పకడ్బందీగా సమగ్ర సర్వే
రాంగోపాల్‌పేట్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 19వ తేదీన చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ అధికారులకు సూచించారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో స్పెషల్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, క్లస్టర్ ఇంచార్జ్, ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చారు.
అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్ర భుత్వం ఈ సర్వే చేపట్టిందని అన్నారు. నగరంలో ఒకే రోజు కోటి మంది జనాభాను, 20 లక్షల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించడం సవాలులాంటిదేనని అన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ భాధ్యతగా తీసుకుని పనిచేయాలన్నారు. హదరాబాద్ నగరంలోనే అసోసియేట్ ఎన్యూమరేటర్స్‌గా ప్రైవేటు టీచర్లు, పోస్టుగ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ విద్యార్థులు తదితరులను వినియోగిస్తున్నామన్నారు.
ఈ నెల 17, 18 తేదీల్లో ప్రీ విజిట్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. రెండు రోజులు సర్వే చేయడం వల్ల 19వ తేదీన చేపట్టే సర్వేలో ఎదురయ్యే ఇబ్బందులు ముందే తెలుస్తాయని వివరించారు. 19వ తేదీ ఉదయం 7గంటలకు ఫీల్డుకు వచ్చి రాత్రి 7గంటల వరకు సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. సర్వే రోజు ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులకు కూడా సెలవు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ప్రజలు సర్వేకు వచ్చే అధికారులకు పూర్తిగా సహకరించాలని విద్యుత్, వాటర్, గ్యాస్, ఆధార్ కార్డు, అంగవైకల్యం ఉంటే సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ముఖేష్‌కుమార్‌మీనా, శ్రీధర్, స్పెషల్ కమిషనర్లు పద్యుమ్న, బాబు, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్, జోనల్ కమిషనర్లు, ఉప కమిషనర్లు సర్వేలో పాల్గొనే అధికారులు పాల్గొన్నారు.