సాక్షి,సిటీబ్యూరో: మహానగర జనాభా దాదాపు కోటికి పైనే ఉంది. ఇంతమందికి సేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీలో మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలోని ముఖ్య విభాగాల్లో వారు సేవలందిస్తున్నారు. వీరిలో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో పాటు ఇంజినీర్లు ఉన్నారు. నగరంలో అన్ని పనులూ జరిగేది సర్కిళ్ల పరిధిలోనే. ప్రజలకు ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులైనా సర్కిల్ స్థాయిలోని డిప్యూటీ కమిషనర్లే (డీఎంసీ) పరిష్కరిస్తారు. ఇళ్ల నుంచి చెత్త తీసుకెళ్లకపోవడం, వీధిలోని చెత్త, రోడ్లు, డ్రైనేజీ, ఆస్తిపన్ను సమస్యలు అన్నీ పరిష్కరించేది వీరే.. ఈ సేవలతో పాటు వృద్ధులకు అందాల్సిన సేవలు పర్యవేక్షించేదీ వారే. వీటితో పాటు జీహెచ్‌ఎంసీ చేపట్టే వివిధ కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాలు, ఎన్జీఓలను భాగస్వాములను చేస్తూ విజయవంతం చేయాల్సిందీ వీరే. ఓటరు జాబితాలో పేరు లేకున్నా ప్రజలు ఫిర్యాదు చేసేది వీరికే. ఇంతటి బాధ్యతలున్న డిప్యూటీ కమిషనర్లలో ఏడుగురు మహిళలే. సంతోష్‌నగర్ సర్కిల్ డీఎంసీగా ఎ.మంగతాయారు, చార్మినార్‌కు సరళమ్మ, గోషామహల్ కు రిచాగుప్తా, ఖైరతాబాద్‌కు గీతారాధిక, ముషీరాబాద్‌కు ఉమాప్రకాశ్, బేగంపేటకు నళిని పద్మావతి, మూసాపేటకు వి.మమత డీఎంసీలుగా సేవలు అందిస్తున్నారు. సర్కిళ్ల స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు జోనల్ కమిషనర్లు, కమిషనర్ నిర్వహించే వివిధ సమావేశాలకు హాజరు కావాల్సిన వీరికి ఖాళీ అంటూ ఉండదు.
ఇక జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్లలో నగరంలోనే ఎంతో ప్రాధాన్యమున్న, సంపన్న ప్రాంతమైన, రియల్ రంగం జోరున్న, ఐటీ ఉద్యోగులెక్కువగా ఉన్న శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందన విధులు నిర్వహిస్తున్నారు. జోనల్ స్థాయిలోని సాధారణ సమస్యలతో పాటు నగరవ్యాప్తంగా ఉపకరించే కొత్త కొత్త స్కీంలను రూపొందించడం ద్వారా ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ’(సీఎస్సార్) ద్వారా ఆయా పథకాలకు నిధుల సేకరణ, జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్‌గాను అదనపు బాధ్యతలు అందిస్తున్నారీమె. నగరంలో శునకాలకు ఓ ప్రత్యేక పార్కు ఉండాలని, ఆకలిగొన్న వారిని ఆదుకునేందుకు ‘ఫుడ్ ఫర్ ద నీడ్’ వంటి పథకాలు హరిచందన ఆలోచనల్లో నుంచి కార్యరూపం దాల్చినవే. ఎన్నికల ‘స్వీప్’ నోడల్ అధికారిగా వ్యవహరించిన ఈమె దివ్యాంగుల కోసం ‘వాదా’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి దివ్యాంగుల పోలింగ్ శాతం పెరిగేందుకు కృషి చేశారు. జీహెచ్‌ఎంసీ అడిషినల్ కమిషనర్ (యూసీడీ)గా ఉన్న ఆమ్రపాలి కాటా చీఫ్ జాయింట్ ఎలక్షన్ కమిషనర్‌గానూ సేవలందిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీలో వివిధ విభాగాల నిర్వహణ ఒక ఎత్తు. పారిశుధ్యం బాధ్యతలు నిర్వహించడం మరో ఎత్తు. అంతటి కీలకమైన పారిశుధ్యంతో పాటు రవాణా, ఎంటమాలజీ, చెత్త నుంచి విద్యుత్, సీ అండ్ డీ వేస్ట్ తదితర విభాగాల బాధ్యతలు మరో ఐఏఎస్ అధికారి శ్రుతిఓజా తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలోని దాదాపు ఏడువేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన పరిపాలన విభాగం బాధ్యతలు నిర్వహించే అడిషనల్ కమిషనర్(పరిపాలన)గా విజయలక్ష్మి, జాయింట్ కమిషనర్‌గా సరోజ, ఎస్టేట్స్ ఆఫీసర్‌గా శైలజ విధులు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల విభాగంలో కీలకం..
ఎన్నికల విధులు అన్ని జిల్లాల్లో ఒక ఎత్తు. హైదరాబాద్ మహానగరంలో ఒక ఎత్తు. వందల మంది వీఐపీలతో పాటు అన్ని పార్టీల ముఖ్యనేతలు ఉండే నగరంలో ఓటర్ల జాబితా ఫిర్యాదుల పరంపరకు కొదవే లేదు. జాబితాలో పేర్ల గల్లంతు నుంచి మొదలు డూప్లికేట్ ఓటర్ల వరకు నిత్యం ఫిర్యాదులే. దీంతో పాటు హైకోర్టు కేసులు తదితరమైనవి సరేసరి. ఎంతో పనిఒత్తిడి ఉన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్‌గా ఎస్.పంకజ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించే ఎన్నికల సమావేశాల సమన్వయం, సీఈఓ కార్యాలయం నుంచి అందే ఆదేశాల అమలు, హైదరాబాద్ జిల్లాలోని అందరు ఎన్నికల అధికారులతో సమన్వయం, వారి సందేహాల నివృత్తి, ఎప్పటికప్పుడు పూర్తిచేయాల్సిన పనులు, ఓటర్ల జాబితాలు.. సవరణలు.. ప్రస్తుత ఎన్నికల తరుణంలో నిత్యం పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఈ విభాగం జాయింట్ కమిషనర్‌గా పంకజ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
బిల్లుల చెల్లింపులోనూ..
కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన జీహెచ్‌ఎంసీలో ప్రతి పనికీ, ప్రతి కాంట్రాక్టర్‌కూ బిల్లుల చెల్లింపుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా భారీగా లెక్కలు తారుమారవుతాయి. బిల్లుల లెక్కలు, చెల్లింపులు పక్కాగా పర్యవేక్షించాల్సిన చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్‌గా సీహెచ్ ద్రాక్షామణి ఉన్నారు.
ఇంజినీరింగ్ విభాగంలో..
జీహెచ్‌ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ సరోజారాణి, ఐదుగురు ఈఈలు సహా దాదాపు 160 మంది మహిళా ఇంజినీర్లు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులతో పాటు మెయింటనెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఐటీ విభాగం చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా శ్వేత కొనసాగుతున్నారు. జీహెచ్‌ఎంసీకి వివిధ యాప్‌ల రూపకల్పన, ఈ–ఆఫీస్ తదితర విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలో ఆరుగురు మహిళా డాక్టర్లు ఏఎంఓహెచ్‌లుగా సేవలందిస్తున్నారు. ఇలా జీహెచ్‌ఎంసీలోని పలు కీలకవిభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
మేడ్చల్‌లో మహిళా శక్తి
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మహిళలకు ప్రముఖ స్థానం ఉంది. అన్నీ రంగాల్లో పురుషుల కంటే తామేమి తక్కువేమీ కాదని అధికార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లాలో 12 మంది మహిళలు జిల్లా అధికారుల స్థాయిలో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. సీపీఓగా సౌమ్యారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారిగా విజయకుమారి, ఐసీడీఎస్ అధికారిగా స్వరూపరాణి, మైనార్టీ జిల్లా అధికారిగా విజయకుమారి, పౌరసంబంధాల శాఖ డీడీగా సరస్వతి, భూగర్భజల వనరుల అధికారిగా రేవతి, ఇరిగేషన్ జిల్లా అధికారిగా మంజుల, జిల్లా ఉపాధి కల్పనాశాఖ అధికారిగా నిర్మల, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారిగా జ్యోతి, సివిల్ సప్‌లై జిల్లా మేనేజర్‌గా సరితారాణి, డీఎస్‌ఓగా పద్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఈశ్వరి, కలెక్టరేట్ ఏఓగా విజయలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, జిల్లాలోని మొత్తం 14 మండలాల్లో ఏడింటికి తహసీల్దార్లుగా మహిళా అధికారులే ఉన్నారు. జిల్లాలో ఐదుగురు ఎంపీడీఓలకు ఐదుగురు మహిళా అధికారులే ఉన్నారు. ఘట్కేసర్ ఎంపీడీఓగా అరుణ, శామీర్‌పేట్ ఎంపీడీఓగా జ్యోతి, మేడ్చల్ ఎంపీడీఓగా పద్మ, కీసర ఎంపీడీఓగా శశిరేఖ విధులు నిర్వహిస్తూనే... కుత్బుల్లాపూర్ మండల ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment