మరుగుదొడ్ల నిధులూ మింగేశారు
► వెంకటాపురంలో నిధుల దుర్వినియోగం కేసు విచారణ
► కలెక్టర్, ఇతరులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో భారీగా నిధుల దుర్వినియోగమైనట్టు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఆ గ్రామానికి చెందిన మాత్రపు లోకేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌ను మంగళవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదులైన పలువురు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది.
తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు వేయాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, డీపీఓ, ఏలూరు ఎంపీడీవో, వెంకటాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. తమ గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేయకుండానే పాత వాటికి సున్నం వేసి కొత్తవాటిగా రికార్డుల్లో చూపించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.శ్యాంసుందర్‌రావు వాదించారు. పంచాయతీ కార్యదర్శి, కొందరు గ్రామ పెద్దలు కలసి మరుగుదొడ్ల నిధుల్ని స్వాహా చేశారని ఆరోపించారు. దీనికి ఎంపీడీఓ, సిబ్బంది పూర్తిగా సహకరించారని అన్నారు.
మూడున్నరేళ్లలో మూడు వేల మరుగుదొడ్ల నిర్మాణం చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయని, వాస్తవంగా చాలా మరుగుదొడ్లు లేవని వాదించారు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా అధికారులు ఇవ్వలేదని, కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపారు. ఆడిట్ మాత్రం జరిగిపోయిందన్నారు. గత మార్చి 22 నాటికి ఎంపీడీవో బోగస్ కాంట్రాక్టర్‌కు రూ.2.41 కోట్ల 28 వేల బిల్లలకు గాను రూ.1.24 కోట్ల 31 వేలు చెల్లించేశారని న్యాయవాది శ్యాంసుందర్‌రావు చెప్పారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించి ప్రజాధనాన్ని స్వాహా చేసిన వారి నుంచి తిరిగి రాబట్టాలని, తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.