బాలికలకు 50 ఏళ్లు నిండినవారే చెప్పాలంట!
గుర్గావ్: ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు అక్కడక్కడ విద్యార్థినుల విషయంలో తప్పులు చేస్తున్నారంటే విన్నాంగానీ.. ఉపాధ్యాయులు నిజంగానే వారిపట్ల తప్పులు చేస్తారనే గట్టి నమ్మకంలో హర్యానా ప్రభుత్వం మునిగినట్లుందని తెలుస్తోంది. ఎవరికీ లేని కొత్త ఆలోచనను పుట్టిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో బదిలీలు ఉంటాయి. ఈ బదిలీల విషయంలో కొన్ని నిబంధనలు ఉండటం సహజంగానీ, ఇంత వయసు ఉన్నవాళ్లనే ఫలానా స్కూళ్లకు పంపించాలన్న నిబంధన ఎక్కడా లేదు. కానీ, హర్యానా ప్రభుత్వం మాత్రం ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంది.
అదేంటంటే, 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని బాలికల మాధ్యమిక పాఠశాలలకు పంపించేది లేదంట. 50 ఏళ్ల పై బడిన వారు మాత్రమే మాధ్యమిక పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు అర్హులు అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అది 2016-17నుంచి అమలు కానుందని స్పష్టం చేసింది. వారు పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం 2016 జూన్ 30లోపు 50 ఏళ్లు నిండిన వారు మాత్రమే బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీ చేసేందుకు అర్హులు అంట.
ఈ నిర్ణయం పట్ల అక్కడ ఉపాధ్యాయులంతా అవాక్కయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపట్ల పెద్ద మొత్తంలో విమర్శలు కూడా వెల్లు వెత్తుతున్నాయి. ’హార్యానా విద్యాశాఖమంత్రి రామ్ బిలాస్ శర్మ ఒక ప్రకటన విడుదల చేస్తూ ’ఏ ఉపాధ్యాయుడు గత జూన్ 30నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకోడో అతడికి బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీ వెళ్లే అర్హత లేదు. ఒక వేళ అతడు అలాంటి పాఠశాలను ఎంచుకున్నా అనుమతించబోం’ అని పేర్కొన్నారు.