కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదు
- సంక్రాంతి పోటీలకు హైకోర్టు బ్రేక్
- నిబంధనల అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలి
సాక్షి, హైదరాబాద్: కోడి పందేల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.ఈ పందేలకు ప్రజా ప్రతినిధులు హాజరవుతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. చట్టాలను చేసే వారే వాటిని ఉల్లంఘిస్తూ, ఇతరులకూ చట్ట ఉల్లంఘనలకు పాల్పడే ధైర్యాన్నిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా చూసేందుకు ముఖ్యంగా తూర్పు , పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంయుక్త పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ బృందంలో ఎస్‌ఐ స్థాయికి తగ్గని అధికారి, తహసీల్దార్, జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా స్వచ్ఛంద సంస్థ సభ్యుడుగానీ ఉండాలంది. వీటిని జనవరి 7, 2017లోపు ఏర్పాటు చేయాలని, ఈ బృందానికి ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఫోటోగ్రాఫర్ సహకారం అందించేలా చూడాలంది.కోళ్ల పందేలకు ఉద్దేశించిన ఏ ప్రాంతాన్నైనా సందర్శించేందుకు ఈ బృందాలకు అధికారం ఉందన్న హైకోర్టు, పందేలకు సిద్ధం చేసిన కోళ్లను, డబ్బును జప్తు చేయవచ్చునంది.
జంతు హింస నిరోధకచట్టం, ఏపీ గ్యాంబ్లింగ్ చట్ట నిబంధనల పూర్తిస్థాయి అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలను ఆదేశించింది. నిబంధనల అమలులో లోపం జరిగితే అందుకు వారు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించిం ది. పందేలకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్ కుమార్, కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన పిల్‌లను, పందేలకు అనుమతివ్వాలని పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌లపై ధర్మాసనం తీర్పు వెలువరించింది.