రూ.100 కోట్ల బకాయి చెల్లింపులకు ఒప్పుకోని ‘తెన్హా’... మొత్తం చెల్లింపులపై స్పష్టమైన హామీకి డిమాండ్
నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేసినట్లు ప్రకటన... 368 ఆసుపత్రులకు దాదాపు రూ.1,200 కోట్ల బకాయిలు
సేవల నిలిపివేతకు కారణాలు వివరిస్తూ ఆసుపత్రుల ముందు బోర్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన దాదాపు రూ.1,200 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తమ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసినట్లు తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో రోగులకు వివరిస్తూ బోర్డులను కూడా తమ ఆసుపత్రుల ముందు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ సిబ్బంది కూడా రోగులకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది.
బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి: తెన్హా
నెట్‌వర్క్ పరిధిలోని 368 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్‌ఎస్ (ఉద్యోగులు), జేహెచ్‌ఎస్ (జర్నలిస్టులు) పథకాల కింద ప్రతి నెలా సుమారు రూ.100 కోట్ల విలువైన చికిత్సలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఇప్పటివరకు రూ. 1,030 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.730 కోట్లు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు. ఈ లెక్కన ఈ సంవత్సరానికి సంబంధించి రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించినట్లు తెన్హా చెబుతోంది.
ఇంకా రూ.1,100 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని సంఘం నేతలు తెలిపారు. బకాయిలు చెల్లించకుంటే ఈ నెల 10 నుంచి సేవలు నిలిపివేస్తామని తెన్హా ప్రకటించటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివశంకర్ ఆ సంఘం నాయకులతో గురువారం చర్చలు జరిపారు. రూ.100 కోట్లను టోకెన్ కింద వెంటనే విడుదల చేస్తామని, వచ్చే నెలలో మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. దీంతో తెన్హా వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి.
కొత్తగా ఇచ్చిందేంటి?
బకాయిల్లో కేవలం రూ.100 కోట్లువిడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తెన్హా తప్పు పట్టింది. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.100 కోట్ల విలువైన చికిత్సలు అందిస్తుంటే.. సంవత్సరం నుంచి రావాల్సిన రూ.1,200 కోట్లకుగాను రూ.100 కోట్లు ఇస్తామనటం సరికాదని పేర్కొంది. ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ పథకాలకు సంబంధించి 18 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో శివశంకర్‌కు శుక్రవారం లేఖ రాస్తూ.. తమ బకాయిల పరిష్కారానికి కచ్చితమైన మార్గం చూపేంత వరకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment