హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రావడం వల్లే సత్య నాదెళ్ల సీఈవో అయ్యారు
వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం
ఇక్కడికి 12 దేశాల నుంచి వచ్చినవారిలో టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు
జ్యూరిచ్‌లో ప్రవాసాంధ్రులతో సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: భారతీయులు ముఖ్యంగా తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ వచ్చిన చంద్రబాబు సోమవారం అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో తాను బిల్‌గేట్స్‌తో మాట్లాడి హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్లే తెలుగువాడైన సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ కంపెనీ సీఈవోగా ఎదిగాడని చెప్పారు.
ఎలివేషన్, స్పిరిట్ అంటే ఇలాగే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా తీర్చిదిద్దుతానని, ఇందుకు ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా రాష్ట్రంలోని గృహిణులకు అవకాశం వస్తే వారు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఫీజులు చెల్లించి ఏఐ, చాట్‌జీపీటీ వంటివాటిని రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశానికి 12 దేశాల నుంచి తెలుగువారు వచ్చారని, ఇందులో అత్యధికంగా తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారని అన్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలగువారు నిరసన ప్రకటించి, తనకు మద్దతు ప్రకటించారని, ఎవరైనా చనిపోయిన తర్వాత పేర్లు గుర్తుపెట్టుకుంటారు కానీ, బతికుండగానే పేరు గుర్తుపెట్టుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం సీఎం రోడ్డు మార్గం ద్వారా దావోస్‌కు వెళ్లారు.
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన
దావోలో చంద్రబాబు సోమవారం తొలిరోజు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్స్‌టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీతో స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు కలిసి పనిచేసేలా చూడాలని కోరారు.
అనంతరం మృధుల్ కుమార్ స్విట్జర్లాండ్‌కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. ‘స్విస్‌మెన్’ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, ‘ఓర్లికాన్’ సీఈవో మార్కస్ టకే, ‘ఆంగ్సŠట్ ఫిస్టర్’ సీఈవో ఎరిచ్ స్మిడ్, ‘స్విస్ టెక్స్‌టైల్స్’ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్‌టెర్నల్ ఎఫైర్స్ జార్న్ వాన్ డెర్ క్రోన్‌కు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం వివరించారు.
చంద్రబాబు, రేవంత్ భేటీ
జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment