సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చమురు సంస్థల నిబంధనలను పాతరేస్తున్నాయి. బంకుల్లో సౌకర్యాల కల్పనలో విఫలమవుతున్నాయి. వాహనదారులకు ఇంధనం తప్ప ఇతర సేవలు అందని ద్రాక్షగానే మారాయి. బంకులకు వచ్చిన వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయడమే కాదు.. వాటికి ఉచితంగా గాలి, వాహనదారులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కచ్చితంగా కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత పరీక్ష పరికరాలను అందుబాటులో ఉంచాలి. ఎండ, వానల నుంచి రక్షణకు తగిన నీడ వసతి కల్పించాలి. కానీ.. ఇవేవీ పెట్రోల్ బంకుల్లో కనిపించడంలేదు.
వీటి పట్టింపేలేదు..
పెట్రో బంకులకు మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ, అగ్ని ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవడానికి అనువుగా ఉండాలి. బకెట్‌లలో ఇసుక. సమీపంలో నీరు అందుబాటులో ఉండాలి. మరోవైపు ప్రథమ చికిత్స పెట్టెలు అత్యవసరం. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయాల్లో వాటిని ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ యాజమాన్యం వద్ద తప్పకుండా ఉండాలి. బంకుల వద్ద విద్యుత్ తీగలు, హైటెన్షన్ తీగలు లేకుండా చూసుకోవాలి. పొగ తాగరాదు అనే బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఇవేవీ మచ్చుకైనా కనిపించడం లేదు.
కనిపించని నాణ్యత పరిశీలన..
పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరిశీలన కనిపించడం లేదు. ఇంధన నాణ్యతను పరీక్షించేందుకు హైడ్రో ధర్మా మీటర్లు అందుబాటులో లేకుండాపోయాయి. బంకుల్లో కనీసం 20 లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల డీజిల్ నిల్వ నిరంతరం ఉండాలి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, పోలీసులకు, వికలాంగులకు ఇంధనం లేదనకుండా పోయాలి. హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, ఐదు లీటర్ల క్యాన్ అందుబాటులో ఉండాలి. వినియోగదారులు అడిగిన సమయంలో వెంటనే వీటిని అందజేయాల్సి ఉంటుంది. పెట్రోల్‌లో హైడ్రోమీటర్ పెట్టినప్పుడు సాంద్రత 700–760 మధ్యలో , డీజిల్ 800–860 చూపితే నాణ్యమైనది. కొలతల్లో అనుమానం ఉంటే క్యాన్‌లో పోయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కానీ దానిని పెట్రో బంకుల యాజమానులు మాత్రం అనుమతించడం లేదు.
వినియోగదారులుఇలా తెలుసుకోవచ్చు..
ఇంధనం నాణ్యతను పరీక్షించే అధికారం వినియోగదారులకు ఉంటుంది. అందుకు సంబంధించిన కిట్‌లను వారు కోరినప్పుడు బంక్ సిబ్బంది అందించాలి. కిట్‌లు అందుబాటులో లేకపోయినా, వాటిని ఇవ్వడానికి వెనుకాడినా మోసం జరుగుతుందని గ్రహించాలి. కల్తీ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఫిల్టర్ పేపర్‌పై ఒక్క చుక్క ఇంధనం వేస్తే పది సెకన్లలో ఆవిరి అయిపోతుంది. ఆరిన తర్వాత పేపర్ప మరక కనిపించకూడదు. మరక కనిపిస్తే కల్తీ జరిగినట్లు గ్రహించాలి. హైడ్రో మీటర్ల ద్వారా కూడా నాణ్యత తెలుసుకోవచ్చు.
నగరంలో 49 లక్షల వాహనాలు..
గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 49 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలు కలిపి సుమారు 20 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 460 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment