ఎస్‌బీహెచ్ డిపాజిట్ల కుంభకోణంపై సీబీ‘ఐ’
- హైకోర్టు ఆదేశంతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు
- సైబరాబాద్ పోలీసుల నుంచి వివరాలు సేకరణ
- కీలక సూత్రధారి దామోదర్ గాలింపునకు ప్రత్యేక బృందం
సాక్షి, హైదరాబాద్: ఎస్‌బీహెచ్ బ్యాంకు శాఖల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల డిపాజిట్ల సొమ్ము పక్కదారి పట్టిన వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, అన్నోజీ గూడలోని సింగపూర్ టౌన్‌షిప్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లోని ఎస్‌బీహెచ్ బ్యాంకు శాఖల నుంచి దాదాపు రూ. 30 కోట్లకుపైగా పక్కదారి పట్టిన విషయం తెలిసిందే.
స్వయంగా హైకోర్టు స్వాధీనంలోని సొమ్ము మాయమవడాన్ని న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. ఈ అవకతవకల వ్యవహారాన్ని ఛేదించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు శనివారమే సీబీఐ కార్యాచరణ ప్రారంభించింది. బ్యాంకు ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు కోసం ఒక బృందాన్ని, ఈ కేసులో కీలకమైన దామోదర్‌ను గాలించేందుకు మరో బృందాన్ని ఏర్పాటు చేసింది.
బ్యాంకు అధికారుల పాత్రపైనా..
ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీసులు సేకరించిన ఆధారాలు, సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు. ఖాయిలా పడిన పరిశ్రమల బకాయిల సెటిల్‌మెంట్ కోసం హైకోర్టు లిక్విడేటర్ అధీనంలో ఉన్న సొమ్ము పక్కదారి పట్టడంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలం పాటు డిపాజిట్ చేసిన సొమ్మును కేవలం 15 రోజుల వ్యవధిలో తిరిగి ఇచ్చేయడంలో ఉన్న మతలబుపై దృష్టి సారించారు. ఆ సొమ్మును ముంబై, గుజరాత్, రాజ్‌కోట్ తదితర ప్రాంతాల్లోని 13 ఖాతాలకు బదిలీ చేయడంపై ఆరా తీస్తున్నారు. పైగా ఇంత పెద్ద వ్యవహారాన్ని బ్యాంకు మేనేజర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంపై సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా పలువురు బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకోవాలని సీబీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
గాలింపు ముమ్మరం..
ఈ కుంభకోణం సూత్రధారిగా భావిస్తున్న దామోదర్ కోసం సీబీఐ అధికారులు గాలింపు మొదలు పెట్టారు. అతను చెన్నైకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తుండటంతో అక్కడికి ఒక ప్రత్యేక బృందాన్ని పంపారు. అలాగే దామోదర్ ఎక్కడా తన పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించకుండా తెలివిగా వ్యవహరించిన తీరును అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దామోదర్‌తో బ్యాంకు అధికారులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
తెరమీదకు మరికొన్ని పేర్లు..
మల్కాజిగిరి ఎస్‌బీహెచ్‌లో డిపాజిట్ కుంభకోణంలో కొత్త పేర్లు వినబడుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వెంకటరమణారావుకు మల్కాజిగిరికి చెందిన కొందరు నేతలు.. మాజీ కౌన్సిలర్ వెంకటేష్, అతని సోదరుడు లక్ష్మణ్, దామోదర్‌లను పరిచయం చేసినట్లు తెలిసింది. ఆ పరిచయంతో బ్యాంక్‌లో ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తే కొంత మొత్తం ఇస్తామని చెప్పారు. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించేం దుకు వెంకటరమణారావు ఒప్పించారు. వెంకట రమణారావుకు వచ్చిన కమిషన్ రూ.5 లక్షల్లో... ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి తెలియజేసిన నేత రూ. లక్ష వరకు తీసుకున్నట్లు తెలిసింది. కుంభకోణంలో కీలక వ్యక్తులుగా ఉన్న వారిని వెంకట రమణారావుకు పరిచయం చేసిన నేతను విచారిస్తే నిజాలు తె లుస్తాయని అంటున్నారు.