నాలాల అభివృద్ధికి కమిటీలు
- సమీక్ష సమావేశంలో సోమేశ్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: చెరువులు, నాలాల పరిధిలో ఆక్రమణల తొలగింపు.. వాటి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అందుకనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధమయ్యారు. తొలి విడతలో భాగంగా ఐదు ప్రధాన నాలాల పరిధిలో వెలసిన ఆక్రమణలను గుర్తించి , వాటిని తొలగించడంతోపాటు సదరు నాలాలను అభివృద్ధి చేసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం ఈ అంశాలపై ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈపనుల కోసం ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, భూసేకరణ విభాగాల్లోని అధికారులతో సర్కిళ్ల స్థాయిలో సమన్వయకమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పనుల పర్యవేక్షణకు ప్రతి నాలాకు ప్రత్యేకాధికారిని నియమించనున్నట్లు చెప్పారు.
తొలిదశలో మారియట్ హోటల్ నుంచి మూసీకి వెళ్లే హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలా, శేరిలింగంపల్లి నాలా, మీరాలం చెరువు- నూర్ మహ్మద్‌ట్యాంక్, ముర్కినాలా, కూకట్‌పల్లి నాలాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అఫ్జల్‌పార్కు పునరుద్ధరణకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా కన్సల్టెంట్‌కు సూచించారు. సమావేశంలో ఈఎన్‌సీ ధన్‌సింగ్, చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, జయరాజ్‌కెన్నెడితదితరులు పాల్గొన్నారు.