కమిషనర్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తా
ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మంనగరంలోని త్రీటౌన్‌లో ఉన్న ఆంధ్రా బాలిక పాఠశాల కూల్చివేత ఘటనపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు తెలిపారు. ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకుల కోరిక మేరకు శుక్రవారం ఆయన పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దుర్గాదేవి, విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కొందరు వ్యాపారులతో కుమ్మక్కై ఎటువంటి నోటీసులు కానీ, ముందస్తు సమాచారం కానీ ఇవ్వకుండా పాఠశాల భవనాన్ని కూల్చివేశారని విద్యార్థులు తెలిపారు.
దీనిపై పోలీస్ కేసు కూడా పెట్టామని, ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. తప్పు జరిగిందని కమిషనర్ కూడా అంగీకరించారని, ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయనకు తెలిపారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. రాజకీయ చైతన్యం గల జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, దేశానికి స్వాతంత్య్ర రాక ముందే స్థానిక నాయకులు పీ. రాములు మహిళలు చదువుకునేందుకు పాఠశాల ఏర్పాటుకు స్థలం దానం చేశారని అన్నారు.
కానీ కొంతమంది స్వార్థపరులు దీనిని కబ్జా చేసేందుకు యత్నించడం బాధాకరమని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా ఒక భవనాన్ని కూల్చి వేయాలంటే ముందు ఆర్కియాలజీ(ఇంజనీరింగ్ విభాగం) వారి అనుమతి తీసుకోవాలని, ఆ తర్వాతే నోటీసులు ఇవ్వాలని, ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే కూల్చివేయాలని అన్నారు. కానీ ఇక్కడి అధికారులు ఈ పద్ధతులేవీ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నూతన భవన నిర్మాణానికి రూ. 10లక్షల మంజూరు..
ఆ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు ప్రకటించారు. రెండు మూడు నెలల్లో ఈ మొత్తాన్ని అందజేస్తానని తెలిపారు. మరో ఎంపీతో మాట్లాడి మరి కొన్ని నిధులు వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు. ఎమ్మెల్యే పువ్వాడ ఆజయ్‌కూడా కొన్ని నిధులు ఇస్తారని, కార్పొరేషన్ అధికారులు కలెక్టర్‌ను కలిసి యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణం చేపట్టి ఈ సంవత్సరం చివరి వరకు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ ఆజయ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ కూల్‌హోం ప్రసాద్, తాళ్ళూరి హన్మంతరావు, ఉపాధ్యయ సంఘం నాయకులు శేఖర్, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రదీప్ పాల్గొన్నారు.