సర్కారీ స్కూళ్లలో టాయిలెట్లు లేక బాలికల ఇక్కట్లు
రాష్ట్రంలో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్న స్కూళ్లు 48 శాతమే
కర్ణాటకలో 97 శాతం స్కూళ్లలో వేర్వేరుగా టాయిలెట్లు
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు.. 78,450. అందులో బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్న స్కూళ్లు కేవలం 37,997. అంటే కేవలం 48 శాతం! కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలు.. 50,257. అందులో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సదుపాయం ఉన్నవి 49,185. అంటే 97 శాతం!! డిపెప్, సర్వశిక్షా అభియాన్, విద్యాహక్కు చట్టం.. ఇలా అనేక పథకాల పేరుతో ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా మన రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లేమితో ఏటా నాలుగైదు కోట్లు కుమ్మరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. టాయిలెట్లే కాదు.. అనేక స్కూళ్లలో తాగునీటి సౌకర్యం కూడా లేదు. రాష్ట్రంలో 78,450 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.. అందులో 22,026 స్కూళ్లలో (28.08 శాతం) బాలబాలికలకు ఉమ్మడి టాయిలెట్లు ఉన్నాయని, కేవలం 37,997 (48.43 శాతం) స్కూళ్లలోనే వారికి వేర్వేరుగా టాయిలెట్ సదుపాయం ఉందని స్వయంగా విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన గణాంకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఉన్న టాయిలెట్లలో కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి.
కొన్నింటికి నీటి సదుపాయం లేకపోగా, మరికొన్ని నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. టాయిలెట్ల ఏర్పాటుకు విద్యాశాఖ నిధులు ఇస్తున్నా.. వాటి నిర్వహణకు పక్కా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. దీంతో నిర్మించిన టాయిలెట్లు కూడా చెత్తా చెదారంతో నిండిపోయి కొన్నాళ్లకు శిథిలమైపోతున్నాయి. 66,989 పాఠశాలల్లో (85.39 శాతం) తాగునీటి సదుపాయం ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతోంది కానీ క్షేత్రస్థాయిలో ఉపయోగకరంగా ఉన్నవి తక్కువే. టీచర్ల కొరత సమస్య కూడా తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 15,892 పోస్టులు ఖాళీగా ఉండగా, సర్వశిక్షా అభియాన్ పరిధిలో 11,787 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో బోధనలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో చెత్తా చెదారం పడకుండా కిచెన్ షెడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వమే వందల కోట్ల రూపాయలు ఇచ్చినా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సద్వినియోగపరచుకోలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు సరిపోవనే సాకుతో వాటి నిర్మాణాలను గాలికొదిలేసింది. రాష్ట్రం తరపున కొంత మొత్తం కేటాయించి పూర్తి చేయాలన్న ధ్యాస లేకపోవడంతో 40 వేల కిచెన్ షెడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు.