ఆర్థికంగా ప్రభావం చూపిస్తున్న ఇంటర్నెట్ నిలిపివేత
పలు కారణాలతో సేవలు నిలిపివేస్తున్న దేశాలు
2024లో ప్రపంచవ్యాప్తంగా 88,788 గంటలపాటు ఆగిన నెట్
నెట్ నిలిపివేత, సోషల్ మీడియా ఖాతాల స్తంభనతో రూ.68,319 కోట్ల నష్టం
రూ.279 కోట్ల మేర ప్రభావంతో 6వ స్థానంలో భారత్
సాక్షి, హైదరాబాద్: నిరసనలు, ఆందోళనలు, ఎన్నికలు, మత ఘర్షణలు, చివరకు పరీక్షల సమయంలో సమాచారం, సందేశాల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రాంతాల వారీగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, సామాజిక మాధ్యమాలను స్తంభింప జేయడం ఇటీవలి కాలంలో సాధారణ విషయమై పోయింది. రాష్ట్రం, దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతోంది. 2024లో 88,788 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు, సామాజిక మాధ్యమాలు స్తంభించడంతో 60.48 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం పడినట్లు అంచనా. 28 దేశాల ఆర్థిక రంగంపై రూ.68,319 కోట్ల మేర ప్రభావం చూపించగా..మన దేశంలో రూ.279 కోట్ల మేర 6.77 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపించినట్లుగా లెక్కలు వేశారు.
ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉండగా పొరుగు దేశం పాకిస్తాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మయన్మార్ రెండు, బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ‘ఎక్స్’, టిక్‌టాక్, సిగ్నల్ అత్యధిక గంటల పాటు స్తంభించిపోయాయి. ఇంటర్నెట్ నిలిపివేత డిజిటల్ ఎకానమీ, టూరిజం, స్టార్టప్ రంగాలపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే విద్య, టెలీమెడిసిన్‌తో పాటు అత్యవసర సేవలపైనా ప్రభావం చూపుతోంది.
పలు సంస్థల సూచికలు పరిగణనలోకి..
ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాల ద్వారా జరిగే నష్టాన్ని ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ), యూరోస్టాట్, యూఎస్ సెన్సస్ తదితర సంస్థల సూచికలను ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం, సోషల్ మీడియా స్తంభన, ఇంటర్నెట్ స్పీడ్‌ను 2జీ స్థాయికి తగ్గించడం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ నిలిపివేత, సామాజిక మాధ్యమాలను స్తంభింప చేసేందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలను ఒక రకంగా ఇంటర్నెట్ సెన్సార్‌షిప్‌గా భావించవచ్చు.
⇒ గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా పోలీసులు ఇంటర్‌నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
⇒ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై రైతుల దాడి నేపథ్యంలో.. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది నవంబర్ 12న దుద్యాల ప్రాంతంలో కొద్ది గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
⇒ గత ఏడాది నవంబర్‌లో మత ఘర్షణలతో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో, రెండు వర్గాల మధ్య హింస చెలరేగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేశారు. డిసెంబర్‌లో రైతుల నిరసనల నేపథ్యంలో హరియాణాలోని అంబాలాలో, జాతి ఘర్షణలు చెలరేగుతున్న మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.
తరచూ స్తంభిస్తున్న ‘ఎక్స్’, ‘టిక్ టాక్’
ప్రాంతాల వారీగానే కాకుండా దేశ సార్వ¿ౌమత్వం, సమగ్రత, భద్రతకు ప్రమాదం పొంచి ఉందనుకున్న ఖాతాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. భారత్‌లో గత ఏడాది 28 వేలకు పైగా సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయగా ఇందులో ఫేస్‌బుక్, ‘ఎక్స్’కు సంబంధించినవే సుమారు 10 వేల వరకు ఉన్నాయి.
సామాజిక మాధ్యమ ఖాతాల తొలగింపులో.. అభ్యంతరకర సమాచారం ఉన్న యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌కు సంబంధించిన ఖాతాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. తొలగింపునకు గురైన వాటిలో ఎక్కువగా ఖలిస్తానీ అనుకూల సమాచారంతో కూడిన ఖాతాలతోపాటు విద్వేష ప్రసంగాలు, జాతీయ భద్రత, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే రీతిలో ఉన్న ఖాతాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment