కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హన్మంత రావు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతుందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు అన్నారు. పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో అవినీతిలో తెలంగాణ 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పలు మీడియా ప్రతినిధులు చేసిన సర్వేలో తెలంగాణలో 73 శాతం అవినీతి ఉందని తేలిందని ఆయన పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే వారిని చెప్పుతో కొట్టాలంటూ మాట్లాడిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఎన్ని చెప్పులైనా సరిపోవంటూ ఎద్దేవా చేశారు.
తాము చేస్తున్న కార్యక్రమాల గురించి దేశమంతా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ అవినీతిని కూడా ప్రచారం చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. రైతులపై అంత ప్రేమ ఉన్న వారే అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదని వీహెచ్ ప్రశ్నించారు. కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రైతు బంధు పథకం ప్రారంభించారని విమర్శించారు. రైతు బంధు పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో టీఆర్‌ఎస్ సర్కారు చెప్పాలని.. లేని పక్షంలో సీబీఐ విచారణకు సిద్ధమవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ అసలైన హిందువని కేటీఆర్ చెబుతున్నారని, మజ్లిస్ పార్టీతో సంబంధం లేకుండా ఆ మాట చెప్పగలరా అంటూ వీహెచ్ సవాల్ విసిరారు. తాము అసలైన హిందువులమంటూ చెప్పుకుంటున్న కేటీఆర్ మాటలు విన్న తర్వాత కూడా మజ్లిస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిసి ఉండాలనుకుంటుందో లేదో అక్బరుద్దీన్, అసదుద్దీన్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.