పరిశ్రమలపై పెత్తనం ఎందుకు..? | Dominated industries .. Why? | Sakshi
Sakshi News home page

పరిశ్రమలపై పెత్తనం ఎందుకు..?

Published Tue, Apr 7 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

పరిశ్రమలపై పెత్తనం ఎందుకు..?

పరిశ్రమలపై పెత్తనం ఎందుకు..?

  • ఐలాను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడాన్ని ఒప్పుకోం
  •  పరిశ్రమల మంత్రికి తేల్చిచెప్పిన తెలంగాణ పారిశ్రామిక వేత్తలు
  •  30 పారిశ్రామికవేత్తల సంఘాలతో జూపల్లి సమావేశం
  • సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వాడలపై జీహెచ్‌ఎంసీ పెత్తనాన్ని తగ్గించాలన్న డిమాండ్  పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఆస్తిపన్ను వసూళ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ఇటీవలి కాలంలో కమిషనర్ సోమేశ్‌కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై పారిశ్రామిక వేత్తలు  విరుచుకుపడ్డారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే జీహెచ్‌ఎంసీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, పారిశ్రామిక వేత్తలను పీడించడమే ధ్యేయంగా వ్యవహరిస్తుందని తెలంగాణ పారిశ్రామిక వేత్తలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు.

    పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమల కమిషనర్ జయేష్ రంజన్‌లతో సోమవారం సచివాలయంలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో 30 సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 700 కోట్ల మేర రాయితీలను విడుదల చేయడం, నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడంపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

    అదే సమయంలో పారిశ్రామిక వేత్తలపై జీహెచ్‌ఎంసీ చేస్తున్న పెత్తనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జులై 22న  కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమై ‘ఐలా’ను పటిష్టం చేస్తానని, పరిశ్రమలకు స్వయం ప్రతిపత్తి కాపాడుతామని హామీ ఇచ్చిన విషయాన్ని పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి  గుర్తు చేశారు. అయితే జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఐలాను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం ద్వారా పరిశ్రమలపై గుత్తాధిపత్యాన్ని కార్పొరేషన్‌కు దఖలు చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు.
     
    ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు ఎస్.వి. రఘు, సుధీర్, పారిశ్రామిక వేత్తల సంఘాల ప్రతినిధులు ఎ.ఎల్.ఎన్.రెడ్డి(జీడిమెట్ల), ఎం.గోపాల్ రెడ్డి(చర్లపల్లి), జనార్దన్ రెడ్డి (పటాన్‌చెరు), నర్సింగ్‌రావు(మెదక్), మహిళా పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షురాలు సరిత, ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి రాజ మౌళి, ఎన్‌వీ నరేందర్, సూక్ష్మ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంతయ్య పాల్గొన్నారు.
     
    జీహెచ్‌ఎంసీ తీరుపై ఆందోళన
     
    ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జీహెచ్‌ఎంసీ వ్యవహరించడం పట్ల ఇతర సంఘాల ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆస్తిపన్ను పేరుతో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రకాల పన్నులు చెల్లిస్తూ పరిశ్రమలను నడుపుతున్న తమకు ఆస్తిపన్నును వాణిజ్య అవసరాల పేరుతో వసూలు చేయడం వల్ల నష్టపోతున్నామని మంత్రి జూపల్లికి వివరించారు. కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం తాగునీటి కనెక్షన్లు తీసుకుంటే వాటికి కూడా వాణిజ్య అవసరాల టారిఫ్‌లో బిల్లులు వేస్తున్నారని తెలిపారు. ఐలాను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం, ఆస్తిపన్ను, నీటి పన్నులకు సంబంధించి జీహెచ్‌ఎంసీ, పురపాలక శాఖలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

    తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న తెలంగాణ పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో వెయ్యి ఎకరాలు కేటాయించి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పరిశ్రమలతో సంబంధం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మునిసిపల్ శాఖ, రిజిస్ట్రేషన్లు, పీసీబీ వంటి విభాగాల అధికారులతో మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను కోరారు. త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement