రూ.5కే భోజనం షురూ
నాంపల్లిలో ప్రారంభించిన మేయర్
ఐదు రూపాయలు ఖర్చుపెడితే గట్టిగా సింగిల్ టీ కూడా రాని ఈ రోజుల్లో.. ఐదు రూపాయలకే నిరుపేదలకు కడుపు నిండా వేడివేడి భోజనాన్ని అందించే పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లాంఛనంగా ప్రారంభించింది. హరేకృష్ణ ఫౌండేషన్ వారి అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రతి డివిజన్ లోను ఈ పథకాన్ని చేపడుతున్నారు. నాంపల్లి సరాయి వద్ద మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ ఆదివారం ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ‘ఈ పథకానికి 2014-15 సంవత్సరానికి రూ.11 కోట్ల నిధులు కేటాయించాం. అవసరమైతే దీన్ని రూ.50 కోట్లకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు రూపాయలకే పేదలకు మధ్యాహ్న భోజనాన్ని అందించే ఈ పథకాన్ని ఎంఐఎం వ్యవస్థాపక దినోత్సవం నాడు ప్రారంభించడం సంతోషంగా ఉంది’ అన్నారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు రూ.5 టికెట్ కొనుగోలు చేసి సహపంక్తి భోజనం చేశారు.
త్వరలో 50 కేంద్రాలు...
కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ... ‘ఐటీ హబ్‌గా పేరొందిన మహానగరంలో పెద్ద సంఖ్యలోనే పేదలు, అడ్డా కూలీలున్నారు. వారందరికీ తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలన్న తలంపుతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం. పుట్టినరోజు వంటి వేడుకలు, లేదా తమకు కావల్సిన వారి జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాల సందర్భంగా అన్నదానాలు చేయాలనుకునేవారిని కూడా ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ఆలోచిస్తున్నాం. ఆయా రోజున భోజన కేంద్రాల్లో ఖర్చు భరిస్తే... వారి పేర్లతో పాటు ఏ సందర్భంగా భోజనం అందిస్తున్నారో నోటీసు బోర్డుపై రాసి ఉంచుతాం’ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ ప్లోర్‌లీడర్లు దిడ్డి రాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షులు సత్యగౌరు చంద్రదాస్ పాల్గొన్నారు.
చాలా బాగుంది...
పేదవాళ్ల కోసం బల్దియా ప్రారంభించిన ఈ పథ కం ఎంతో బాగుంది. బయట రూ.40 పెట్టినా ఇంత మంచి భోజనం లభించదు.
- రహీముద్దీన్, ఖైరతాబాద్