సొగసు చూడతరమా!
- హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు
- సర్కారు సరికొత్త ఆలోచన
- జలాశయ అందాలు ప్రతిబింబించేలా ప్రణాళిక
సాక్షి, సిటీబ్యూరో: ఆకాశాన్ని తాకేలా విభిన్న ఆకృతులలోని భవనాలు... ఆ ఎదురుగా సుందర జలాశయం... చుట్టూ ఇంద్రధనుస్సును పోలినట్టుండే సప్త వర్ణాల పూలు... ఆ నీటిపై నుంచి భవనాలను కలుపుతూ ముచ్చటగొలిపే విద్యుత్ కాంతులు... ఈ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది కదూ. నగరానికి మణిహారంలా ఉన్న హుస్సేన్‌సాగర్ వద్ద ఈ దృశ్యం సాక్షాత్కరిస్తే... అబ్బో... ఆ ఊహే మహాద్భుతం... ఇక వాస్తవ రూపం దాలిస్తే...‘దాలిస్తే’ ఏంటి? దాల్చబోతోంది.
అవును సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు వెలిసేందుకు అవ సరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం మరోవైపు జలాశయం చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే తలంపులో ఉంది. ఇందులో భాగంగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించింది. వీటికి సంబంధించి 26 కోర్టు కేసులు ఉన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పం దించిన ఆయన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అడ్వొకేట్ జనరల్‌కు సూచిం చారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న భూములను పలువురు ఆక్రమించడం.. ఏళ్ల తరబడి అవి కోర్టు కేసుల్లో నలుగుతుండటం తెలిసిందే. లీజు గడువు ముగిసిపోయినా కోర్టు స్టేతో ఖాళీ చేయకపోవడం... సాగర్‌కు ఒకవైపు ఆక్రమణలు వంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటిని తొలగించాలని యోచి స్తోంది.
విదేశాల్లోని ప్రసిద్ధ నగరాలతో పాటు మనదేశంలోని ముంబై, కోచిల్లోని మెరైన్‌డ్రైవ్‌ల తరహాలో అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నగరాల మాదిరిగా హైదరాబాద్‌లోనూ ‘స్కైలైన్’ భవనాలను నిర్మించేందుకు అన్ని అంశాలను అధ్యయనం చేసి.. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. ఈ ‘ఆకాశహర్మ్యాల’ విషయం వాస్తవమేనని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు.