మెట్రో లోకోపైలెట్ శ్యామల
సాక్షి, సిటీబ్యూరో :సాహసమే శ్వాసగా.. ఆశయమే ఊపిరిగా లక్ష్య సాధనలో ఎదురైన సవాళ్లు, ప్రతిసవాళ్లను సమర్థంగా ఎదుర్కొని అమ్మాయిలు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోవాలి. ఆడపిల్లలు వంటింటి కుందేలు కాదు... ప్రయత్నిస్తే, సాహసం చేస్తే వారితో కాని పని ఏదీ ఉండదు. పురుషులకు ధీటుగా ఏదైనా సాధించే సత్తా అమ్మాయిల సొంతం. అవకాశాలు ఎవరో ఇస్తారని, ఏదో చేస్తారని ఆశపడడం కంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిలిచి గెలిచి సాధించడమే ధీరవనితల లక్షణం.
చుట్టూ ఉన్న చీకట్లను తిట్టుకునే కంటే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం, లక్ష్యసాధనలో ఓసారి విఫలమైనా, పలుమార్లు ప్రయత్నించడమే నేటి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన జీవిత పాఠం. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ నాపట్ల వివక్ష చూపలేదు. నేను చదవాలనుకున్న కోర్సులో చేర్పించారు. ఇక మెట్రోలో లోకో పైలెట్‌గా ఎంపికై జాబ్‌లో జాయిన్ అవుతానన్నా ఓకే అన్నారు. ఎక్కడా నో చెప్పలేదు. నా సక్సెస్‌లో నా తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. చిన్నప్పటి నుంచి వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే అంచెలంచెలుగా ఎదిగాను. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే నాకు ఇష్టం. డేరింగ్, డాషింగ్ స్పిరిట్‌తో సాగిపోతూ లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలన్నదే నా ఫిలాసఫి. నేను అమ్మాయిలకు ఇచ్చే సందేశం ఇదే.
నేనూ బాధితురాలినే... ప్రొఫెసర్ కె.సర్వమంగళగౌరి
పని ఏదైనా పనే. ఇది మగవాళ్ల పని, అది ఆడవాళ్ల పని అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. నిజానికి ఈ పని విభజనతోనే మహిళలపై వివక్ష మొదలవుతోంది. పురుషులు, మహిళలు ఇద్దరూ సమానమేననే భావన నేటితరం పిల్లల్లో కల్పించినప్పుడే ఆడవాళ్లకు గౌరవం దక్కుతుంది. సాటి మహిళగా నేనూ కొన్ని సందర్భాల్లో వివక్ష ఎదుర్కొన్నాను. సమస్యఎదురైనప్పుడు సాహసంతో ఎదుర్కోవాలే గానీ.. చతికిలపడకూడదనే సత్యాన్ని బోధించిన మా నాన్న కాశీసోమయాజుల సుబ్రమణ్యం ఇచ్చిన స్ఫూరి ్తతో వివక్షను ఎదుర్కొన్నాను. ధైర్యంగా నలుగురి ముందు నిలబడగలిగాను. ఇప్పటికీ ఇండిపెండెంట్‌గా బతకడానికే ఇష్టపడుతుంటాను.
బాస్‌తో గొడవ
మాది గుంటూరు. అక్కడే చదివాను. మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేశాను. ఆ తర్వాత 1986–2013 వరకు ఏపీ స్టడీ సెంటర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌లోనూ పని చేశాను. స్టడీ సర్కిల్‌లో పనిచేస్తున్న సమయం లోనే ఓసారి వివక్ష విషయంలోనే మా బాస్‌తో గొడవైంది. అప్పట్లో ఆయనపై ఫిర్యాదు కూడా చేశాను. ధైర్యంగా సమస్యను దుర్కొన్నాను. ఈ వివక్ష పోవాలంటే ముందు పని విభజన పోవాలి. అప్పుడే మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఆడపిల్లలకు ప్రస్తుతం చాలా స్వేచ్ఛ ఉంది. కానీ కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు వివరించాలి. మహిళలు అనుకుంటే సాధించనిది అంటూ ఏమీ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment