
సమాచార, ప్రసార మంత్రి వైష్ణవ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త తరాన్ని ఆకట్టుకునేందుకు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న ఆన్‌లైన్ మీడియా ప్లాట్‌ఫాంల వల్ల వార్తాపత్రికలు, వార్తా చానళ్ల వంటి సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. ‘‘సంప్రదాయ మీడియా సంస్థలకు సంబంధించిన కంటెంట్‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు విస్తారంగా వాడుకుంటున్నాయి.
ఇందుకు వాటికవి సముచిత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. గురువారం స్టోరీబోర్డ్18 డీఎన్‌పీఏ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా పెను సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు.
‘‘ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు కృత్రిమ మేధ (ఏఐ) తదితరాల సాయంతో కంటెంట్‌ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తూ పాఠకులు, వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో యువత సంప్రదాయ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ మీడియావైపు మళ్లుతోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా తన పాత్రను సమీక్షించుకోవాల్సి ఉంది. శరవేగంగా చోటుచేసుకుంటున్న కొత్త తరం మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం’’ అని సూచించారు.
ఈ మార్పిడి క్రమంలో సంప్రదాయ మీడియాకు అన్నివిధాలా దన్నుగా నిలిచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిజిటల్ ప్లాట్‌ఫాంలు తమ ఆదాయంలో సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలకు సముచిత వాటా ఇచ్చేలా పలు దేశాల్లో ఇప్పటికే చట్టాలు అమల్లో ఉన్నాయని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘భారత్‌లో మాత్రం ఇంకా ఆ పరిస్థితి లేదు. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఇప్పటికీ ప్రధాన స్రవంతి సంస్థల కంటెంటే ప్రధాన వనరు. కానీ వాటి ఆదాయంలో మాత్రం ప్రధాన మీడియా సంస్థలకు తదనుగుణంగా అందడం లేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment