‘గ్రేటర్’ వసూళ్లు | 'Greater' collection | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ వసూళ్లు

Published Tue, Apr 1 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

‘గ్రేటర్’ వసూళ్లు

‘గ్రేటర్’ వసూళ్లు

  •       రూ. వెయ్యి కోట్లకు పైగాఆస్తిపన్ను వసూలు
  •      తొలిసారిగా దాటిన నాలుగంకెల ఫిగర్
  •      ఫలించిన కమిషనర్ సోమేశ్‌కుమార్ వ్యూహం
  •  సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ అరుదైన రికార్డు నమోదు చేసింది. నాలుగంకెల మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. గతంలో మున్నెన్నడూ లేని విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1010 కోట్లు (సోమవారం రాత్రి 8 గంటల వరకు లెక్కించిన మేరకు) వసూలు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత భారీమొత్తంలో ఆస్తిపన్ను వసూలు కావడం ఒక రికార్డు కాగా.. పన్నును ఏమాత్రం పెంచకుండా.. బకాయిదార్ల పేర్లు బజార్లలో ప్రదర్శించకుండా భారీ మొత్తంలో సొమ్మును వసూలు చేయడం మరో విశేషం. గత మూడేళ్లుగా ఏటికేడు ఆస్తిపన్ను వసూళ్లు పెరుగుతున్నప్పటికీ, గడచిన ఆర్థిక సంవత్సరం కంటే ఎంతో ఎక్కువ ఆస్తిపన్ను వసూలు చేయడం.. అదీ భారీ హెచ్చరికల వంటివి లేకుండానే వసూలు చేయడం ఈ సంవత్సరం ప్రత్యేకత.
     
    కొత్త విధానం సక్సెస్
     
    జీహెచ్‌ఎంసీ గత సంవత్సరం రూ. 779 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది. ఈ ఏడాది కొత్త విధానం అనుసరించి వెయ్యి కోట్లకు పైగా వసూలైంది. ఈసారి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియలో జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల వారిని భాగస్వాములను చేస్తూ కమిషనర్ సోమేశ్‌కుమార్ కొత్త విధానాన్ని అనుసరించారు. జీహెచ్‌ఎంసీలోని ఏయే విభాగాల్లోని సిబ్బందికైతే ఇళ్ల చిరునామాలు తెలుసో వారందరి సేవల్ని ఆస్తిపన్ను వసూళ్లకు వినియోగించుకున్నారు.

    వారిని ఔట్‌రీచ్ బృందాలుగా పేర్కొంటూ బకాయిలున్న వారి ఇళ్లకు  పంపించడం ద్వారా ఎక్కువమంది నుంచి ఆస్తిపన్ను వసూలు చేయగలిగారు. ఔట్‌రీచ్ బృందంలోని సభ్యులు.. బకాయిదారుల ఇళ్లకు వెళ్లి ఈ నెలాఖరు లోగా చెల్లిస్తే పెనాల్టీ ఉండదని చెప్పి చెల్లింపులకు వారిని ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. దీంతోపాటు ఆస్తిపన్ను జాబితాలోని వారందరి ఫోన్‌నెంబర్లు సేకరించారు.

    జీహెచ్‌ఎంసీలోని కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల దాకా లక్షలమంది పన్ను బకాయిదారులకు ప్రత్యేకంగా ఫోన్లు చేశారు. కాల్‌సెంటర్ నుంచీ ఫోన్లు చేయించారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు క్షేత్రస్థాయిలోనూ బాగా తిరిగారు. ఇలా వీలైనన్ని మార్గాల ద్వారా ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. గత నెల రోజులుగా ఏరోజుకారోజు పరిస్థితిని సమీక్షించుకుంటూ లక్ష్యం చేరేందుకు కృషి చేశారు. పెద్దగా బకాయిలు లేకుండా కేవలం ఒక వాయిదా మాత్రమే చెల్లించాల్సిన వారిపైనా దృష్టి సారించారు.

    అదే తరుణంలో భారీ బకాయిలున్న వారిపైనా శ్రద్ధ చూపారు. చాలావరకు సంప్రదింపుల ద్వారా యజమానులు ఆస్తిపన్ను చెల్లించేలా చూశారు. అవసరాన్ని బట్టి జప్తు వంటి చర్యలకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ యజమానులే కాక, ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలపైనా కొరడా ఝళిపించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే కాక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి వాటి నుంచీ ఆస్తిపన్ను వసూలు చేశారు.
     
    సిబ్బందికి ప్రోత్సాహకాలు
     
    మరోవైపు, ఆస్తిపన్ను విభాగంలోని సిబ్బందికి ప్రోత్సాహకాలు అమలు చేశారు. గత సంవత్సరం కంటే ఎక్కువ ఆస్తిపన్ను వసూలు చేసిన వారికి నెల జీతం ఇంక్రిమెంట్‌గా అమలు చేశారు. అండర్ అసెస్డ్, అన్ అసెస్డ్ భవనాలను గుర్తించడం వంటి చర్యలు చేపట్టారు. బకాయిదారుల పేర్లు ఫ్లెక్సీల కెక్కించడం, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో పెట్టడం వంటి విధానాలకు పోలేదు. ప్రజల పరువు తీయడం తమ లక్ష్యం కాదన్న కమిషనర్ సోమేశ్‌కుమార్.. వారి పరువుకు భంగం వాటిల్లకుండానే పన్ను వసూలు చేయడంపై శ్రద్ధ కనబరిచారు. సిబ్బంది సేవల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. బాగా పనిచేసేవారికి తగిన గుర్తింపు ఇచ్చారు. ఇలా.. వీలైనన్ని మార్గాల ద్వారా ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి పెట్టడంతో భారీ మొత్తంలో ఆస్తిపన్ను జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరింది.
     
     అందరి సహకారంతోనే..
     అటు ప్రజలు, ఇటు జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. వివిధ ప్రభుత్వ విభాగాల సహకారం వల్లే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను వసూలైంది. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయనేందుకు ఇది నిదర్శనం. ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు తెలంగాణ.. వరుస సెలవులు.. ఇన్ని క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ అందరూ సహకరించినందునే ఈ ఫలితం సాధించగలిగాం. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సవాల్‌గా తీసుకొని పనిచేశారు. ప్రజలూ బాగా సహకరించారు. అందరికీ అభినందనలు. కృతజ్ఞతలు. ప్రజల నుంచి వసూలైన ఈ సొమ్మును వారికి మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే ఖర్చు చేస్తాం.     
     - సోమేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement