానికి చిల్లు పడుతోంది. అదే సమయంలో అమాయకులపై అదనంగా వడ్డిస్తున్న ఘటనలూ తక్కువేం లేవు. ఖజానాకు చిల్లు తక్కువ ప్లింత్ ఏరియా చూపి బడాబాబులకు అనధికారికంగా రాయితీలిచ్చిన అధికారుల చర్యల వల్ల జీహెచ్ఎంసీకి రావాల్సిన రూ. 48 కోట్ల ఆదాయం రాకుండా పోయింది. 2.13 లక్షల మంది భవన యజమానులకు ఇలా తక్కువ ఫీజు విధించడంతో.. వాస్తవాదాయంలో రూ. 48 కోట్లు త గ్గింది. ఇదే సమయంలో 32 వేల మంది సామాన్యులపై అసలు కంటే అదనంగా వేసిన భారం రూ. 10 కోట్లు. అన్నీ పరిగణనలోకి తీసుకొని.. సవరణలు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం నికరంగా రూ. 38 కోట్లు అదనంగా రావాల్సి ఉంది. కొత్తగా ఆస్తిపన్ను పరిధిలోకి వచ్చిన భవనాల నుంచి మరో రూ. 43 కోట్లు అదనంగా రానున్నాయి. మొత్తంగా సర్వే కారణంగా రూ.81 కోట్లు జీహెచ్ఎంసీకి అదనంగా చేరనున్నాయి. 2.88 లక్షల భవనాలు సర్వే చేస్తేనే ఇంత వ్యత్యాసం కనిపించింది. జీహెచ్ంఎసీలోని 13 లక్షల పైచిలుకు భవనాలన్నింటి సర్వే పూర్తయ్యేటప్పటికి ఇంకెన్ని విశేషాలు వెలుగు చూస్తాయో! -
ఈసారైనా..
పూడికతీత పనులు ఏటా తూతూమంత్రంగానే.. కాంట్రాక్టర్లకు ‘మేత’ ఈసారి పక్కా కార్యాచరణ పనులకు సిద్ధమవుతున్న యంత్రాంగం 25న టెండర్లు.. మార్చి ఆఖరులోగా పనులు పూర్తి సాక్షి, సిటీబ్యూరో: పూడికతీత.. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల్లో ఈ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఇదో గొప్ప ఆదాయ మార్గం. చేయని పనులు చేసినట్లు చెబుతూ ఏటా రూ. కోట్లు కాజేస్తున్నారు. అధికారులదీ అదే వరస. దీంతో వర్షాకాలంలో వాననీరు సాఫీగా వెళ్లేందుకు ఈ పనులు చేపడుతున్నా.. ఎక్కడి పూడిక అక్కడే పేరుకుపోయి వరదనీరు వెళ్లట్లేదు. ఏటా వానా కాలంలో నగరవాసులు నరకం చూస్తున్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయకపోవడం, సీజన్లో చేతులెత్తేయడం షరా మామూలుగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఈసారి మాత్రం నాలాల్లో పూడికతీత పనుల్ని పక్కాగా చేపట్టడానికి సిద్ధమవుతోంది. పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెబుతున్నారు. ఆ మేరకు నిర్ణీత వ్యవధిలో.. వేసవిలోనే పూడికతీత పనులు పూర్తవుతాయంటున్నారు. ఈ క్రమంలో నిర్ణీత వ్యవధిలో ఈ పనులు జరుగుతాయా.. లేక గత అనుభవమే చర్విత చరణం కానుందా అనేది రెండు నెలల్లో తేలనుంది. ఏటా ఇదీ తంతు.. నిజానికి వేసవిలోనే నాలాల్లో డీసిల్టింగ్ (పూడికతీత) పనులు జరగాల్సి ఉన్నప్పటికీ, సకాలంలో చేయట్లేదు. తీరా వర్షాలు మొదలయ్యాక పనులు చేస్తున్నారు. వర్షాల వల్ల పూడికతీత పూర్తిగా చేయకుండా మమ అనిపించి కాంట్రాక్టర్లు బిల్లులు కాజేస్తున్నారు. వారికి వత్తాసునిస్తూ అధికారులు సైతం అందినకాడికి దండుకుంటున్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పి వేసవిలోనే పూడికతీత పనులు పూర్తిచేయాల్సిందిగా కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆదేశించడంతోపాటు, కార్యాచరణకు సమయాన్ని కూడా సూచించడంతో.. వేసవిలోనే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈనెల 25న టెండర్లు పిలిచి, టెండరు పొందిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకంంటున్నారు. దీంతోపాటు.. పనులు చేయకుండానే.. చేసినట్లు చూపి బిల్లులు కాజేయకుండా ఉండేందుకు , పనులు పారదర్శకంగా ఉండేందుకు తగు నిబంధనలు రూపొందించారు. ఇదీ కార్యాచరణ.. ఈ ఏడాది మొత్తం 297 పనులు చేయాలని నిర్ణయించారు రూ. 21.18 కోట్లు మంజూరు చేశారు ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఏరియాసభ, వార్డు కమిటీ సభ్యులు, కార్పొరేటర్ల సలహాలతో ఎక్కడెక్కడ పనులు చేయాలో గుర్తించాలి అంచనా వ్యయాల్ని సైతం వారితో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి తొలగించిన పూడికను డంపింగ్‌యార్డుకు తరలించే వాహనాలకు జీపీఎస్, ఓఎస్సార్టీలు అమలు చేయాలి పూడిక తీయక ముందు.. తీస్తున్నప్పుడు.. తీశాక.. ఫొటోలు తీయాలి వాహనం జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు వెళ్లాక అక్కడి వెయింగ్ మెషిన్లో తూకం వేసి.. అందుకనుగుణంగానే కాంట్రాక్టరుకు బిల్లు చెల్లించాలి పనులు చేయడానికి ముందు, చే సిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీ చేయాలి మార్చి ఆరంభం నుంచే డీసిల్టింగ్ పనులు ప్రారంభమై, నెలాఖరులోగా పూర్తి కావాలి ఎక్కడెక్కడ డీసిల్టింగ్ పనులు చేస్తున్నది ప్రజలు చూసేందుకు వీలుగా జీహెచ్ఎంసీ వెబ్సైట్లో వివరాలు పొందుపరచాలి. ఏ నాలానైనా వదిలివేస్తే ప్రజలు సమాచారమిచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది. -
బస్సే నైట్ షెల్టర్
జీహెచ్ఎంసీ తాత్కాలిక ఏర్పాట్లు ముందుకొచ్చిన ఆర్టీసీ సాక్షి, సిటీబ్యూరో: రాత్రి వేళల్లో నిలువ నీడ లేకుండా రోడ్లపైన, ఫుట్‌పాత్‌లపైన , ఎక్కడ పడితే అక్కడ నిద్రిస్తున్న వారికి అవసరమైనన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది జీహెచ్ఎంసీ. అవి అందుబాటులోకి వచ్చేలోగా ఆర్టీసీ బస్సులనే నైట్ షెల్టర్లుగా మార్చనుంది. ఇందుకు ఆర్టీసీ కూడా జీహెచ్ఎంసీతో చేతులు కలిపింది. తొలుత రెండు బస్సులను ఇందుకు వినియోగించేందుకు ఆర్టీసీ ఎండీ అంగీకరించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ‘ప్రజావాణి’ అనంతరం కమిషనర్ విలేకరులతో మాట్లాడారు. ఈ బస్సుల్లోని సీట్లను తొలగించి, వాటిల్లో నిద్రించే ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. వీలైనన్ని నైట్‌షెల్టర్లను... వీలైనంత త్వరితంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే శీతాకాలంలోగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ నిద్రించకుండా అవసరమైనన్ని నైట్ షెల్టర్లు అందుబాటులోకి తెస్తామన్నారు. బస్సులను బయట నిద్రిస్తున్నవారు అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి పంపుతామన్నారు. వీరి అవసరాల కోసం మొబైల్ టాయ్లెట్లను కూడా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇంకా... బీటీ రెండో ఫేజ్ పనులకు రూ.12 కోట్లు మంజూరు చేశామని, బీటీ రోడ్లు, డీసిల్టింగ్ పనులకు సంబంధించి రెండు మూడు రోజుల్లో టెండర్లు పూర్తవుతాయని, వేసవిలోనే డీసిల్టింగ్ పనుల్ని పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండానే ఆస్తి పన్ను వసూళ్లు చేయాలనేది లక్ష్యమని, హెచ్చరించినా నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై మాత్రం చర్యలు తప్పవన్నారు. ఈ ఆర్థిక సంవత్సర వసూళ్ల లక్ష్యం రూ.1000 కోట్ల- రూ.1250 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.538 కోట్లు వసూలైందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.70 కోట్లు అదనమన్నారు. ఆస్తిపన్ను చెల్లించినంత మాత్రాన అక్రమ భవనం సక్రమం కాదన్నారు. అక్రమ భవనాల ఆస్తి పన్నును అసెస్ చేసే అధికారులపై చర్యలు తగదని ప్రభుత్వానికి లేఖ రాశామని, దీనిపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేస్తుందన్నారు. రోడ్డు కటింగ్‌లకు అనుమతులివ్వడం లేదని తెలిపారు. కొత్తగా 20 ఫిర్యాదులు... ‘ప్రజావాణి’కి మొత్తం 47 ఫిర్యాదులు రాగా, వీటిల్లో 20 మాత్రమే కొత్తవి. మిగతావి పాత ఫిర్యాదులే. అవి పరిష్కారం కాకపోవడంతో ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేశారు. కొత్త బడ్జెట్‌పై ఆందోళన వద్దు... ‘వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014-15) సంబంధించిన బడ్జెట్ స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లో ఇంకా ఆమోదం పొందకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. జీహెచ్ ఎంసీ చట్టంలో దీనిపై స్పష్టత లేదు. ఈ అంశంపై ప్రభుత్వానికి ఇప్పటికే రెండు లేఖలు రాశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం’ అని కమిషనర్ చెప్పారు. -
వస్తోంది సమన్వయ కమిటీ..
ఆయా విభాగాల అధికారులతో కలిసి పర్యటనలు సంక్రాంతి తర్వాత ఏర్పాటు బల్దియా కమిషనర్ సోమేశ్ వెల్లడి సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఏదైనా సమస్య ఏర్పడితే అది మా పరిధి కాదంటే..కాదని చెప్పి చేతులు దులుపుకుంటారు. అందర్నీ సమన్వయం చేసి సదరు సమస్యను పరిష్కరించాలంటే ఉన్నతాధికారులకు తలనొప్పవుతోంది. ఇక నుంచి ఆ సమస్య రాకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆయా విభాగాల అధికారులతో కలిసి ‘సమన్వయకమిటీ’ పర్యటనలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి గతంలో ఎంసీహెచ్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ విధానం ఉండేది. తిరిగి దాన్ని అమలు చేసేందుకు సోమేశ్‌కుమార్ సిద్ధమయ్యారు. నెలకోమారు ఈ కమిటీ నగరంలో పర్యటించి.. దృష్టికొచ్చిన సమస్యలను పరిష్కరిస్తుందని కమిషనర్ చెప్పారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ, జలమండలి, ఏపీసీపీడీసీఎల్, హెచ్ఎంఆర్, తదితర విభాగాల అధికారులు ఈ సమన్వయకమిటీలో ఉంటారని చెప్పారు. సంక్రాంతి తర్వాత ఈ కమిటీ ఏర్పాటు కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో డక్టింగ్: మెట్టుగూడ-నాగోలు మార్గంలో 8 కి.మీ.ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారి, డక్టింగ్ తదితర పనులు చేయనున్నట్లు చెప్పారు. దశలవారీగా నగరంలో ఎంపిక చేసిన మార్గాల్లో ఈ పనులు చేస్తారు. వీటి వ్యయం రూ. 310 కోట్లు. కాగా, హెచ్ఎంఆర్ మార్గాల్లో తనవంతు వాటాగా రూ.65 కోట్లు చెల్లిస్తుంది. ఎక్స్‌ప్రెస్‌వేకు సొబగులు: పీవీఎఎక్స్ప్రెస్వే పై గ్రీనరీతో సుందరీకరణ పనులు చేయనున్నా రు. ఇందులో భాగంగా సెంట్ర ల్ మీడియన్‌లో డ్రిప్ ఇరిగేషన్‌తో గ్రీనరీ నిర్వహణ, వెయ్యి పూలకుండీలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వంద కుండీలు ఏర్పాటు చేశారు. మొండి బకాయిల వసూళ్లకు: ఆస్తిపన్ను మొండిబకాయిల వసూళ్ల కోసం చట్టం మేరకు చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. సర్కిల్ వారీగా టాప్ 100 బకాయిదారులపై తొలుత చర్యలు తీసుకుంటారు. వాహనాలు, దుకాణాల సీజ్ తదితర చర్యలు తీసుకుంటారు. అక్రమ నిర్మాణాల నుంచి కూడా ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఆస్తిపన్ను వసూలు చేసినంత మాత్రాన అక్రమ నిర్మాణాలపై యాజమాన్యహక్కులు రావని కమిషనర్ స్పష్టం చేశారు. కోర్టు వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. రోడ్లకు నిధులు ఇస్తాం..: రహదారుల పనుల కోసం విధివిధానాలు రూపొందించారు. ప్రస్తు తం డివిజన్‌కు రూ.50 లక్షల వంతున కేటాయించారు. అవసరాన్ని బట్టి ఒక్కో డివిజన్‌కు మరో ఐదారుకోట్ల వరకు మంజూరు చేసేం దుకు సైతం అభ్యంతరం లేదని సోమేశ్కుమా ర్ తెలిపారు.అలాగే..పారిశుధ్య కార్యక్రమాల్లోనూ ఎక్కడినుంచి ఎవరు పనిచేయాలో వివరాలు కూడా ఉన్నాయని, వీటిని స్థానిక కార్పొరేటర్లకు అందజేసే ఆలోచన ఉందన్నారు. ఆ మార్గంలో పనులు చేయాల్సిన వారి పేర్లను విద్యుత్‌స్తంభాలపై రాసే యోచన కూడా ఉందని చెప్పారు. -
అంతా ఆన్లైన్
భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తు ప్రక్రియ.. =నిబంధనలు సరళీకరణ =ప్రజలకు అర్థమయ్యేలా అందుబాటులోకి.. =జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఈ విధానం ద్వారా దరఖాస్తు ఏ దశలో ఉందో.. ఎవరివద్ద ఉందో కూడా ఆన్లైన్ ద్వారానే భవన యజమానులు/ఆర్కిటెక్టులు తెలుసుకోవచ్చు. భవననిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు, సంబంధిత టౌన్‌ప్లానింగ్ ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచేం దుకు.. పారదర్శకంగా సేవలందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ‘ప్రజావాణి’ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20 నుంచి నెలాఖరు వరకు ట్రయల్న్ ్రనిర్వహిస్తామని, సంబంధిత ఉద్యోగులందరికీ తగిన శిక్షణ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కావాలని జాప్యం చేసే వారికి రోజుకు రూ. 50 వంతున జరిమానా విధిస్తామన్నారు. దరఖాస్తుల్ని పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేసి, తగిన పత్రాలను జతపరచి, క్రెడిట్ కార్డుద్వారా కానీ, డీడీ ద్వారా మీసేవా కేంద్రాల్లో కానీ, సీఎస్సీల ద్వారా కానీ ఫీజు చెల్లించవచ్చన్నారు. దరఖాస్తు అందినట్లు దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా సమాచారం చేరుతుందన్నారు. తమ దరఖాస్తు ఎప్పుడు ఎవరి వద్ద ఉందో.. ఏ దశలో ఉందో కూడా ఆన్లైన్ ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంటుందన్నారు. పై అధికారులకు సైతం ఈ సమాచారం అందుబాటులో ఉంటున్నందున.. లోపాలెక్కడున్నాయో తెలుసుకొని సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా.. భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యేలా చిన్న పుస్తకంలో ముద్రించి పంపిణీ చేస్తామన్నారు. ఎంత సెట్బ్యాక్లు ఉండాలి.. తదితర వివరాలను అందరికీ అర్థమయ్యేలా పుస్తకంలో పొందుపరుస్తామన్నారు. తద్వారా తమ దృష్టికి వచ్చిన అక్రమనిర్మాణాలను సైతం ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసేందుకు వీలవుతుందన్నారు. సామాజిక బాధ్యతగా ప్రజలు తమ దృష్టికి వచ్చిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. అక్రమ నిర్మాణాలు జరిపితే.. ఎల్లకాలం ఆస్తిపన్నుపై భారీ పెనాల్టీ ఉంటుందనే అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. త్వరితంగా అనుమతులిచ్చేందుకు ప్రధాన కార్యాలయంలో మాదిరిగా వారానికి ఓరోజు సర్కిల్, జోనల్ కార్యాలయాల్లోనూ బిల్డింగ్కమిటీ సమావేశాలు నిర్వహించే ఆలోచన ఉందని చెప్పారు. కాల్‌సెంటర్‌కు ప్రచారం కావాలి 70 లక్షలకు పైగా జనాభా ఉన్న గ్రేటర్లో ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి రోజుకు కేవలం 300 ఫిర్యాదులు మాత్రమే వస్తున్నాయని, కాల్‌సెంటర్ టోల్‌ఫ్రీ (నెంబరు 155304) గురించి పెద్దయెత్తున ప్రచారం చేయాల్సిన అవసరముందని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ సమస్యల గురించి ఫిర్యాదు చేసేందుకు వీలుగా పత్రికలు సైతం కాల్‌సెంటర్ నెంబరును ‘సమాచారం కాలమ్’ల లో ప్రచారం చేయాలని కోరారు. దీని గురించి చాలామందికి తెలియనందునే తక్కువ ఫిర్యాదులొస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజావాణికి 34 ఫిర్యాదులు ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ ‘ప్రజావాణి’కి మొత్తం 34 ఫిర్యాదులు రాగా, అందులో 15 టౌన్ప్లానింగ్వి, 3 ఆరోగ్యం- పారిశుధ్యంవి, 6 ఇంజినీరింగ్వి, 2 పార్కులవి, 1 యూసీడీవి కాగా, మిగతావి ఆయా విభాగాలవి ఉన్నాయని కమిషనర్ తెలిపారు. -
ఆస్తిపన్ను వసూళ్లకు టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోవాలంటే రోజుకు రూ.8.31 కోట్లు వంతున వసూలు చేయాలని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వసూళ్లపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు. శనివారం స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్‌తో కలిసి ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గ్రేటర్‌కు ఈ ఏడాది వసూలు కావాల్సిన ఆస్తిపన్నులో 80 శాతం సొమ్ము 20 శాతం మంది డిఫాల్టర్ల నుంచే రావాల్సి ఉందన్నారు. టాప్ 1000 బకాయిదారుల నుంచి రూ. 243 కోట్లు వసూలు కావాల్సి ఉందని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొండి బకాయిదారులపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను డిమాండ్ రూ.1779 కోట్లు కాగా, అందులో రూ.1232 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యగా నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ.500 కోట్లు మాత్రమే వసూలైందని, సగటున ఇది 41 శాతమన్నారు. జీహెచ్ఎంసీలోని సగం సర్కిళ్లు (సర్కిళ్ల నెంబర్లు 3 నుంచి 10, 17) సగటుకన్నా వెనుకబడి ఉన్నాయని, సంబంధిత సర్కిళ్ల అధికారులు కొత్త అసెస్మెంట్లపై దృష్టి సారించాలని సూచించారు. వసూళ్లకు 86 రోజుల సమయం మాత్రమే ఉందని, మార్చి నెలాఖరు వరకు గడువుందనుకోకుండా ఫిబ్రవరి 15 వరకే డెడ్‌లైన్‌గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసూళ్లపై కొందరు జోనల్ కమిషనర్లు తగిన శ్రద్ధ చూపడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. సోమవారానికి ఆ వివరాలు అందజేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. -
కష్టపడి పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు
పాడేరు, న్యూస్‌లైన్: కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని గిరిజ న సంక్షేమ శాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ అన్నారు. అనంతపురం జిల్లా లో రక్ష సెక్యూరిటీ సంస్థలో జూన్ నెల నుంచి సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ పొందుతున్న గిరిజన యువకులు సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వినూత్నంగా ఆ యువకుల తల్లిదండ్రులతో ఆదివా రం ఫోన్లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆయన పాడేరు ఐటీడీఏకు ఫోన్ చేసి శిక్షణ పొందిన యువకుల తల్లిదండ్రులతో మాట్లాడారు. తాను ఇటీవల రక్ష సెక్యూరిటీ శిక్షణ సంస్థను సందర్శించానని, మీ పిల్లలంతా క్షేమంగా ఉన్నారని, ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నారని చెప్పారు. అన్ని వసతి సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సంస్థలో ఉద్యోగాలు చేయడం ద్వారా మంచి జీతభత్యాలు లభిస్తాయని, చక్కని భవిష్యత్ ఏర్పడుతుందని భరోశా ఇచ్చారు. విశాఖ ఏజెన్సీలోని గిరిజన యువకులపై మంచి అభిప్రాయం ఉందని, అందుకే వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేసినట్టు తెలి పారు. తమ బిడ్డలకు ఇతర రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ర్టంలోనే ఉద్యోగావకాశాలు కల్పించాలని పలువురు తల్లిదండ్రులు కమిషనర్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఉద్యోగాలు ఎక్కడ వచ్చిన పనిచేయాలన్నారు. తాను బీహార్‌కు చెందిన వాడనని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఐదేళ్లు కష్టపడి పనిచేస్తే సూపర్వైజర్ స్థాయికి ఎదిగి మరింత ఎక్కువ జీతభత్యాలు పొందుతారని తెలిపారు. అనంతరం రక్ష సంస్థలో శిక్షణ పొందుతున్న జీకే వీధి మండలం సంకాడ గ్రామానికి చెందిన సాగిన రాజుపడాల్, డుంబ్రిగుడ మండలం సంతవలస, కండ్రుం గ్రామాలకు చెందిన కుమిడి రామరాజ్యం, మఠం శంకరరావు తదితరులు తమ తల్లిదండ్రులతో ఈ ఫోన్లో మాట్లాడారు. శిక్షణ బాగుందని, అన్ని సౌకర్యాలు కల్పించారని, సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నామని సంతోషంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ కాఫీ సీనియర్ సహాయకులు ఎం.వెంకటేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం జాబ్స్ ఎం.కరుణానిధి, జేడీఏంలు సత్తిరాజు, సతీష్, డీసీసీబీ డెరైక్టర్ బి.నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.