ఆస్తిపన్ను అంచనా ఇక ఆన్‌లైన్ | property tax estimates in online soon | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్ను అంచనా ఇక ఆన్‌లైన్

Published Sun, Feb 23 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

ఆస్తిపన్ను అంచనా ఇక ఆన్‌లైన్

ఆస్తిపన్ను అంచనా ఇక ఆన్‌లైన్

త్వరలో అందుబాటులోకి..

వచ్చే వారం ప్రయోగాత్మక పరిశీలన

నేరుగా దరఖాస్తుల స్వీకరణకూ ఏర్పాట్లు

జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్

 సాక్షి, సిటీబ్యూరో : కొత్తగా ఇళ్లు కట్టుకున్నవారు తమ ఇంటిని జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను జాబితాలో చేర్చడానికి పడుతున్న పాట్లు ఎన్నో. ఎంత ఆస్తిపన్ను చెల్లించాలో  అసెస్ చేయాల్సిందిగా నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. ఇలాంటి వారు వేలసంఖ్యలో ఉన్నట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్.. సెల్ఫ్ అసెస్‌మెంట్ విధానానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. అదెలాగంటే.. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తాముంటున్న ప్రాంతాన్ని (చిరునామాను) నమోదు చేస్తే.. ఆ ప్రాంతంలో ఆస్తిపన్ను శ్లాబ్ రేట్ ఎంత ఉందో.. తదితర  వివరాలు తెలుస్తాయి.

వాటి ఆధారంగా తమ ఇంటి ప్లింత్‌ఏరియాను బట్టి ఎంత ఆస్తిపన్ను చెల్లించాలో తెలుసుకోవచ్చు. అందుకనుగుణంగా వెబ్‌సైట్‌లో కనిపించే వివరాలను భర్తీ చేయాలి. వాటి ఆధారంగా క్షేత్రస్థాయి తనిఖీలకు వచ్చే అధికారులు లోటుపాట్లేమైనా ఉంటే చూసి తగు సవరణలతో ఆస్తిపన్ను ఖరారు చేస్తారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు సైతం సెల్ఫ్ అసెస్‌మెంట్‌ను అమలు చేశారు. అయితే అప్పట్లో ఆన్‌లైన్ అందుబాటులో లేదు.

జీహెచ్‌ఎంసీలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో శనివారం నిర్వహించిన ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం (పీటీపీ) కార్యక్రమం అనంతరం .. కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ) ఎస్. హరికృష్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పీటీపీకి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. వారి నుంచి వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా త్వరలోనే సెల్ఫ్ అసెస్‌మెంట్‌ను ప్రారంభిస్తామన్నారు. వచ్చేవారం ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి.. అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.

ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్‌మెంట్ చేయలేని వారి నుంచి స్వయంగా దరఖాస్తులు స్వీకరించేందుకు సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు. వారికి సహకరించేందుకు అవసరమైన సిబ్బందిని నియమిస్తామన్నారు. పీటీపీలో అసెస్‌మెంట్ల కోసం 60 విజ్ఞప్తులు అందగా.. వాటిలో మూడింటిని అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మొత్తం 515 ఫిర్యాదులు రాగా.. వాటిల్లో 283 రివిజన్ పిటిషన్లు (ఎక్కువ పన్ను తగ్గించాల్సిందిగా) ఉన్నాయన్నారు. అందులో 69 ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించామన్నారు. ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌ల నుంచి ఎక్కువ ఫిర్యాదులొచ్చాయన్నారు.

సెంట్రల్‌జోన్‌లోని రెండు సర్కిళ్లలో పీటీపీ తీరును తాను పరిశీలించానన్నారు. ఎక్కువ మొత్తాల్లో బకాయిలున్న పార్క్‌హయత్ హోటల్, హైదరాబాద్ ఆస్బెస్టాస్ వంటి సంస్థల నుంచి కూడా రివిజన్ పిటిషన్లు అందాయన్నారు. ఇకపై కొత్త భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చిన వెంటనే సదరు భవనం ఆస్తిపన్ను జాబితాలోకి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. తద్వారా ఇకపై అసెస్‌మెంట్ సమస్యలు ఉండబోవన్నారు. ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలో ఎక్కువ మొత్తాలు విధించే అధికారులపైనా.. ప్రజల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా జాప్యం చేసేవారిపైనా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
 
 మార్చి 2న మళ్లీ పీటీపీ

 శనివారం సెలవు లేనందున చాలామంది పీటీపీని వినియోగించుకోలేకపోయారనే విజ్ఞప్తుల మేరకు సెలవురోజైన ఆదివారం (మార్చి2న) మరోమారు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో పీటీపీ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.
 
 పల్స్‌పోలియోను వినియోగించుకోండి
 ఆదివారం జరగనున్న పల్స్‌పోలియోను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు కమిషనర్ సూచించారు. పల్స్ పోలియోకు 85 మొబైల్ వాహనాలను కూడా వినియోగిస్తున్నామన్నారు.
 
 వసూళ్లకు ప్రత్యేక బృందాలు
 ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనున్నందున ఆస్తిపన్ను వ సూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్(ఏఎంసీ)ల నేతృత్వంలో ఆస్తిపన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. అనేక వాణిజ్య భవనాలు.. నివాస భవనాల పన్నునే చె లిస్తుండటాన్ని గుర్తించామని.. వాటన్నింటినీ వాణిజ్య పరిధిలోకి తెస్తామన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆస్తిపన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగా సర్కిళ్లలోని టాప్-200 బకాయిదారులను గుర్తించి, వారి నుంచి వసూళ్లకు శ్రద్ధ చూపుతున్నామన్నారు. కోర్టు వివాదాల పరిష్కారంపైనా దృష్టి సారించినట్లు చెప్పారు. రివిజన్ పిటిషన్ల పరిష్కారం ద్వారా కూడా వసూళ్లు పెరుగుతాయన్నారు. ఆస్తిపన్ను ఫిర్యాదుల పరిష్కారం తరహాలో త్వరలోనే పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ ఫైళ్ల పరిష్కారానికీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement