సాక్షి,సిటీబ్యూరో: లైంగిక దాడికి గురైన వారిని సంఘటితం చేయడంతో పాటు మానవ మృగాల దాడి నుంచి తమను తాము కాపాడుకునేందుకే ‘వార్’ ‘వార్’ (వి ఆర్ యాక్ట్ ఎగైనెస్ట్ ఫర్ రేప్) ప్రారంభించాం. మైక్రోబయాలజీ స్టూడెంట్ అయిన నేను మరి కొందరు విద్యార్ధులతో కలిసి ఉద్యమించా. దేశవ్యాప్తంగా ‘నిర్భయ’ వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న 2012 రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా ‘వార్’ ను ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది కాలేజీల్లో విద్యార్థినీ విద్యార్థులను సంఘటితం చేసి వారిలో చైతన్యం పెంపొందించి ఆత్మరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. అత్యాచారానికి గురైన బాధిత అమ్మాయిలను కలిసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం, జీవితం పట్ల ఒక బలమైన భరోసాను అందజేయడం మా విధి.
హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లి అత్యాచార బాధితులకు అండగా నిలిచాం. నిజానికి ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఆకస్మాత్తుగా ఒంటరివాళ్లవుతారు. జీవితం ముగినట్లేనని భావిస్తారు. కానీ అలాంటి సమయంలో ‘మనమంతా ఒక్కటేననే’ స్ఫూర్తిని వాళ్లకు అందజేయడం వల్ల చక్కటి ఫలితాలు వచ్చాయి. చాలా మంది అమ్మాయిలు తిరిగి కెరీర్ ప్రారంభించారు.. చదువుకున్నారు. ఉద్యోగాల్లో చేరారు.ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి బయటకు వచ్చారు. కొద్ది మంది విద్యార్ధులం కలిసి ప్రారంభించిన వార్ ఎంతోమందికి ఓదార్పుగా, బాసటగా నిలిచింది. జీవితానికి బలమైన ఆయుధాన్ని అందజేసింది. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. అత్యాచారం అనేది ఒక యాక్సిడెంట్ లాంటిది. ప్రతి గాయానికీ చికిత్స ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment