సిరియన్ బాలికలకోసం మలాలా పాఠశాల
లెబనాన్: పాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్.. సిరియన్ శరణార్ధ బాలికల కోసం బెక్కా లోయలో 'మలాలా యూసఫ్ జాయ్ ఆల్ గర్ల్స్ స్కూల్' పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించారు. మలాలా ఫండ్ నిధులను ఈ పాఠశాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. తన 18వ పుట్టిన రోజు వేడుకలను ఆమె సిరియన్ సరిహద్దుల్లో లెబనాన్ వ్యాలీలో ఆదివారం జరుపుకొన్నారు.
బాలికా విద్యకోసం పాటు పడుతున్నమలాలా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. మిలిటరీ ఖర్చులను తగ్గించుకొని , బాలికా విద్యాకోసం పాటుపడాలని ప్రపంచ నాయకులకు విజ్క్షప్తి చేశారు. ప్రపంచం మొత్తంమీద ఎనిమిది రోజులు సైనిక ఖర్చును నిలిపివేస్తే 12 సంవత్సరాలపాటు ఉచిత విద్యను అందించవచ్చన్నారు. ప్రతీ పిల్లవాడికి నాణ్యమైన విద్య చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు.
సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధాన్ని నివారించడంలో ప్రపంచ దేశాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. సిరియా ప్రాంతంలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు చెల్లాచెదరైపోతున్నారనీ, ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా మారిపోతున్నారన్నారు. ఆ ప్రజలను, ముఖ్యంగా పిల్లలను కాపాడడంలో ప్రపంచ దేశాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇది హృదయాలను పిండేసేంత బాధాకరమైన విషయమన్నారు.
సిరియన్ శరణార్థ బాలికలకు తన సంపూర్ణ మద్దతు తెలియచేసిన ఆమె ఇంతమంది ధైర్యవంతుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఇంత విషాదకర పరిస్థితుల్లోనూ, అంతర్యుర్ధం మధ్య పాఠశాలకు వెళుతున్న 2.80 కోట్ల మంది పిల్లల ప్రతినిధిగా ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయని మలాలా కొనియాడారు.