- తొమ్మిదో కేంద్రం ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: పేదలకు సేవ చేయడం.. భగవంతునికి సేవ చేయడంతో సమానమని మేయర్ మాజిద్ హుస్సేన్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ. 5కే భోజన కార్యక్రమం తొమ్మిదో కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో లిబర్టీ బస్టాప్ వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల్ని జీహెచ్‌ఎంసీ చేపట్టినందున ఎంతో గర్వపడుతున్నానన్నారు. అక్టోబర్ 2వ తేదీకి మొత్తం 50 కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం రూపాయికే టిఫిన్ పథకాన్ని ప్రారంభించే యోచన ఉందన్నారు.
కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎంతోమందికి ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఈసెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఈ పథకం వల్ల ఎందరో పేదలకు ఆకలి తీరుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పథకం వల్ల నేరాలు, దొంగతనాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.
ట్రాఫిక్ సమస్యల్లేకుండా ఉండేందుకుగాను మెరుగైన రహదారులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, సైనేజీలను ఏర్పాటుకు సహకరించాల్సిందిగా మేయర్, కమిషనర్లను కో రారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జి. రాజ్‌కుమార్, హరేకృష్ణ అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, కాంగ్రెస్ పక్ష నాయకుడు వాజిద్‌హుస్సేన్, స్పెషల్ కమిషనర్ ప్రద్యుమ్న, జోనల్ క మిషనర్ సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు.