సాక్షి, సిటీబ్యూరో: మహిళా సాధికారత అన్ని విషయాల్లోనూ ప్రతిబింబించాలి. ఆహార్యం నుంచి మొదలుకుని నిర్ణయాధికారం, స్వతంత్ర ఆలోచన ప్రస్ఫుటంగా కనిపించాలి. నేటి యువతుల్లో ముఖ్యంగా దుస్తులు, అలంకరణ విషయంలో ఎంత వరకు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై నగరంలో ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలు ఇలా ఉన్నాయి.
♦ 20– 25 ఏళ్ల యువతులతో సర్వే సాగింది. వీరిలో విద్యార్థులు, ఉద్యోగినులు, వివాహితలున్నారు
♦ దుస్తులు, అలంకరణ వస్తువుల కొనుగోలు కోసం 75 శాతం యువతులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపైనే ఆధారపడి ఉండగా.. వీటి ఎంపిక విషయంలోనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు 50 శాతం మంది స్పష్టంచేశారు.
♦ 50 శాతం మంది సంప్రదాయ దుస్తులు ఇష్టం అని చెప్పారు. మిగతా వారు పాశ్చ్యాత్య, క్యాజువల్, మోడ్రన్ దుస్తులు ఇష్టమని తెలిపారు.
♦ తమకు నచ్చిన దుస్తులు ధరించడంలో కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారు అనే ప్రశ్నకు 90 శాతం మంది పాజిటివ్ కామెంట్స్ చేశారు. వీరిలో 20 శాతం మంది తమ భర్త నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయని తెలిపారు. 15శాతం మంది తమ సోదరుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని, మరో 5 శాతం మంది కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని తెలిపారు. ఇందులో కేవలం 4శాతం మంది మాత్రమే తమ వస్త్రధారణ విషయంలో ఎవరి అభిప్రాయాలనూ ఖాతరు చేయమన్నారు.
♦ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరిస్తారు.. ఎవరి సలహాలు తీసుకుంటారు..? అనే ప్రశ్నకు 20శాతం మంది తమకు నచ్చినట్లు డ్రెస్ చేసుకుంటామని తెలిపారు. 80శాతం మంది సంప్రదాయ దుస్తులు ధరిస్తామని తెలిపారు.
♦ మిత్రులతో బయటకు వెళ్తున్నప్పుడు 30 శాతం మంది మోడ్రన్‌గా తయారవుతామని, 25 శాతం మంది తమకు నచ్చినట్లు తయారవుతామని చెప్పారు. మిగతా వారు అన్నిరకాల సంప్రదాయ వస్త్రధారణను ఇష్టపడతామని పేర్కొన్నారు.
♦ జుట్టు కత్తిరింపు, జుట్టు స్టైల్ గురించి ఎవరి అనుమతైనా తీసుకుంటారా అనే ప్రశ్నకు 60 శాతం అవుననే చెప్పారు. 10శాతం మంది తమకు జుట్టు కట్ చేసుకోవటం ఇష్టం ఉండదని చెప్పగా, 30 శాతం మంది మాత్రమే ఎవరి అనుమతీ అవసరం లేదన్నారు.
♦ సర్వేలో మొత్తంగా తేలిందేమిటంటే.. వస్త్రధారణ, అలంకరణ విషయాల్లోనగర యువతులు పూర్తి స్వతంత్రంగా లేరని.. కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని..
Comments
Please login to add a commentAdd a comment