యప్ టీవీ నుంచి లైవ్ కవరేజి సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాసీలు లక్ష్యంగా ఇంటర్నెట్ టీవీ సేవలు అందించే యప్‌టీవీ తాజాగా లైవ్ కవరేజి సర్వీసులను ప్రారంభించింది. కార్పొరేట్ ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు మొదలైన వాటిని ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ‘యప్‌టీవీ లైవ్’ సర్వీసులు ఉపయోగపడతాయని సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో తెలిపారు. లైవ్ టెలికాస్ట్ మధ్యలో అంతరాయం కలగకుండా ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు వివరించారు.
అలాగే, వీడియో ఆన్ డిమాండ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమాలను సుమారు నెల రోజుల దాకా వీక్షించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన డివైజ్‌లను వీడియోగ్రాఫర్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు, నెలవారీ అద్దె సుమారు రూ. 13,000 నుంచి ఉంటుందని (డేటా స్టోరేజి మొదలైనవన్నీ కలిపి) ఉదయ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇది అందుబాటులో ఉండగలదన్నారు. వీడియోగ్రాఫర్లే కాకుండా.. ఈ సర్వీసులు పొందదల్చుకునే వినియోగదారులూ నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు. యప్‌టీవీలో ప్రస్తుతం 170 పైగా టీవీ చానళ్లను అందిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో 70-80 మిలియన్ డాలర్ల ఆదాయాలను అంచనా వేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు.