- ఆస్తిపన్నులో అవకతవకలు
- పేదోళ్లపైనే ప్రతాపం
- పెద్దోళ్లపై ప్రేమ
- జీహెచ్‌ఎంసీ ఖజానాకు లోటు
సాక్షి, సిటీబ్యూరో : ‘జీహెచ్‌ఎంసీలోని ఏ జోన్‌లోని ఏ సర్కిల్‌లోనైనా ఆస్తిపన్ను అసెస్‌మెంట్లన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్పగలరా..? ఎక్కడా అవకతవకల్లేకుండా అన్ని భవనాలకు సక్రమంగా ఆస్తిపన్ను విధించామని చెప్పే ధైర్యం ఉందా?’ అంటే.. అవునన్నవారే లేరు. ఇటీవల ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్ష సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అడిగిన ఈ ప్రశ్నకు సంబంధిత అధికారుల నుంచి సమాధానం కరువైంది. అంటే.. లోటుపాట్లు ఉన్నాయని అంతా ఒప్పుకున్నారు. వీరి చర్యల వల్ల ఎక్కువ మొత్తాల్లో జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తప్పించుకుంటున్నారు. సామాన్య ప్రజలపై మాత్రం ప్రతాపం చూపుతున్న సిబ్బంది.. వారి పరువును బజారు కీడుస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో : పేద బాలికలకు విద్యనందిస్తోన్న మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలకు ఆస్తిపన్ను మినహాయింపు అలా ఉంచి వ్యాపార సంస్థగా అధిక పన్ను నిర్ధారించారు. గతంలో రూ. 13 వేలుగా ఉన్న ఆస్తిపన్నును ఏకంగా రూ. 6 లక్షలకు పెంచడంతో.. నిర్వాహకులు కోర్టు నాశ్రయించారు. వివాదం కోర్టులో ఉంది. 80 ఏళ్ల క్రితం నిర్మించిన.. పురాతన భవనంలో బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఈ పాఠశాలపై కనీస కనికరం చూపని జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. అదే పాఠశాలకు కూతవేటు దూరంలోని నారాయణగూడలోని ఓ సినిమాహాల్‌పై మాత్రం ఎంతో ఔదార్యం కనబరిచారు. ఆ థియేటర్‌కు లెక్కించాల్సిన ఆస్తిపన్నును సక్రమంగా లెక్కించకుండా.. తక్కువ ప్లింత్ ఏరియాను చూపి దాని ఆస్తిపన్ను దాదాపు రూ.74 వేలుగా నిర్ధారించారు. ఇటీవల తిరిగి సర్వే చేస్తే.. రూ. 2.32 లక్షలు ఆస్తిపన్ను కట్టాల్సి ఉంటుందని తేల్చారు. అంటే ఇంతకాలం వరకు వాస్తవ మొత్తంలో రెండింతలు తక్కువ చూపారు.
జీహెచ్‌ఎంసీ అధికారులు ఆమ్యామ్యాలకు మరిగి బడా సంపన్నులకు ఆస్తిపన్నులో ‘రాయితీ’లు కల్పిస్తూ.. సాధారణ ప్రజలు, దాతృత్వంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలపై మాత్రం ప్రతాపం చూపుతున్నారు. పేద విద్యార్థులకు విద్యనందించే పాఠశాలలు, అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థల భవనాలపై అదనపు భారం మోపిన సిబ్బంది.. అడుగడుగునా లాభాలతో జేబులు నింపుకొనే వ్యాపారసంస్థలు, బహుళ అంతస్తుల భవనాలపై మాత్రం ఔదార్యం కనబరుస్తున్నారు. అంతేకాదు పేరుమోసిన ప్రజాప్రతినిధులు, తదితరుల విషయంలోనూ ఇలాగే చూసీ చూడనట్లు వదిలేస్తూ.. కొన్ని చోట్ల వారికి తక్కువ ఆస్తిపన్ను మాత్రమే విధిస్తూ.. మరికొన్ని చోట్ల తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆదాయానికి చిల్లు పడుతోంది. అదే సమయంలో అమాయకులపై అదనంగా వడ్డిస్తున్న ఘటనలూ తక్కువేం లేవు.
ఖజానాకు చిల్లు
తక్కువ ప్లింత్ ఏరియా చూపి బడాబాబులకు అనధికారికంగా రాయితీలిచ్చిన అధికారుల చర్యల వల్ల జీహెచ్‌ఎంసీకి రావాల్సిన రూ. 48 కోట్ల ఆదాయం రాకుండా పోయింది. 2.13 లక్షల మంది భవన యజమానులకు ఇలా తక్కువ ఫీజు విధించడంతో.. వాస్తవాదాయంలో రూ. 48 కోట్లు త గ్గింది. ఇదే సమయంలో 32 వేల మంది సామాన్యులపై అసలు కంటే అదనంగా వేసిన భారం రూ. 10 కోట్లు. అన్నీ పరిగణనలోకి తీసుకొని.. సవరణలు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం నికరంగా రూ. 38 కోట్లు అదనంగా రావాల్సి ఉంది. కొత్తగా ఆస్తిపన్ను పరిధిలోకి వచ్చిన భవనాల నుంచి మరో రూ. 43 కోట్లు అదనంగా రానున్నాయి. మొత్తంగా సర్వే కారణంగా రూ.81 కోట్లు జీహెచ్‌ఎంసీకి అదనంగా చేరనున్నాయి. 2.88 లక్షల భవనాలు సర్వే చేస్తేనే ఇంత వ్యత్యాసం కనిపించింది. జీహెచ్‌ంఎసీలోని 13 లక్షల పైచిలుకు భవనాలన్నింటి సర్వే పూర్తయ్యేటప్పటికి ఇంకెన్ని విశేషాలు వెలుగు చూస్తాయో!