మెదక్ జిల్లా వర్గల్ మండలం మజీద్‌పల్లి పాఠశాలలో టాయిలెట్లు లేకపోవడంతో బాలికలు ఇలా వెళ్లాల్సిందే!
- సర్కారీ బడుల్లో అధ్వాన పరిస్థితులు
- టాయిలెట్లు లేక విద్యార్థుల అవస్థలు
- సగానికి సగం పాఠశాలల్లో ఇదే దుస్థితి
- నిర్వహణ లేక కంపు కొడుతున్న మరుగుదొడ్లు
- చెట్ల పొదలు, రోడ్డు పక్కన గోడలే దిక్కు
- బాలికల కష్టాలు వర్ణనాతీతం
- సరైన వసతులు లేక మధ్యలో చదువులు మానేస్తున్న వైనం
- అన్ని స్కూళ్లలో టాయిలెట్లు ఉన్నాయని అధికారుల కాకి లెక్కలు
సాక్షి నెట్‌వర్క్: మరుగుదొడ్లు ఉంటే నీళ్లుండవు...! మరుగుదొడ్డి, నీళ్లు ఉంటే.. తలుపులుండవు! టాయిలెట్లు కంపు వాసన కొడుతున్నా ముక్కు మూసుకొని పోవాల్సిందే.. మావల్ల కాదనుకుంటే చెట్ల పొదలను, రోడ్డు పక్కన గోడలను టాయిలెట్లుగా మార్చుకోవాలి. సర్కారీ బడుల్లో ఇదీ పరిస్థితి!! రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య కంటే ఎక్కువగా టాయ్‌లెట్లు ఏర్పాటు చేశామని, అవన్నీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కానీ క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడా ఇక్కడా అని తేడా లేదు. అన్ని జిల్లాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో సగానికి పైగా పాఠశాలల్లో టాయ్‌లెట్లు సరిగా లేవు. టాయిలెట్లు లేని పాఠశాలల్లో బాలికల కష్టాలైతే వర్ణణాతీతం. అత్యవసరమైతే ఇంటికి వెళ్లడమో లేదా పాఠశాలల పక్కన తెలిసిన వారి ఇళ్లకు వెళ్లడమో చేస్తున్నారు.
కేవలం టాయిలెట్ల సౌకర్యం లేకపోవడం వల్లే ఎందరో బాలికలు చదువులకు మధ్యలో స్వస్తి చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య చదువుతున్న విద్యార్థినుల్లో డ్రాపౌట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం టాయ్‌లెట్స్ లేకపోవడమే! ఇక చాలాచోట్ల నిర్వహణ లేక టాయ్‌లెట్లు కంపు కొడుతున్నా పట్టించుకునేవారు లేరు. దుర్గంధం వెదజల్లుతుండడంతో విద్యార్థులు అటు వైపు వెళ్లే పరిస్థితి కూడా లేదు.
కాగితాలపైనే టాయిలెట్లు..
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 80 మంది బాలురకు ఒక టాయ్‌లెట్, 40 మంది బాలికలకు ఒక టాయ్‌లెట్ ఉండాలి. కానీ ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత వీటి నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వ లెక్కలకు, క్షేత్రస్థాయికి పొంతన లేదు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 28,442 ఉంటే.. అందులో ప్రాథమిక 19,776, ప్రాథమికోన్నత 3,362, ఉన్నత పాఠశాలలు 5,304 ఉన్నాయి. వీటన్నిటిలో మొత్తం 36,159 టాయ్‌లెట్లు అందుబాటులో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ వివరిస్తోంది. స్వచ్ఛభారత్ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... పాఠశాల విద్యార్థులు మాత్రం టాయిలెట్లు లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాల్లోనే కాదు రాష్ట్ర రాజధాని నగరంలోనూ అనేక పాఠశాలల్లోనే మరుగుదొడ్ల సౌకర్యం లేదు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
- ఖమ్మం జిల్లాలోని విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే బాలురకు 3,336, బాలికలకు 3,960 టాయ్‌లెట్స్ ఉండాలి. కానీ బాలురకు 1,252, బాలికలకు 615 టాయ్‌లెట్స్ మాత్రమే ఉన్నాయి.
- మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంకా 940 పాఠశాలల్లో మరుగుదొడ్లకు నీటి వసతి సౌకర్యం లేదు. వందలాది పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. ప్రహారీ గోడలు లేకుండా మరుగుదొడ్లు నిర్మించి ఫలితం ఏముంటుందని, వాటిని విద్యార్థులు కాకుండా బయటివారు వినియోగించుకుంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొన్నిచోట్ల వాటిని వినియోగించకుండా తాళాలు వేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే వినియోగిస్తున్నారు.
- ఆదిలాబాద్ జిల్లాలో 3,995 పాఠశాలలు ఉంటే.. అందులో 2,646 పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది. కానీ అనేక చోట్ల మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించలేదు.
- మెదక్ జిల్లాలో 2,910 పాఠశాలలు ఉంటే.. అందులో ప్రతీ పాఠశాలకు రెండేసి టాయ్‌లెట్స్ నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 50 శాతం టాయ్‌లెట్స్‌లో నీటి సౌకర్యం లేకుండా వృథాగా పడి ఉన్నాయి.
- నిజామాబాద్ జిల్లాలో 2,317 పాఠశాలలు ఉంటే.. అందులో 61 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 635 పాఠశాలల్లో నీటి సౌకర్యం లేదు. 767 మరుగుదొడ్లు శిథిలావస్థలో ఉన్నాయి.
- కరీంనగర్ జిల్లాలోని స్కూళ్లలో 70 శాతం మరుగుదొడ్లు వినియోగంలో లేవు. ఇందుకు ప్రధాన కారణం నీటి సమస్యే. జిల్లాలో 2,946 పాఠశాలలు ఉంటే.. వీటిలో 4,830 మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి, కేవలం 2,077 మరుగుదొడ్లకు నీటి సదుపాయం ఉంది.
- రంగారెడ్డి జిల్లాలో 2,290 పాఠశాలలు ఉండగా.. వాటిలో దాదాపు 1,011 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు ఉన్నచోట నిర్వహణ లేదు.
- మెదక్ జిల్లాలో 2,910 పాఠశాలలు ఉండగా.. మొత్తం 5,820 మరుగుదొడ్లు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అందులో సగం మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. నల్లగొండ జిల్లాలోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించడం లేదు.
స్కూళ్లలో టాయిలెట్ల దుస్థితిని మార్చేందుకు ‘సాక్షి’ నడుంబిగించింది. దీనిపై జిల్లా టాబ్లాయిడ్లలో ప్రతిరోజూ కథనాలను ప్రచురించనుంది. మీరూ ముందుకు కదలండి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని కదిలిద్దాం. స్కూళ్లలో సమస్యలను వీడియోలు, ఫొటోల రూపంలో
9010882244 నంబర్‌కు వాట్సప్ ద్వారా పంపండి.