ఇంటి నుంచే చూడొచ్చు!
- మెట్రో పొలిస్ సదస్సు ప్రత్యక్ష ప్రసారం
- చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వచ్చేనెల 6- 10వ తేదీల జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సును టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు పర్యటించే మార్గాల్లోని అన్ని విభాగాలకు చెందిన రహదారులకు మరమ్మతులు చేయనున్నారు. మెట్రో రైలు కారిడార్లలో బారికేడ్లను తగ్గించనున్నారు. వాహనాలు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా సదస్సు పూర్తయ్యే వరకు కేవలం పని జరుగుతున్న ప్రాంతంలోనే బారికేడ్లు ఉంచుతారు.
ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఆ వివరాల ప్రకారం...9వ తేదీన సదస్సులో రాష్ట్రపతి పాల్గొంటారు. సదస్సును ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్‌బండ్‌లపై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనలు సైతం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ ద్వారా సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజుకారోజు నాలుగు పేజీల పత్రికను వెలువరించనున్నారు. సదస్సు విశేషాలు, ఫొటోలు తదితరమైన వాటితో నాలుగు రోజుల పాటు ఈ సంచికలు వెలువరిస్తారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, వీఐపీలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, జీహెచ్‌ఎంసీలు రాత్రి విందు ఇవ్వనున్నాయి. 6వ తేదీన తారామతి బారాదరిలో పర్యాటకశాఖ, 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి కేసీఆర్, 8న జలవిహార్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్ మాజిద్ ఈ విందులిస్తారు.
సదస్సు నిర్వహణకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రూ.కోటి, హెచ్‌ఎండీఏ రూ.2 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు నిధులిచ్చాయని కమిషనర్ తె లిపారు. ఎస్‌బీహెచ్ స్పాన్సర్‌షిప్‌గా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ జస్బీర్‌సింగ్ అనేజా రూ.30 లక్షల చెక్కునిచ్చారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు సైతం స్పాన్సర్‌షిప్‌నకు ముందుకొస్తున్నాయని కమిషనర్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.