- ఈఎస్‌ఐ నిధులు తెచ్చిన తంటా
- ఎస్‌బీహెచ్ అధికారుల తీరుపై గుర్రు
- చెప్పకుండానే మా నిధులు మళ్లిస్తారా?
- హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్
- కాళ్లబేరానికి వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు
- ససేమిరా అంటున్న సోమేశ్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ కమిషనర్‌కు ఒక్కసారిగా కోపమొచ్చింది. తమ కార్యాలయ ఆవరణలోని ఎస్‌బీహెచ్ శాఖ అధికారుల తీరుతో చిర్రెత్తిపోయారు. తమకు తెలియకుండా తమ నిధులను ఈఎస్‌ఐకి ఎలా మళ్లిస్తారంటూ మండిపడ్డారు. పక్కనే ఉంటూ తమను ఖాతరు చేయకుండా రూ.2 కోట్లను ఎలా బదిలీ చేశారంటూ ఏకంగా హైకోర్టుకెక్కారు. తప్పును తెలుసుకున్న బ్యాంకు అధికారులు కాళ్లబేరానికి వచ్చినా ససేమిరా అంటూ... తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే దిశగా సాగుతున్నారు.
వివరాలు ఇలా.. జీహెచ్‌ఎంసీ కార్మికులకు చెందిన నిధుల (2010 సంవత్సరానివి) చెల్లింపులో జాప్యం జరిగిందంటూ ఈఎస్‌ఐ అధికారులు గత జనవరిలో జీహెచ్‌ఎంసీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈఎస్‌ఐ చెల్లింపుల్లో జాప్యం జరిగితే సదరు సంస్థ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే అధికారం ఈఎస్‌ఐకి ఉంది. అయితే ఇది ప్రైవేటు సంస్థలకు వర్తిస్తుంది తప్ప జీహెచ్‌ఎంసీకి వర్తించద ని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెబుతున్నారు.
ఈఎస్‌ఐకి చెల్లించాల్సిన నిధుల్లో జాప్యానికి సంబంధించి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తే.. సదరు సంస్థ కోర్టు ద్వారా తిరిగి ఖాతాల పునరుద్ధరణకు ప్రయత్నం చేస్తుంది. లేదా నిధులు చెల్లిస్తుంది. జీహెచ్‌ఎంసీ కొన్ని సర్కిళ్ల పరిధిలో ఈఎస్‌ఐ చెల్లింపుల్లో జాప్యం జరిగిందంటూ ఈఎస్‌ఐ అధికారులు జీహెచ్‌ఎంసీ ఖాతా ఉన్న ట్యాంక్‌బండ్ శాఖ(ఇది జీహెచ్‌ఎంసీ కార్యాలయ ఆవరణలోనే ఉంది) అధికారులను సంప్రదించారు.
సదరు బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే ఈనెల 2న సదరు బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసరావు ఈఎస్‌ఐకి రూ. 2కోట్ల పే ఆర్డర్ ఇచ్చారు. సదరు చెల్లింపులు జరిపినట్టు మరుసటి రోజు బ్యాంకు అధికారులు జీహెచ్‌ఎంసీ ఆర్థిక విభాగానికి తెలియజేశారు. ఆ విభాగం అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన కమిషనర్ తమ సొమ్మును తమకు తెలియకుండా ఇతరులకు ఎలా చెల్లిస్తారంటూ మండిపడ్డారు.
‘బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్’ అంటూ ఎస్‌బీహెచ్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దాంతో బ్యాంకు ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులతో గురువారం రాత్రి కమిషనర్ వద్దకు చేరుకున్నారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. అందుకు శాంతించని కమిషనర్ శుక్రవారంలోగా తమ సొమ్ము తిరిగి తమకు చేరాలన్నారు. లేనిపక్షంలో క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అంతటితో ఆగకుండా, జరిగిన విషయాన్ని వివరిస్తూ శుక్రవారం లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఈఎస్‌ఐకి జారీ అయిన సదరు ‘పే ఆర్డర్’ చెల్లింపులు నిలివేయాల్సిందిగా ఆదేశిస్తూ మూడు వారాల వరకు స్టే ఇచ్చింది. ఎస్‌బీహెచ్ అధికారులు కమిషనర్‌తో కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఆవరణలోనే బ్యాంకు శాఖ ఉన్నా తమ దృష్టికి తేకుండానే సొమ్మును బదిలీ చేయడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు.
జీహెచ్‌ఎంసీ గౌరవానికి భంగం కలిగించిన ఎస్‌బీహెచ్ అధికారుల తీరును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కార్యాలయ ఆవరణలోని ఈ బ్యాంక్ శాఖను తరలించే యోచనతోపాటు.. తమ డిపాజిట్లను అక్కడి నుంచి వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. సదరు బ్యాంక్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన దాదాపు రూ.వెయ్యికోట్లకు పైగా డిపాజిట్లున్నాయి. మరో రూ.200 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం. జీహెచ్‌ఎంసీ అవసరాల కోసమే ఆవరణలోనే బ్యాంకు బ్రాంచీని ఏర్పాటు చేశారు. ఇతర ఖాతాదారులు స్వల్పంగానే ఉంటారు. గ్రేటర్ కమిషనర్ నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.