girls school
-
శిథిలావస్థలో సావిత్రిబాయి పూలే పాఠశాల.. కొత్త కళను తీసుకువచ్చేందుకు
Savitribai Phule Birth Anniversary: సావిత్రిబాయి పూలే అంటే పేరు కాదు. ఆత్మగౌరవ పోరాటం. అక్షర ఆయుధం. స్త్రీ విద్య అనేది ఊహకు కూడా రాని కాలంలో, భర్త జ్యోతి బాపూలేతో కలిసి మనదేశంలో తొలి బాలికల పాఠశాల స్థాపించారు. 1848లో పుణె (మహరాష్ట్ర)లో ఏర్పాటైన ఈ పాఠశాల నిమ్నవర్గాల బాలికలకు చదువు నేర్పింది. ‘ఆడపిల్లలకు చదువు వద్దు’ అనే అహంకార ధోరణికి ఉప్పుపాతర వేసింది. ఆ బడి నిర్వాహణ నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. భౌతికదాడులు కూడా జరిగాయి. అయినప్పటికీ ఆడపిల్లలు ముందడుగు వేయడానికి తాము ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. ఎన్నడూ రాజీ పడలేదు. స్త్రీ చైతన్యం కోసం ‘మహిళా మండల్’ పేరుతో మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు సావిత్రిబాయి. ఇక తాజా విషయానికి వస్తే... చారిత్రక కట్టడంగా భావించే పుణెలోని తొలి బాలికల పాఠశాల శిథిలావస్థలో ఉంది. ఈ పాఠశాలను పునర్నిర్మించి కొత్త కళను తీసుకువచ్చే బాధ్యతను తీసుకుంది పుణె మున్సిపాలిటి కార్పోరేషన్ (పీఎంసి) ఈ కొత్త సంవత్సరంలోనే నిర్మాణపనులు జరగనున్నాయి. విశేషం ఏమిటంటే, ఆ కాలంలో ఉనికిలో ఉన్న అర్కిటెక్చర్తోనే స్కూల్ నిర్మించనున్నారు. దీన్ని జాతీయ స్మారక చిహ్నంగా మారుస్తారు. ఏడు అంతస్తులతో నిర్మాణమయ్యే ఈ భవనంలో అయిదు ఫ్లోర్లను స్కూల్ కోసం కేటాయిస్తారు. బాలికల కోసం అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తారు. చదవండి: పట్టులాంటి జుట్టుకోసం.. ఇవి కలిపి జుట్టుకి పట్టించండి.. మరోవైపు ఈ భవనాన్ని ‘అడ్వాన్స్డ్ నాలెడ్జ్ సెంటర్’గా తీర్చిదిద్దుతారు. స్కూల్ ఏర్పాటు, నిర్వాహణలో ఆనాడు సావిత్రిబాయి, జ్యోతిబాపూలేకు సహకరించిన వారి ఛాయచిత్రాలు చూడవచ్చు. వారికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. 19, 20 శతాబ్దాలకు సంబంధించిన సామాజిక సంస్కరణల తాలూకు వివరాలు ఇక్కడ అందుబాటులో పెడతారు. స్థూలంగా చెప్పాలంటే... పునర్నిర్మాణం కానున్న ఈ చారిత్రక కట్టడం, ఒక నగరానికి పరిమితమనుకునే కట్టడం కాదు. కోటానుకోట్లమందిని ముందుకు నడిపించే జీవచైతన్యం. ఆత్మగౌరవ పతాకం. -
అఫ్గాన్‌లో స్కూల్ వద్ద భారీ పేలుడు, 55 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్ పశ్చిమ ప్రాంతంలో శనివారం తీవ్ర బాంబు పేలుడు సంభవించింది. అఫ్గాన్‌లో మైనారిటీలైన షియాలు అధికంగా నివసించే ప్రాంతంలోని ఓ బాలికల స్కూల్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ఈ ఘటనలో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 150మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 11-15 ఏళ్ల మధ్య విద్యార్థినులే అని అధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తాము కాదం టూ తాలిబాన్ ప్రకటించింది. మరే ఇతర ఉగ్రసంస్థ ఈ పేలుడుకు ఇంకా బాధ్యత వహించుకోలేదు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా, వారికి రక్తదానం చేసేందుకు భారీ స్థాయిలో ప్రజలు ఆస్పత్రుల వద్దకు చేరారు. మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్‌లో మైనారిటీ షియాలపై ఉగ్రసంస్థ ఐసిస్ విరుచుకుపడుతోంది. ఇటీవలే ఓ బాంబు పేలుడు జరిపి పలువురు ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ స్పందిస్తూ, ఇలాంటి హీనమైన పేలుళ్లకు పాల్పడేది ఐసిస్ మాత్రమే అని పేర్కొంది. అఫ్గాన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ సైతం ఐసిస్‌కు సాయపడుతోందని ఆరోపించింది. (చదవండి: అమెరికా సంచలన ప్రకటన: అఫ్గాన్ నుంచి బలగాలు వెనక్కి) -
ధీరమణులు!
సాక్షి, సిటీబ్యూరో : కళ్లల్లో ఆత్మస్థైర్యం. కరాల్లో పటుత్వం. తొణికిసలాడే గుండె నిబ్బరం. కర్ర పట్టి గిరగిరా తిప్పారంటే శత్రువు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కరవాలం ఝళిపించారంటే వైరివర్గం గడగడలాడాల్సిందే. చదువులోనే కాదు సాములోనూ శక్తిస్వరూపిణులమేనని నిరూపిస్తున్నారు ఆ బాలికలు. కర్రసాము, ఖడ్గ విన్యాసాల్లో పురుషులకూ తీసిపోమంటున్నారు. తమపై చెయ్యి వేస్తే ‘చండీ ప్రచండుల’మేనంటున్నారు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు. పుస్తకాలు పట్టిన చేతులే కర్రలు, కత్తులు పట్టి పోరాడగలవని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైదాబాద్‌లోని సెయింట్ మాజ్ స్కూల్ పీఈటీ అబ్దుర్ రెహమాన్‌కు 2003లో ఓ ఆలోచన వచ్చింది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో పాటు కర్రసాము, ఖడ్గ విన్యాసాలను పాఠశాల విద్యార్థినులకు కూడా నేర్పించాలనుకున్నారు. ఈ శిక్షణ బాలికల ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన భావించారు. అనుకున్నదే తడవుగా ఈ నిర్ణయాన్ని పాఠశాల నిర్వాహకుల ముందు పెట్టారు. దీనిని వారు బాలికల తల్లిదండ్రుల దృష్టికెళ్లారు. పలువురు ఇందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ విషయం విద్యార్థినులకు తెలియడంతో కొంత మంది తమ తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో పీఈటీ అబ్దుర్ రెహమాన్ శిక్షణ ప్రారంభించారు. మహిళా దినోత్సవం రోజునే.. పాఠశాలలో 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే సెయింట్ మాజ్ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్‌లో విద్యార్థినులకు శిక్షణ ప్రారంభించారు. మొదట్లో ప్రాథమిక తరగతుల పిల్లలకు ఆ తర్వాత 10వ తరగతి చదివే అమ్మాయిలకు శిక్షణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ పీరియడ్నే కేటాయించారు. సెయింట్ మాజ్ స్కూల్లో 15 ఏళ్ల క్రితం అమ్మాయిల కోసం ప్రాంభమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రస్తుతం పాతబాస్తీలోని చాలా పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన పలువురు యువతులు శిక్షకులుగా కూడా పనిచేస్తున్నారు. అమ్మాయిల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ దేశంలోనే తొలిసారిగా మాజ్ స్కూల్లో ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు. మంచి స్పందన వస్తోంది.. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడానికి బాలికల తల్లిదండ్రుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. మా స్కూల్లో శిక్షణ పొందిన అమ్మాయిలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలుస్తుండటం ఎంతో గర్వకారణం. – ముహమ్మద్ ఇద్రీస్ అలీ,సెయింట్ మాజ్ స్కూల్ నిర్వాహకుడు వహ్వా.. ఫరీహా..! ఈ యువతి పేరు ఫరీహా తఫీమ్. బాలికలపై, యువతులపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను టీవీలో చూసి మనసు చలించిపోయింది. తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలి అని ఆలోచించింది. స్వీయరక్షణకు దారులు వెతికింది. ఏడో తరగతిలో ఉండగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటానని తల్లిదండ్రులతో పోరు పెట్టింది. వారు ససేమిరా అన్నారు. అయినా ఆమె తన పట్టు వీడలేదు. అమ్మాయిల ఆత్మరక్షణపై వారికి ఎంతో వివరించింది. దీంతో వారే సరేనన్నారు. ఇంకేముంది మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం విక్టోరియా మైదానంలో 50 మందికి శిక్షణ ఇస్తూ పలువురి చేత శెభాష్ అనిపించుకుంటోంది. స్వీయరక్షణకు ప్రాధాన్యమిచ్చి కరాటే, మార్షల్ ఆర్ట్స్ తదితర విద్యలు నేర్చుకోవాలని ఫరీహా తఫీమ్ సూచిస్తోంది. -
శ్రీమంతుడు
సుండుపల్లి: శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసే సుండుపల్లి ఎస్ఐ నరసింహారెడ్డి సమాజ సేవకు పాటుపడుతున్నారు. కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని దత్తత తీసుకుని.. పాఠశాలలో వసతుల కల్పనకు తోడ్పడుతున్నారు. ♦ కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని ఎస్ఐ జూన్ నెలలో దత్తత తీసుకున్నారు. ఓ పక్క విధులు నిర్వహిస్తూ.. పాఠశాల అభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. 200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల కోసం ఆవరణంలో 5 ఎకరాల్లో ఉన్న గుట్టలను జేసీబీ సాయంతో తొలగించి క్రీడలు ఆడుకునేందుకు చక్కటి మైదానం ఏర్పాటు చేశారు. కొంతభాగంలో పచ్చని తోటలాగా ఏర్పాటు చేశారు. ♦ మైదానంలో రాత్రిపూట చదువు కునేందుకు వీలుగా ఏడు విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి కాంతివంతమైన లైట్లను అమర్చారు. విద్యార్థుల వంట కోసం, స్నానాల కోసం, బట్టలు ఉతికేందుకు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిసి బోరు వేయించారు. బోరు విఫలమైనా వెనక్కు తగ్గలేదు. మరోబోరు వేయించారు. దీంతో నీటి సమస్య తీరింది. వారానికి ఒకసారి ట్యాంకర్ ద్వారా వచ్చే నీటితో ఇబ్బందులు పడే విద్యార్థినులకు ఇక నీటి సమస్య తీరింది. ♦ దుస్తులు ఉతికేందుకు దోబీగాట్ ఏర్పాటు చేయించారు. తరగతి గదుల్లో బేంచీలకు మరమ్మతులు చేయించారు. మురుగునీరు బయటకు వెళ్లేందుకు కొత్త పైపులైను.. టాయ్లెట్లల్లో పింగానీలు, స్నానపుగదుల్లో టైల్స్ ఏర్పాటు చేయించారు. ఆహ్లాదకరంగా ఉంది మా పాఠశాలను ఎస్ఐ నరసింహారెడ్డి సారు దత్తత తీసుకున్నప్పటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పించారు. గతంలో స్కూల్లో చదువుకోవాలన్నా చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. – అవని, 9వ తరగతి విద్యాభివృద్ధికి సహకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి సహకారం అందిస్తున్నా. రాయలసీమ ఐజీ ఇచ్చిన సూచన మేరకు ఈ పాఠశాలను దత్తత తీసుకున్నా. కస్తూర్బా పాఠశాలలో వసతులు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా. జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయితీని దత్తత తీసుకుని సిమెంటు రోడ్డు ఏర్పాటుకు, మరుగుదొడ్లపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా. – నరసింహారెడ్డి, ఎస్ఐ, సుండుపల్లి -
గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి
ఉమ్మడి జిల్లా రీజినల్ డైరెక్టర్ రమేశ్ ఇచ్చోడ : గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని గిరిజన గురుకుల పాఠశాలు, కళాశాలల ఉమ్మడి జిల్లా రీజినల్ డైరెక్టర్ టి.రమేశ్ అన్నారు. గురువారం ఇచ్చోడ గిరిజన బాలికల పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేజీ టు పీజీ నిర్బంధ విద్యలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు నూతన గిరిజన గురుకుల బాలికల పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంద్రవెల్లి, బోథ్, సిర్పూర్, తిర్యాణి, జైనూర్, ముథోల్ మండల కేంద్రాల్లోని ఈ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయల నియామకపు ప్రకియ కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లాలో ఆరు నూతన పాఠశాలలు, ఆరు పాత పాఠశాలల్లో ఐదో వతరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదో తరగతిలో ప్రవేశం కోసం ఎస్టీ విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రకియ ఫిబ్రవరి 16నుంచి మార్చి 16 వరకు కొనసాగుతుందని తెలిపారు. రూ.30 రుసుంతో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకున్నవారు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డివిజన్ స్థాయిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతీ పాఠశాలలో 80 మంది విద్యార్థుల చొప్పున 12 పాఠశాలల్లో 960 మందికి ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు గిరిజన గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్య, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 9న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 80శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్టీ విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్, ఇచ్చోడ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణ్‌నాయక్, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌స్వామి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మారుతిశర్మ, ఆదిలాబాద్ పాఠశాల ప్రిన్సిపాల్ సాయిరాం పాల్గొన్నారు. -
బాలికలకు 50 ఏళ్లు నిండినవారే చెప్పాలంట!
గుర్గావ్: ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు అక్కడక్కడ విద్యార్థినుల విషయంలో తప్పులు చేస్తున్నారంటే విన్నాంగానీ.. ఉపాధ్యాయులు నిజంగానే వారిపట్ల తప్పులు చేస్తారనే గట్టి నమ్మకంలో హర్యానా ప్రభుత్వం మునిగినట్లుందని తెలుస్తోంది. ఎవరికీ లేని కొత్త ఆలోచనను పుట్టిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో బదిలీలు ఉంటాయి. ఈ బదిలీల విషయంలో కొన్ని నిబంధనలు ఉండటం సహజంగానీ, ఇంత వయసు ఉన్నవాళ్లనే ఫలానా స్కూళ్లకు పంపించాలన్న నిబంధన ఎక్కడా లేదు. కానీ, హర్యానా ప్రభుత్వం మాత్రం ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే, 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని బాలికల మాధ్యమిక పాఠశాలలకు పంపించేది లేదంట. 50 ఏళ్ల పై బడిన వారు మాత్రమే మాధ్యమిక పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు అర్హులు అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అది 2016-17నుంచి అమలు కానుందని స్పష్టం చేసింది. వారు పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం 2016 జూన్ 30లోపు 50 ఏళ్లు నిండిన వారు మాత్రమే బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీ చేసేందుకు అర్హులు అంట. ఈ నిర్ణయం పట్ల అక్కడ ఉపాధ్యాయులంతా అవాక్కయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపట్ల పెద్ద మొత్తంలో విమర్శలు కూడా వెల్లు వెత్తుతున్నాయి. ’హార్యానా విద్యాశాఖమంత్రి రామ్ బిలాస్ శర్మ ఒక ప్రకటన విడుదల చేస్తూ ’ఏ ఉపాధ్యాయుడు గత జూన్ 30నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకోడో అతడికి బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీ వెళ్లే అర్హత లేదు. ఒక వేళ అతడు అలాంటి పాఠశాలను ఎంచుకున్నా అనుమతించబోం’ అని పేర్కొన్నారు. -
బాలికల పాఠశాలను సందర్శించిన సివిల్ జడ్జి
-
సిరియన్ బాలికలకోసం మలాలా పాఠశాల
లెబనాన్: పాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్.. సిరియన్ శరణార్ధ బాలికల కోసం బెక్కా లోయలో 'మలాలా యూసఫ్ జాయ్ ఆల్ గర్ల్స్ స్కూల్' పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించారు. మలాలా ఫండ్ నిధులను ఈ పాఠశాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. తన 18వ పుట్టిన రోజు వేడుకలను ఆమె సిరియన్ సరిహద్దుల్లో లెబనాన్ వ్యాలీలో ఆదివారం జరుపుకొన్నారు. బాలికా విద్యకోసం పాటు పడుతున్నమలాలా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. మిలిటరీ ఖర్చులను తగ్గించుకొని , బాలికా విద్యాకోసం పాటుపడాలని ప్రపంచ నాయకులకు విజ్క్షప్తి చేశారు. ప్రపంచం మొత్తంమీద ఎనిమిది రోజులు సైనిక ఖర్చును నిలిపివేస్తే 12 సంవత్సరాలపాటు ఉచిత విద్యను అందించవచ్చన్నారు. ప్రతీ పిల్లవాడికి నాణ్యమైన విద్య చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధాన్ని నివారించడంలో ప్రపంచ దేశాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. సిరియా ప్రాంతంలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు చెల్లాచెదరైపోతున్నారనీ, ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా మారిపోతున్నారన్నారు. ఆ ప్రజలను, ముఖ్యంగా పిల్లలను కాపాడడంలో ప్రపంచ దేశాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇది హృదయాలను పిండేసేంత బాధాకరమైన విషయమన్నారు. సిరియన్ శరణార్థ బాలికలకు తన సంపూర్ణ మద్దతు తెలియచేసిన ఆమె ఇంతమంది ధైర్యవంతుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఇంత విషాదకర పరిస్థితుల్లోనూ, అంతర్యుర్ధం మధ్య పాఠశాలకు వెళుతున్న 2.80 కోట్ల మంది పిల్లల ప్రతినిధిగా ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయని మలాలా కొనియాడారు. -
కమిషనర్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తా
ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మంనగరంలోని త్రీటౌన్‌లో ఉన్న ఆంధ్రా బాలిక పాఠశాల కూల్చివేత ఘటనపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు తెలిపారు. ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకుల కోరిక మేరకు శుక్రవారం ఆయన పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దుర్గాదేవి, విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కొందరు వ్యాపారులతో కుమ్మక్కై ఎటువంటి నోటీసులు కానీ, ముందస్తు సమాచారం కానీ ఇవ్వకుండా పాఠశాల భవనాన్ని కూల్చివేశారని విద్యార్థులు తెలిపారు. దీనిపై పోలీస్ కేసు కూడా పెట్టామని, ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. తప్పు జరిగిందని కమిషనర్ కూడా అంగీకరించారని, ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయనకు తెలిపారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. రాజకీయ చైతన్యం గల జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, దేశానికి స్వాతంత్య్ర రాక ముందే స్థానిక నాయకులు పీ. రాములు మహిళలు చదువుకునేందుకు పాఠశాల ఏర్పాటుకు స్థలం దానం చేశారని అన్నారు. కానీ కొంతమంది స్వార్థపరులు దీనిని కబ్జా చేసేందుకు యత్నించడం బాధాకరమని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా ఒక భవనాన్ని కూల్చి వేయాలంటే ముందు ఆర్కియాలజీ(ఇంజనీరింగ్ విభాగం) వారి అనుమతి తీసుకోవాలని, ఆ తర్వాతే నోటీసులు ఇవ్వాలని, ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే కూల్చివేయాలని అన్నారు. కానీ ఇక్కడి అధికారులు ఈ పద్ధతులేవీ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన భవన నిర్మాణానికి రూ. 10లక్షల మంజూరు.. ఆ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు ప్రకటించారు. రెండు మూడు నెలల్లో ఈ మొత్తాన్ని అందజేస్తానని తెలిపారు. మరో ఎంపీతో మాట్లాడి మరి కొన్ని నిధులు వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు. ఎమ్మెల్యే పువ్వాడ ఆజయ్కూడా కొన్ని నిధులు ఇస్తారని, కార్పొరేషన్ అధికారులు కలెక్టర్‌ను కలిసి యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణం చేపట్టి ఈ సంవత్సరం చివరి వరకు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ ఆజయ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ కూల్‌హోం ప్రసాద్, తాళ్ళూరి హన్మంతరావు, ఉపాధ్యయ సంఘం నాయకులు శేఖర్, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రదీప్ పాల్గొన్నారు. -
గ్రేటర్ వివక్ష
ఆస్తిపన్నులో అవకతవకలు పేదోళ్లపైనే ప్రతాపం పెద్దోళ్లపై ప్రేమ జీహెచ్ఎంసీ ఖజానాకు లోటు సాక్షి, సిటీబ్యూరో : ‘జీహెచ్ఎంసీలోని ఏ జోన్‌లోని ఏ సర్కిల్‌లోనైనా ఆస్తిపన్ను అసెస్మెంట్లన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్పగలరా..? ఎక్కడా అవకతవకల్లేకుండా అన్ని భవనాలకు సక్రమంగా ఆస్తిపన్ను విధించామని చెప్పే ధైర్యం ఉందా?’ అంటే.. అవునన్నవారే లేరు. ఇటీవల ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్ష సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అడిగిన ఈ ప్రశ్నకు సంబంధిత అధికారుల నుంచి సమాధానం కరువైంది. అంటే.. లోటుపాట్లు ఉన్నాయని అంతా ఒప్పుకున్నారు. వీరి చర్యల వల్ల ఎక్కువ మొత్తాల్లో జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తప్పించుకుంటున్నారు. సామాన్య ప్రజలపై మాత్రం ప్రతాపం చూపుతున్న సిబ్బంది.. వారి పరువును బజారు కీడుస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో : పేద బాలికలకు విద్యనందిస్తోన్న మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలకు ఆస్తిపన్ను మినహాయింపు అలా ఉంచి వ్యాపార సంస్థగా అధిక పన్ను నిర్ధారించారు. గతంలో రూ. 13 వేలుగా ఉన్న ఆస్తిపన్నును ఏకంగా రూ. 6 లక్షలకు పెంచడంతో.. నిర్వాహకులు కోర్టు నాశ్రయించారు. వివాదం కోర్టులో ఉంది. 80 ఏళ్ల క్రితం నిర్మించిన.. పురాతన భవనంలో బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఈ పాఠశాలపై కనీస కనికరం చూపని జీహెచ్ఎంసీ సిబ్బంది.. అదే పాఠశాలకు కూతవేటు దూరంలోని నారాయణగూడలోని ఓ సినిమాహాల్‌పై మాత్రం ఎంతో ఔదార్యం కనబరిచారు. ఆ థియేటర్‌కు లెక్కించాల్సిన ఆస్తిపన్నును సక్రమంగా లెక్కించకుండా.. తక్కువ ప్లింత్ ఏరియాను చూపి దాని ఆస్తిపన్ను దాదాపు రూ.74 వేలుగా నిర్ధారించారు. ఇటీవల తిరిగి సర్వే చేస్తే.. రూ. 2.32 లక్షలు ఆస్తిపన్ను కట్టాల్సి ఉంటుందని తేల్చారు. అంటే ఇంతకాలం వరకు వాస్తవ మొత్తంలో రెండింతలు తక్కువ చూపారు. జీహెచ్ఎంసీ అధికారులు ఆమ్యామ్యాలకు మరిగి బడా సంపన్నులకు ఆస్తిపన్నులో ‘రాయితీ’లు కల్పిస్తూ.. సాధారణ ప్రజలు, దాతృత్వంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలపై మాత్రం ప్రతాపం చూపుతున్నారు. పేద విద్యార్థులకు విద్యనందించే పాఠశాలలు, అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థల భవనాలపై అదనపు భారం మోపిన సిబ్బంది.. అడుగడుగునా లాభాలతో జేబులు నింపుకొనే వ్యాపారసంస్థలు, బహుళ అంతస్తుల భవనాలపై మాత్రం ఔదార్యం కనబరుస్తున్నారు. అంతేకాదు పేరుమోసిన ప్రజాప్రతినిధులు, తదితరుల విషయంలోనూ ఇలాగే చూసీ చూడనట్లు వదిలేస్తూ.. కొన్ని చోట్ల వారికి తక్కువ ఆస్తిపన్ను మాత్రమే విధిస్తూ.. మరికొన్ని చోట్ల తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయానికి చిల్లు పడుతోంది. అదే సమయంలో అమాయకులపై అదనంగా వడ్డిస్తున్న ఘటనలూ తక్కువేం లేవు. ఖజానాకు చిల్లు తక్కువ ప్లింత్ ఏరియా చూపి బడాబాబులకు అనధికారికంగా రాయితీలిచ్చిన అధికారుల చర్యల వల్ల జీహెచ్ఎంసీకి రావాల్సిన రూ. 48 కోట్ల ఆదాయం రాకుండా పోయింది. 2.13 లక్షల మంది భవన యజమానులకు ఇలా తక్కువ ఫీజు విధించడంతో.. వాస్తవాదాయంలో రూ. 48 కోట్లు త గ్గింది. ఇదే సమయంలో 32 వేల మంది సామాన్యులపై అసలు కంటే అదనంగా వేసిన భారం రూ. 10 కోట్లు. అన్నీ పరిగణనలోకి తీసుకొని.. సవరణలు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం నికరంగా రూ. 38 కోట్లు అదనంగా రావాల్సి ఉంది. కొత్తగా ఆస్తిపన్ను పరిధిలోకి వచ్చిన భవనాల నుంచి మరో రూ. 43 కోట్లు అదనంగా రానున్నాయి. మొత్తంగా సర్వే కారణంగా రూ.81 కోట్లు జీహెచ్ఎంసీకి అదనంగా చేరనున్నాయి. 2.88 లక్షల భవనాలు సర్వే చేస్తేనే ఇంత వ్యత్యాసం కనిపించింది. జీహెచ్ంఎసీలోని 13 లక్షల పైచిలుకు భవనాలన్నింటి సర్వే పూర్తయ్యేటప్పటికి ఇంకెన్ని విశేషాలు వెలుగు చూస్తాయో! -
సర్కారీ స్కూళ్లలో టాయిలెట్లు లేక బాలికల ఇక్కట్లు
రాష్ట్రంలో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్న స్కూళ్లు 48 శాతమే కర్ణాటకలో 97 శాతం స్కూళ్లలో వేర్వేరుగా టాయిలెట్లు సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు.. 78,450. అందులో బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్న స్కూళ్లు కేవలం 37,997. అంటే కేవలం 48 శాతం! కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలు.. 50,257. అందులో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సదుపాయం ఉన్నవి 49,185. అంటే 97 శాతం!! డిపెప్, సర్వశిక్షా అభియాన్, విద్యాహక్కు చట్టం.. ఇలా అనేక పథకాల పేరుతో ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా మన రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లేమితో ఏటా నాలుగైదు కోట్లు కుమ్మరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. టాయిలెట్లే కాదు.. అనేక స్కూళ్లలో తాగునీటి సౌకర్యం కూడా లేదు. రాష్ట్రంలో 78,450 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.. అందులో 22,026 స్కూళ్లలో (28.08 శాతం) బాలబాలికలకు ఉమ్మడి టాయిలెట్లు ఉన్నాయని, కేవలం 37,997 (48.43 శాతం) స్కూళ్లలోనే వారికి వేర్వేరుగా టాయిలెట్ సదుపాయం ఉందని స్వయంగా విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన గణాంకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఉన్న టాయిలెట్లలో కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. కొన్నింటికి నీటి సదుపాయం లేకపోగా, మరికొన్ని నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. టాయిలెట్ల ఏర్పాటుకు విద్యాశాఖ నిధులు ఇస్తున్నా.. వాటి నిర్వహణకు పక్కా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. దీంతో నిర్మించిన టాయిలెట్లు కూడా చెత్తా చెదారంతో నిండిపోయి కొన్నాళ్లకు శిథిలమైపోతున్నాయి. 66,989 పాఠశాలల్లో (85.39 శాతం) తాగునీటి సదుపాయం ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతోంది కానీ క్షేత్రస్థాయిలో ఉపయోగకరంగా ఉన్నవి తక్కువే. టీచర్ల కొరత సమస్య కూడా తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 15,892 పోస్టులు ఖాళీగా ఉండగా, సర్వశిక్షా అభియాన్ పరిధిలో 11,787 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో బోధనలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో చెత్తా చెదారం పడకుండా కిచెన్ షెడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వమే వందల కోట్ల రూపాయలు ఇచ్చినా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సద్వినియోగపరచుకోలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు సరిపోవనే సాకుతో వాటి నిర్మాణాలను గాలికొదిలేసింది. రాష్ట్రం తరపున కొంత మొత్తం కేటాయించి పూర్తి చేయాలన్న ధ్యాస లేకపోవడంతో 40 వేల కిచెన్ షెడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు.