సర్కార్ బడుల్లో సమస్యల తిష్ట | bath room probloms in government schools | Sakshi
Sakshi News home page

సర్కార్ బడుల్లో సమస్యల తిష్ట

Published Sat, Jun 11 2016 2:36 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

సర్కార్ బడుల్లో సమస్యల తిష్ట - Sakshi

సర్కార్ బడుల్లో సమస్యల తిష్ట

కానరాని మరుగుదొడ్లు
ఉన్నా.. నీటి సౌకర్యం సున్నా
తాగునీళ్లూ కరువే

 సర్కార్ బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు ఉన్న చోట నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. నారాయణఖేడ్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నతపాఠశాలలో 700 మంది విద్యార్థినులకు గాను మూడే మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంటర్వెల్ సమయంలో టాయిలెట్ల వద్ద బారులు తీరాల్సి వస్తుందంటే వసతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  ముఖ్యంగా తాగునీటి సౌకర్యం లేకపోవటంతో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది.  జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,899 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1260 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేదు.  ప్రభుత్వ పాఠశాలల్లో 3.5 లక్షలపైచిలుకు విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యార్థుల అవసరాలకు మేర మూత్రశాలలు లేవు. దీంతో ఆరుబయట మూత్రవిసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవటం విద్యార్థుల డ్రాపౌట్స్‌కు దారితీస్తోంది.    - సాక్షి, సంగారెడ్డి

ఆరుబయటకే...
నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, వెల్దుర్తి, శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి, కొల్చారం మండలాల్లోని సగానికి సగం పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఈ ఏడాది బడికి వచ్చే పిల్లలు అవస్థలకు పడక తప్పని పరిస్థితి నెలకొంది. నీటి సమస్య కారణంగా చాలావరకు వినియోగంలో లేకుండా పోయాయి. శిథిలమైనా మరమ్మతులకు నోచుకోవడం లేదు. తండాల్లోనైతే మరుగుదొడ్లు అసలే లేవు. అంతా ఆరుబయటకే వెళ్తున్నారు.  - నర్సాపూర్

తాళాలే..
నియోజకవర్గంలో 304 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 50 వేల పైచిలుకు విద్యార్థులు చదువుతున్నారు. గత ఏడాది సుప్రీం కోర్టు హెచ్చరికతో ఆర్వీఎం ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లులేక ఇబ్బందులు తప్పడం లేదు. సగానికిపైగా పాఠశాలల్లో నీటి వసతిలేక నిరుపయోగంగా మారాయి. నీటి వసతిలేని అనేక మరుగుదొడ్లుకు ఉపాధ్యాయులు తాళాలు వేశారు. చిన్నశంకరంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో 600 పైచిలుకు విద్యార్థులు ఉండగా, సగానికిపైగా బాలికలు చదుతున్నారు. వీరందరికి కలిపి ఒకే టాయిలెట్ ఉండటంతో దాని ఎదుట విద్యార్థులు గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి.
- మెదక్

శిథిలం...
జహీరాబాద్, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గల మరుగుదొడ్లు, మూత్రశాలలు నీళ్లు లేక నిరుయోగంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పట్లో హడావిడి చేసిన అధికారులు ఆ తరువాత చేతులెత్తేశారు. జహీరాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 900 మందికిగాను మరుగుదొడ్లు మూడు మాత్రమే ఉండగా అందులో రెండే వినియోగంలో ఉన్నాయి. నీటి వసతి లేకపోవడంతో నిర్వహణ అధ్వానంగా మారింది. - జహీరాబాద్

నీళ్లు లేక సమస్య..
సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫలితంగా మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దుర్వాసన వస్తోంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో అరబిందో వంటి సంస్థల సహకారంతో సిద్దిపేటలో అత్యాధునికంగా నిర్మించిన మరుగుదొడ్లు నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచాయి. అయితే మౌలిక వసతుల కల్పనలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఈ ఏడాదైనా నీటి వసతి కల్పించి మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.    - సిద్దిపేట జోన్

కంపు కంపు...
దుబ్బాక మండలంలో మండలంలో 18 ఉన్నత, 12 ప్రాథమికోన్నత, 43 ప్రాథమిక పాఠశాలలు 43 ఉన్నాయి. దాదాపు అన్ని పాఠశాలల ఆవరణలో బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మూత్ర శాలలు నిర్మించినా నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని నిర్మించక పోవడం సమస్యగా మారింది. మిరుదొడ్డి మండలంలోనే అదే పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, మూత్రశాలల వినియోగించిన తర్వాత శుభ్రం చేయడానికి నీటి సరఫరా లేక కంపు కొడుతున్నాయి. మిరుదొడ్డిలో సకల హంగులతో మోడ ల్ స్కూల్ నిర్మించినా వసతులు లేక విద్యార్థులు ఆరు బయటకు వెళ్తున్నారు.
- దుబ్బాక/మిరుదొడ్డి

సీఎం ఇలాకాలోనూ అంతే...
సీఎం సొంత నియోజకవర్గంలోనూ మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిగ్గా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. లేని చోట అసలే లేవు. ఉన్న చోట నీటి కొరత ఏర్పడింది. ఫలితంగా నిరుపయోగంగా మారిం ది. మరికొన్ని చోట్ల నిర్వహణ సరిగా లేక అస్తవ్యస్తంగా ఉంది. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. - గజ్వేల్

బడి ఒకచోట.. మరుగుదొడ్డి మరోచోట..
అందోలు నియోజకవర్గంలోని అందోలు, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాల్లో మొత్తం 342 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఒకటి, రెండు శాతం మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి లక్షల రూపాయలు వెచ్చించినా నిరుపయోగంగా ఉన్నాయి. నీటి వసతిలేని ప్రాంతంలో నిర్మించడంతో 80 శాతం మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.అందోల్ మండలం అన్నాసాగర్‌లో బడి ఒకచోట ంటే మరుగుదొడ్డి మరో చోట నిర్మించారు. దాదాపు అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. వినియోగంలో లేక తాళం వేశారు. - జోగిపేట

జిల్లా కేంద్రంలోనూ...
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, న్యూ హైస్కూల్‌లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది.  మండలంలోని పలు పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. గతేడాది బీడీఎల్ యాజమాన్య ఆర్థిక సహకారంతో ఉత్తర్‌పల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, కంది, చెర్యాల్, ఇంద్రకరణ్, కొత్లాపూర్ తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నీటి సరఫరా లేక నిరుపయోగంగా మారాయి. సదాశివపేట, కొండాపూర్ మండలాల్లోనూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
    - సంగారెడ్డి రూరల్/సదాశివపేట/కొండాపూర్

 బాలికలకు ఇబ్బందులు...
నారాయణఖేడ్ మండలంలో 104 పాఠశాలలు ఉండగా ఇందులో 8 పాఠశాలల్లో అసలే మరుగుదొడ్లు లేవు. 56 పాఠశాలలకు నీటివసతి లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు వినియోగంలో లేవు. కల్హేర్ మండలంలో 74 పాఠశాలలకు గాను 32 పాఠశాలల్లో మరుగుదొడ్లు అసలే లేవు. నీటివసతి లేకపోవడంతో మరో 20 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కంగ్టి మండలంలో 67 పాఠశాలలకు ఐదారు పాఠశాలల్లో మినహా ఎక్కడా మరుగుదొడ్ల వినియోగం లేదు. పెద్దశంకరంపేట మండలంలో 13 పాఠశాలల్లో సరైన టాయ్‌లెట్లు లేవు. మనూరు మండలంలో 91 పాఠశాలలకు గాను 13 పాఠశాలల్లో మరుగుదొడ్లు అసలే లేవు. నీటిసౌకర్యంలేకపోవడంతో 12 పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు వినియోగించడంలేదు. 78 పాఠశాలలకు నీటివసతి లేదు. ఫలితంగా ఈ పాఠశాల్లోనూ మరుగుదొడ్లు వినియోగించడంలేదు. దాదాపు అన్ని చోట్ల విద్యార్థులు ఆరుబయటకే వెళ్తున్నారు. బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - నారాయణఖేడ్

మొక్కుబడిగా...
పటాన్‌చెరు, జిన్నారంలోని అత్యధిక పాఠశాలల్లో మరుగుదొడ్లు వాడే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు ప్రతినిధులు కొందరు పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిస్థితిని పరిశీలించి వెళ్లిన తర్వాత కొన్ని పాఠశాలల్లో మూత్ర శాలలకు, మరుగుదొడ్లకు రంగులు పడ్డాయే తప్ప పరిస్థితి మారలేదు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. కొన్ని చోట్ల పైప్‌లైన్లు ఏర్పాటు చేయలేదు. జిన్నారంలోని దాదాపు 30 పాఠశాలల్లో టాయ్‌లెట్లు వాడేందుకు అనువుగా లేవు. - పటాన్‌చెరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement