ఈసారైనా..
- పూడికతీత పనులు
- ఏటా తూతూమంత్రంగానే..
- కాంట్రాక్టర్లకు ‘మేత’
- ఈసారి పక్కా కార్యాచరణ
- పనులకు సిద్ధమవుతున్న యంత్రాంగం
- 25న టెండర్లు.. మార్చి ఆఖరులోగా పనులు పూర్తి
సాక్షి, సిటీబ్యూరో: పూడికతీత.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలాల్లో ఈ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఇదో గొప్ప ఆదాయ మార్గం. చేయని పనులు చేసినట్లు చెబుతూ ఏటా రూ. కోట్లు కాజేస్తున్నారు. అధికారులదీ అదే వరస. దీంతో వర్షాకాలంలో వాననీరు సాఫీగా వెళ్లేందుకు ఈ పనులు చేపడుతున్నా.. ఎక్కడి పూడిక అక్కడే పేరుకుపోయి వరదనీరు వెళ్లట్లేదు. ఏటా వానా కాలంలో నగరవాసులు నరకం చూస్తున్నారు.
ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయకపోవడం, సీజన్‌లో చేతులెత్తేయడం షరా మామూలుగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఈసారి మాత్రం నాలాల్లో పూడికతీత పనుల్ని పక్కాగా చేపట్టడానికి సిద్ధమవుతోంది. పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెబుతున్నారు. ఆ మేరకు నిర్ణీత వ్యవధిలో.. వేసవిలోనే పూడికతీత పనులు పూర్తవుతాయంటున్నారు. ఈ క్రమంలో నిర్ణీత వ్యవధిలో ఈ పనులు జరుగుతాయా.. లేక గత అనుభవమే చర్విత చరణం కానుందా అనేది రెండు నెలల్లో తేలనుంది.
ఏటా ఇదీ తంతు..
నిజానికి వేసవిలోనే నాలాల్లో డీసిల్టింగ్ (పూడికతీత) పనులు జరగాల్సి ఉన్నప్పటికీ, సకాలంలో చేయట్లేదు. తీరా వర్షాలు మొదలయ్యాక పనులు చేస్తున్నారు. వర్షాల వల్ల పూడికతీత పూర్తిగా చేయకుండా మమ అనిపించి కాంట్రాక్టర్లు బిల్లులు కాజేస్తున్నారు. వారికి వత్తాసునిస్తూ అధికారులు సైతం అందినకాడికి దండుకుంటున్నారు.
ఆ విధానానికి స్వస్తి చెప్పి వేసవిలోనే పూడికతీత పనులు పూర్తిచేయాల్సిందిగా కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆదేశించడంతోపాటు, కార్యాచరణకు సమయాన్ని కూడా సూచించడంతో.. వేసవిలోనే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈనెల 25న టెండర్లు పిలిచి, టెండరు పొందిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకంంటున్నారు. దీంతోపాటు.. పనులు చేయకుండానే.. చేసినట్లు చూపి బిల్లులు కాజేయకుండా ఉండేందుకు , పనులు పారదర్శకంగా ఉండేందుకు తగు నిబంధనలు రూపొందించారు.
ఇదీ కార్యాచరణ..
ఈ ఏడాది మొత్తం 297 పనులు చేయాలని నిర్ణయించారు
రూ. 21.18 కోట్లు మంజూరు చేశారు
ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఏరియాసభ, వార్డు కమిటీ సభ్యులు, కార్పొరేటర్ల సలహాలతో ఎక్కడెక్కడ పనులు చేయాలో గుర్తించాలి
అంచనా వ్యయాల్ని సైతం వారితో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి
తొలగించిన పూడికను డంపింగ్‌యార్డుకు తరలించే వాహనాలకు జీపీఎస్, ఓఎస్సార్టీలు అమలు చేయాలి
పూడిక తీయక ముందు.. తీస్తున్నప్పుడు.. తీశాక.. ఫొటోలు తీయాలి
వాహనం జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు వెళ్లాక అక్కడి వెయింగ్ మెషిన్‌లో తూకం వేసి.. అందుకనుగుణంగానే కాంట్రాక్టరుకు బిల్లు చెల్లించాలి
పనులు చేయడానికి ముందు, చే సిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీ చేయాలి
మార్చి ఆరంభం నుంచే డీసిల్టింగ్ పనులు ప్రారంభమై, నెలాఖరులోగా పూర్తి కావాలి
ఎక్కడెక్కడ డీసిల్టింగ్ పనులు చేస్తున్నది ప్రజలు చూసేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరచాలి. ఏ నాలానైనా వదిలివేస్తే ప్రజలు సమాచారమిచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది.