ఇదేం..కక్కుర్తి..?
జీహెచ్‌ఎంసీ సామగ్రి ఇంటికి పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురే లేదు
మాజీ ఫ్లోర్‌లీడర్ నిర్వాకంపై విచారణకు ఆదేశించిన సోమేశ్‌కుమార్
ఆయన తాజా మాజీ కార్పొరేటర్.. జీహెచ్‌ఎంసీలో ప్రధాన ప్రతిపక్షానికి ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు.. పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురే లేదు. సర్వసభ్య సమావేశాల్లో అందరిదీ ఒక ఎత్తయితే ఆయనది ఒక ఎత్తు. ఆయన నోటికి జడిసి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. తన మాట వినని అధికారులను లక్ష్యంగా చేసుకొనేవారు. సర్వసభ్య సమావేశంలో నిలదీసేవారు. అందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టేవారు కూడా. ఇది నాణేనికి ఒక వైపు. మరోవైపు తనకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు ద క్కేలా చేసేవారు.. పలు విభాగాల్లో పనులు చేయించుకోవడంలో నేర్పరి. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనులు చేయించడంలోనూ అందెవేసిన చేయి. ఇలా వివిధ మార్గాల్లో పదవిని బాగా వినియోగించుకున్నారు. పదవి నుంచి దిగిపోయే ముందూ కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాన ప్రతిపక్ష పార్లీ ఫ్లోర్‌లీడర్ హోదాలో జీహెచ్‌ఎంసీ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఒక చాంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ఫర్నిచర్, టీవీ, ఫ్రిజ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసింది. సాధారణంగా పదవి దిగిపోయేముందు వాటిని సంబంధిత మెయింటనెన్స్ విభాగానికి అప్పగించాలి. అయితే అలా జరగలేదు. ఈ నెల 3న కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిపోయింది. ఆరోజు తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య సమయంలో కొంతమంది గుంపుగా ఆయన చాంబర్‌లోకి వెళ్లి టేబుల్, కుర్చీలు, టీవీ, ఫ్రిజ్ తదితర వస్తువులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు విశ్వసనీయ సమాచారం. అడ్డుకోబోయిన సెక్యూరిటీని గద్దించారు. ‘మా అన్న సింగిరెడ్డి పంపాడు.. మాకే అడ్డుచెబుతావా’ అంటూ గద్దించారు. సెక్యూరిటీ సిబ్బంది సామగ్రి వివరాలు నోట్ చేసుకున్నారు. వచ్చినవారు దర్జాగా వాటిని వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది మెయింటనెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు. మౌనం వహించారు. శుక్రవారం టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ‘జీహెచ్‌ఎంసీ ఫర్నిచర్’ను ఎత్తుకుపోయారంటూ టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ విచారణ జరపాల్సిందిగా జీహెచ్‌ఎంసీ విజిలెన్స్, పరిపాలన విభాగం, ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. సామగ్రికి సంబంధించిన రికార్డులు ఎవరు నిర్వహించాలి.. ఈ ఘటనలో ఎవరి బాధ్యత ఎంత.. తదితర వివరాలతో సహ పూర్తి సమాచారం అందించాల్సిందిగా ఆదేశించారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఫ్లోర్ లీడర్‌తో ఎందుకొచ్చిన గొడవనుకొని తీసుకువెళ్లిన సామగ్రిని తిప్పి పంపించాల్సిందిగా కొందరు అధికారులు ఆయనను కోరినట్లు తెలిసింది. ‘ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు. నాకు సంబంధం లేదు. కావాలంటే అందుకయ్యే ఖర్చు ఎంతో చెల్లిస్తా’ అని ఆయన అధికారులతో అన్నట్టు తెలిసింది. అందుకు అధికారులు నిరాకరించారు. సామగ్రిని తిరిగి ఇవ్వాల్సిందేనంటూ సిబ్బందిని ఆయన ఇంటికి పంపించారు. సింగిరెడ్డి ఇంటి ముందు మీడియా ప్రతినిధులు ఉండడంతో సిబ్బంది వెనుదిరిగినట్టు సమాచారం.
‘గతంలో ఎవ్వరూ సామాన్లు తీసుకెళ్లలేదా..? నాగురించే ఎందుకు ప్రచారం చేశారు’ అంటూ శ్రీనివాసరెడ్డి కొందరు ఉద్యోగులతో ఫోన్‌లో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సెక్యూరిటీ, మెయింటనెన్స్ విభాగాల వారు ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు. అధికారులు కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించనున్నట్టు తెలిసింది.
అధికారుల ప్రాథమిక అంచనా మేరకు రిఫ్రిజిరేటర్, టీవీ, టేబుల్, కప్‌బోర్డు, 12 ప్లాస్టిక్ కుర్చీలు, మరో ఖరీదైన కుర్చీ తరలించినట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో ఇతర ఫ్లోర్‌లీడర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరుల చాంబర్లలోని ఫర్నిచర్ సరిగ్గా ఉందా అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
నాకు తెలియదు..
సామగ్రి తరలింపుపై సింగిరెడ్డిని వివరణ కోరగా, వాటిని ఎవరు ఎత్తుకెళ్లారో తనకు తెలియదన్నారు. వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు.