live broadcast
-
లైవ్‌లోకి వచ్చేసిన బుడతడు..
న్యూస్ రూమ్‌లో నుంచి విశ్లేషణ అందిస్తున్న మహిళ రిపోర్టర్‌కు ఆమె కొడుకు వల్ల చిన్నపాటి ఇబ్బంది కలిగింది. అయితే అందుకు సంబంధించిన వీడియో ఆ చానల్ వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కుబె అనే మహిళ ఎంఎస్ఎన్బీసీ చానల్లో న్యూస్ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రోజున ఉత్తర సిరియాలో టర్కీ దాడులకు సంబంధించిన విశ్లేషణను ఆమె లైవ్‌లో అందిస్తున్నారు. విశ్లేషణ మధ్యలో కుబె కొడుకు ర్యాన్.. వెనకాల నుంచి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన ఆమె ‘నన్ను క్షమించండి, నా పిల్లలు ఇక్కడే ఉన్నార’ని చెప్పారు. మళ్లీ వెంటనే తన విశ్లేషణను ప్రారంభించారు. అయితే ఈ సమయంలో చానల్ స్క్రీన్‌పై ఆ విశ్లేషణకు సంబంధించిన గ్రాఫిక్ విజువల్‌ను ప్లే చేశారు. ఈ దృశ్యాలను ఎంఎస్ఎన్బీసీ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. కొన్నిసార్లు బ్రేకింగ్ న్యూస్ కవర్ చేసేటప్పడు.. అనుకోని బ్రేకింగ్ న్యూస్ జరుగుతుందని పేర్కొంది. #workingmoms అనే ట్యాగ్ కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 3.4 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. వర్క్ ప్లేస్‌లోకి పిల్లల్ని తీసుకురావడానికి అవకాశం కల్పించిన ఆ చానల్ నిర్వహకులను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గతంలో బీబీసీ చానల్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. Sometimes unexpected breaking news happens while you're reporting breaking news. #MSNBCMoms #workingmoms pic.twitter.com/PGUrbtQtT6 — MSNBC (@MSNBC) October 9, 2019 -
కోర్టు విచారణ: మరో కీలక ముందడుగు!
న్యూఢిల్లీ: కోర్టు విచారణల్లో పారదర్శకతకు మరో కీలక ముందడుగు పడింది. రాజ్యాంగ, జాతీయ ప్రయోజనాలున్న కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. కోర్టుల్లో పెట్టే కెమెరాలను సూర్యకాంతితో పోల్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. సూర్యుడి వెలుగు అత్యుత్తమ క్రిమిసహారిణి, ఈ కెమరాలు పారదర్శకత తెచ్చేందుకు సాయపడతాయని పేర్కొంది. ప్రయోగాత్మకంగా తొలుత జాతీయ, రాజ్యాంగ ప్రయోజనాలున్న కేసును రాజ్యాంగ ధర్మాసనాలు విచారిస్తున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిస్తున్నామని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. వివాహ వివాదాలు, లైంగిక దాడుల వంటి సున్నితమైన కేసులను ఎప్పటికీ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ అంశంలో జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్‌లు కలిసి ఒక తీర్పును, జస్టిస్ చంద్రచూడ్ మరో తీర్పును ఇచ్చినప్పటికీ, ఈ రెండు తీర్పుల సారాంశం దాదాపుగా ఒక్కటే. 10 నిమిషాలు ఆలస్యంగా.. కోర్టు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను కోర్టు నిర్దేశించింది. ప్రత్యక్ష ప్రసారాల కోసం ముందుగా విచారణ జరుపుతున్న కోర్టు అనుమతిని లిఖితపూర్వకంగా తీసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లుగా లేదా ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో విచారణ మధ్యలోనైనా ప్రత్యక్ష ప్రసారాలను నిలుపుదల చేసేందుకు కోర్టుకు అధికారం ఉంది. కోర్టులో జరుగుతున్న విచారణను నిర్దిష్ట సమయం (దాదాపు పది నిమిషాలు) ఆలస్యంగా ప్రసారం చేయాలని సూచించింది. బయటకు వెళ్లకూడని సమాచారం ఏదైనా ఉంటే దానిని ఎడిటింగ్‌లో తీసేసేందుకే ఈ ఏర్పాటు. ఏ కోణంలో కెమెరాలు ఉంచాలన్న దానిపైనా కోర్టు పరిమితులు విధించింది. బహిరంగ కోర్టుల స్ఫూర్తితోనే.. బహిరంగ కోర్టుల స్ఫూర్తితోనే ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతిస్తున్నామనీ, దీని వల్ల కేసుకు సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని జస్టిస్ చంద్రచూడ్ తీర్పులో పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ మరో అడుగు ముందుకేసే సమయం ఈ కోర్టుకు వచ్చిందని వివరించారు. జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్లకు కలిపి జస్టిస్ ఖాన్విల్కరే తీర్పు రాశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఐర్లాండ్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
మహిళా విలేకరికి ‘లైవ్’లో ముద్దు!
మాస్కో: ప్రపంచకప్ సాకర్ మ్యాచ్‌ల కవరేజీలో ఉన్న మహిళా రిపోర్టర్‌ను ప్రత్యక్ష ప్రసారం సమయంలోనే ఒక ఆకతాయి ముద్దుపెట్టి వెళ్లిపోయాడు. ఈ నెల 15న మర్డోవియా అరెనా స్టేడియం వద్ద ఈ ఘటన జరిగింది. ‘డెట్స్చే వెల్లె’ న్యూస్ చానెల్లో కొలంబియాకు చెందిన జులియెత్ గాంజలెజ్ థెరాన్ అనే అమ్మాయి పనిచేస్తుంది. లైవ్ కవరేజీలో నిమగ్నమైన ఆమెను ఒక ఆకతాయి ఛాతీ భాగంలో తగులుతూ చెంపపై ముద్దుపెట్టి వెళ్లిపోయాడు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనపై జరిగిన లైంగిక వేధింపులపై వాపోయింది. ‘ప్రత్యక్ష ప్రసారం కోసం నేను రెండు గంటల పాటు కసరత్తు చేశాను. లైవ్‌లో ఎలాంటి అంతరాయం కలగకూడదని ఇలా ప్రవర్తించినప్పటికీ నా పని (న్యూస్ ప్రజంటేషన్) పూర్తి చేశాకే ఆకతాయి కోసం వెతికాను. కానీ ఆ వ్యక్తిని నేను కనుక్కోలేకపోయాను’ అని గాంజలెజ్ థెరాన్ అందులో పేర్కొంది. -
అసెంబ్లీలో స్పీచ్.. ఫేస్బుక్లో లైవ్
గువహటి: అసెంబ్లీలోని తన ప్రసంగాన్ని ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేసినందుకు అస్సాం ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి మూడు రోజులపాటు సస్పెండ్ చేశారు. సభ్యుడిని సస్పెండ్ చేయాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసిందని, సిఫార్సును ఆమోదించి అమినుల్‌ను ఫిబ్రవరి 8 వరకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ సోమవారం పేర్కొన్నారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమినుల్ మాట్లాడుతూ.. సభలో సభ్యుల కార్యకలాపాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మొత్తం లైవ్‌లో ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు. -
కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడు
వర్జీనియా: లైవ్ రిపోర్ట్ చేస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులపై కాల్పులు జరిపిన అగంతకుడు అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వర్జీనియాలో బుధవారం చోటుచేసుకుంది. టీవీ జర్నలిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారి చావుకు కారకుడైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన వివరాలు.. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్లు మౌంటేన్లేక్కు సమీపంలోగల బ్రిడ్జ్‌వాటర్ ప్లాజాలో మార్నింగ్ షో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలోనే ఆ బిల్డింగ్ లోకి చొరబడ్డ సాయుధుడు.. రిపోర్టర్, కెమెరామెన్లను విచక్షణారహితంగా కాల్చిచంపాడు. సాయుధుడి దృష్టినుంచి తప్పించుకునే క్రమంలో ఆడమ్.. కెమెరాను జారవిడవడంతో ఇద్దరిపైనా కాల్పులు జరిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతోపాటు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. అయితే దుండగుడు ప్లాజా బిల్డింగ్ లోనే దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల స్కూళ్లు, కాలేజీలు సహా వ్యాపార సముదాయాలు తెరవొద్దని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. దుండగుడ్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా నిందితుడు తనను కాల్చుకుని మృతిచెందాడని పోలీసులు తెలిపారు. -
లైవ్ ప్రోగ్రామ్‌లో ఇద్దరు జర్నలిస్టుల కాల్చివేత
అమెరికాలో దారుణం జరిగింది. లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులను ఓ ఆగంతకుడు కాల్చిచంపాడు. కెమెరా కిందపడిపోవడంతో కాల్పుల దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. వర్జీనియా రాష్ట్రంలోని బెడ్ఫోర్డ్ కౌంటీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:45 నిమిషాలకు) ఈ సంఘటన జరిగింది. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్లు మౌంటేన్లేక్కు సమీపంలోగల బ్రిడ్జ్‌వాటర్ ప్లాజాలో మార్నింగ్ షో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలోనే ఆ బిల్డింగ్ లోకి చొరబడ్డ సాయుధుడు.. రిపోర్టర్, కెమెరామెన్లను విచక్షణారహితంగా కాల్చిచంపాడు. సాయుధుడి దృష్టినుంచి తప్పించుకునే క్రమంలో ఆడమ్.. కెమెరాను జారవిడవడంతో ఇద్దరిపైనా కాల్పులు జరిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతోపాటు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. దుండగుడు ఇంకా ప్లాజా బిల్డింగ్ లోనే దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల స్కూళ్లు, కాలేజీలు సహా వ్యాపార సముదాయాలు తెరవొద్దని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం దుండగుడ్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
ఇంటి నుంచే చూడొచ్చు!
మెట్రో పొలిస్ సదస్సు ప్రత్యక్ష ప్రసారం చురుగ్గా ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వచ్చేనెల 6- 10వ తేదీల జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సును టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు పర్యటించే మార్గాల్లోని అన్ని విభాగాలకు చెందిన రహదారులకు మరమ్మతులు చేయనున్నారు. మెట్రో రైలు కారిడార్లలో బారికేడ్లను తగ్గించనున్నారు. వాహనాలు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా సదస్సు పూర్తయ్యే వరకు కేవలం పని జరుగుతున్న ప్రాంతంలోనే బారికేడ్లు ఉంచుతారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఆ వివరాల ప్రకారం...9వ తేదీన సదస్సులో రాష్ట్రపతి పాల్గొంటారు. సదస్సును ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్‌బండ్‌లపై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనలు సైతం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ ద్వారా సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజుకారోజు నాలుగు పేజీల పత్రికను వెలువరించనున్నారు. సదస్సు విశేషాలు, ఫొటోలు తదితరమైన వాటితో నాలుగు రోజుల పాటు ఈ సంచికలు వెలువరిస్తారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, వీఐపీలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, జీహెచ్ఎంసీలు రాత్రి విందు ఇవ్వనున్నాయి. 6వ తేదీన తారామతి బారాదరిలో పర్యాటకశాఖ, 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి కేసీఆర్, 8న జలవిహార్‌లో జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ ఈ విందులిస్తారు. సదస్సు నిర్వహణకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రూ.కోటి, హెచ్ఎండీఏ రూ.2 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు నిధులిచ్చాయని కమిషనర్ తె లిపారు. ఎస్బీహెచ్ స్పాన్సర్‌షిప్‌గా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ జస్బీర్సింగ్ అనేజా రూ.30 లక్షల చెక్కునిచ్చారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు సైతం స్పాన్సర్‌షిప్‌నకు ముందుకొస్తున్నాయని కమిషనర్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. -
యప్ టీవీ నుంచి లైవ్ కవరేజి సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాసీలు లక్ష్యంగా ఇంటర్నెట్ టీవీ సేవలు అందించే యప్‌టీవీ తాజాగా లైవ్ కవరేజి సర్వీసులను ప్రారంభించింది. కార్పొరేట్ ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు మొదలైన వాటిని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ‘యప్‌టీవీ లైవ్’ సర్వీసులు ఉపయోగపడతాయని సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో తెలిపారు. లైవ్ టెలికాస్ట్ మధ్యలో అంతరాయం కలగకుండా ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు వివరించారు. అలాగే, వీడియో ఆన్ డిమాండ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమాలను సుమారు నెల రోజుల దాకా వీక్షించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన డివైజ్‌లను వీడియోగ్రాఫర్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు, నెలవారీ అద్దె సుమారు రూ. 13,000 నుంచి ఉంటుందని (డేటా స్టోరేజి మొదలైనవన్నీ కలిపి) ఉదయ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇది అందుబాటులో ఉండగలదన్నారు. వీడియోగ్రాఫర్లే కాకుండా.. ఈ సర్వీసులు పొందదల్చుకునే వినియోగదారులూ నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు. యప్టీవీలో ప్రస్తుతం 170 పైగా టీవీ చానళ్లను అందిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో 70-80 మిలియన్ డాలర్ల ఆదాయాలను అంచనా వేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు.