సాక్షి, సిటీబ్యూరో : కళ్లల్లో ఆత్మస్థైర్యం. కరాల్లో పటుత్వం. తొణికిసలాడే గుండె నిబ్బరం. కర్ర పట్టి గిరగిరా తిప్పారంటే శత్రువు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కరవాలం ఝళిపించారంటే వైరివర్గం గడగడలాడాల్సిందే. చదువులోనే కాదు సాములోనూ శక్తిస్వరూపిణులమేనని నిరూపిస్తున్నారు ఆ బాలికలు. కర్రసాము, ఖడ్గ విన్యాసాల్లో పురుషులకూ తీసిపోమంటున్నారు. తమపై చెయ్యి వేస్తే ‘చండీ ప్రచండుల’మేనంటున్నారు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు. పుస్తకాలు పట్టిన చేతులే కర్రలు, కత్తులు పట్టి పోరాడగలవని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సైదాబాద్‌లోని సెయింట్ మాజ్ స్కూల్ పీఈటీ అబ్దుర్ రెహమాన్‌కు 2003లో ఓ ఆలోచన వచ్చింది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో పాటు కర్రసాము, ఖడ్గ విన్యాసాలను పాఠశాల విద్యార్థినులకు కూడా నేర్పించాలనుకున్నారు. ఈ శిక్షణ బాలికల ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన భావించారు. అనుకున్నదే తడవుగా ఈ నిర్ణయాన్ని పాఠశాల నిర్వాహకుల ముందు పెట్టారు. దీనిని వారు బాలికల తల్లిదండ్రుల దృష్టికెళ్లారు. పలువురు ఇందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ విషయం విద్యార్థినులకు తెలియడంతో కొంత మంది తమ తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో పీఈటీ అబ్దుర్ రెహమాన్ శిక్షణ ప్రారంభించారు.
మహిళా దినోత్సవం రోజునే..
పాఠశాలలో 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే సెయింట్ మాజ్ స్కూల్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో విద్యార్థినులకు శిక్షణ ప్రారంభించారు. మొదట్లో ప్రాథమిక తరగతుల పిల్లలకు ఆ తర్వాత 10వ తరగతి చదివే అమ్మాయిలకు శిక్షణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ స్కూల్‌లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ పీరియడ్‌నే కేటాయించారు. సెయింట్ మాజ్ స్కూల్‌లో 15 ఏళ్ల క్రితం అమ్మాయిల కోసం ప్రాంభమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రస్తుతం పాతబాస్తీలోని చాలా పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన పలువురు యువతులు శిక్షకులుగా కూడా పనిచేస్తున్నారు. అమ్మాయిల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ దేశంలోనే తొలిసారిగా మాజ్ స్కూల్‌లో ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు.
మంచి స్పందన వస్తోంది..
మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడానికి బాలికల తల్లిదండ్రుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. మా స్కూల్‌లో శిక్షణ పొందిన అమ్మాయిలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలుస్తుండటం ఎంతో గర్వకారణం. – ముహమ్మద్ ఇద్రీస్ అలీ,సెయింట్ మాజ్ స్కూల్ నిర్వాహకుడు
వహ్వా.. ఫరీహా..!
ఈ యువతి పేరు ఫరీహా తఫీమ్. బాలికలపై, యువతులపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను టీవీలో చూసి మనసు చలించిపోయింది. తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలి అని ఆలోచించింది. స్వీయరక్షణకు దారులు వెతికింది. ఏడో తరగతిలో ఉండగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటానని తల్లిదండ్రులతో పోరు పెట్టింది. వారు ససేమిరా అన్నారు. అయినా ఆమె తన పట్టు వీడలేదు. అమ్మాయిల ఆత్మరక్షణపై వారికి ఎంతో వివరించింది. దీంతో వారే సరేనన్నారు. ఇంకేముంది మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం విక్టోరియా మైదానంలో 50 మందికి శిక్షణ ఇస్తూ పలువురి చేత శెభాష్ అనిపించుకుంటోంది. స్వీయరక్షణకు ప్రాధాన్యమిచ్చి కరాటే, మార్షల్ ఆర్ట్స్ తదితర విద్యలు నేర్చుకోవాలని ఫరీహా తఫీమ్ సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment