మరుగుదొడ్ల పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయిస్తున్న దృశ్యం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మైదానాన్ని చదును చేయించిన ఎస్‌ఐ
సుండుపల్లి: శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసే సుండుపల్లి ఎస్‌ఐ నరసింహారెడ్డి సమాజ సేవకు పాటుపడుతున్నారు. కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని దత్తత తీసుకుని.. పాఠశాలలో వసతుల కల్పనకు తోడ్పడుతున్నారు.
♦ కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని ఎస్‌ఐ జూన్ నెలలో దత్తత తీసుకున్నారు. ఓ పక్క విధులు నిర్వహిస్తూ.. పాఠశాల అభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. 200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల కోసం ఆవరణంలో 5 ఎకరాల్లో ఉన్న గుట్టలను జేసీబీ సాయంతో తొలగించి క్రీడలు ఆడుకునేందుకు చక్కటి మైదానం ఏర్పాటు చేశారు. కొంతభాగంలో పచ్చని తోటలాగా ఏర్పాటు చేశారు.
♦ మైదానంలో రాత్రిపూట చదువు కునేందుకు వీలుగా ఏడు విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి కాంతివంతమైన లైట్లను అమర్చారు. విద్యార్థుల వంట కోసం, స్నానాల కోసం, బట్టలు ఉతికేందుకు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిసి బోరు వేయించారు. బోరు విఫలమైనా వెనక్కు తగ్గలేదు. మరోబోరు వేయించారు. దీంతో నీటి సమస్య తీరింది. వారానికి ఒకసారి ట్యాంకర్ ద్వారా వచ్చే నీటితో ఇబ్బందులు పడే విద్యార్థినులకు ఇక నీటి సమస్య తీరింది.
♦ దుస్తులు ఉతికేందుకు దోబీగాట్ ఏర్పాటు చేయించారు. తరగతి గదుల్లో బేంచీలకు మరమ్మతులు చేయించారు. మురుగునీరు బయటకు వెళ్లేందుకు కొత్త పైపులైను.. టాయ్‌లెట్లల్లో పింగానీలు, స్నానపుగదుల్లో టైల్స్ ఏర్పాటు చేయించారు.
ఆహ్లాదకరంగా ఉంది
మా పాఠశాలను ఎస్‌ఐ నరసింహారెడ్డి సారు దత్తత తీసుకున్నప్పటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పించారు. గతంలో స్కూల్లో చదువుకోవాలన్నా చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. – అవని, 9వ తరగతి
విద్యాభివృద్ధికి సహకారం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి సహకారం అందిస్తున్నా. రాయలసీమ ఐజీ ఇచ్చిన సూచన మేరకు ఈ పాఠశాలను దత్తత తీసుకున్నా. కస్తూర్బా పాఠశాలలో వసతులు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా. జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయితీని దత్తత తీసుకుని సిమెంటు రోడ్డు ఏర్పాటుకు, మరుగుదొడ్లపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా. – నరసింహారెడ్డి, ఎస్‌ఐ, సుండుపల్లి
Comments
Please login to add a commentAdd a comment